iDreamPost

మానవత్వం చాటుకున్న భారత్‌

మానవత్వం చాటుకున్న భారత్‌

ప్రపంచం ఆపత్కాలంలో ఉన్న సమయంలో భారత్‌ తన మానవత్వాన్ని చాటుకుంది. కరోన వైరస్‌ నివారణలో మంచి ఫలితాలనిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు 24 రకాల ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. గత నెల 25వ తేదీన నిషేధం విధించగా.. రెండు వారాల్లోనే దాన్ని భారత్‌ తొలగించి ప్రపంచానికి అండగా నిలిచింది.

అమెరికా, యూరప్‌ ఖండంలో కరోన వైరస్‌ విజృంభిస్తోంది. అమెరికాలో బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తమకు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత శనివారం ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి అడిగారు. ఆ విషయం ట్రంప్‌ స్వయంగా విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. అయితే భారత్‌దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఔషధాల ఎగుమతులపై ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్‌కు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

తాజాగా ఈ రోజు ట్రంప్‌ మరోసారి ప్రధాని మోదీతో మాట్లాడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఔషధాలు ఎగుమతులపై నిషేధం ఎత్తివేసి, తమకు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను సరఫరా చేయాలని మరోమారు కోరారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి పునరాలోచించి ఔషధాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు.

హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ తోపాటు ఇతర ఔషధాలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. ఆపత్కాలంలో మానవతాదృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశ ప్రజలకు అవసరమైన మొత్తంతోపాటు మరో 25 శాతం ఔషధాన్ని నిల్వ చేసుకుని, మిగిలిన ఔషధాలనే ఎగుమతి చేస్తామని కేంద్రం ప్రకటించింది. మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధం కరోనా వైరస్‌ సోకిన బాధితులు కోలుకునేందుకు మెరుగ్గా ఉపయోగపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి