SNP
USA Cricket, PAK vs USA, T20 World Cup 2024: పాకిస్థాన్‌ను ఓడించి.. ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించింది అమెరికా క్రికెట్ జట్టు. అయితే.. అమెరికాలో క్రికెట్ ఇంత ఫాస్ట్‌గా ఎదగడానికి కారణాలు ఏంటా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
USA Cricket, PAK vs USA, T20 World Cup 2024: పాకిస్థాన్‌ను ఓడించి.. ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించింది అమెరికా క్రికెట్ జట్టు. అయితే.. అమెరికాలో క్రికెట్ ఇంత ఫాస్ట్‌గా ఎదగడానికి కారణాలు ఏంటా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ వేదికపై పాకిస్థాన్ లాంటి మాజీ ఛాంపియన్ టీమ్‌ను.. ప్రపంచ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న పసికూన జట్టు అమెరికా ఓడించింది. ఈ విజయాన్ని చాలా మంది ఒక సంచలనంగా, గాలివాటు విజయంగా, లేక పాకిస్థాన్ చేతకానితనంగా భావించవచ్చు. కానీ, ఇది ఏదో లక్‌లో వచ్చిన విజయం అయితే కాదు.. దీని వెనుక అమెరికా పడుతున్న కష్టం, వాళ్ల ప్లానింగ్, డెడికేషన్ ఎంతో ఉంది. కొన్నేళ్లుగా వారి కష్టానికి దక్కిన ఫలితమే ఈ అపూర్వ విజయం. ఒక్క లీగ్ మ్యాచ్ విజయంతో అమెరికా టీమ్ ఎక్కడికో వెళ్లిపోదు కానీ.. భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరుకుంటుందని మాత్రం అనిపిస్తోంది. అన్ని రంగాల్లో ముందుండే అమెరికా.. రానున్న కాలంలో క్రికెట్ రారాజుగా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. నిన్నటి మొన్నటి వరకు క్రికెట్ పేరు కూడా పెద్దగా వినిపించని అమెరికాలో ఈ రేంజ్లో క్రికెట్ ఎలా డెవలప్ అయింది? ఇంత ఫాస్ట్‌గా పాకిస్థాన్‌ను ఓడించగల టీమ్‌ను అమెరికా ఎలా తయారు చేయగలిగింది? ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టిన ఆటగా అందరికి తెలుసు. బ్రిటీషర్లు పాలించిన అన్ని దేశాల్లో ఈ ఆట వ్యాప్తి చెందింది. అందులో భాగంగానే.. ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా అన్ని దేశాల్లో ఈ ఆట బాగా అభివృద్ధి చెందింది. కామన్వెల్త్ కంట్రీల్లో క్రికెట్ అత్యంత ఆదరణ పొందిన ఆటగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆదరణ పొందుతున్న రెండో అతి పెద్ద క్రీడగా క్రికెట్ ఉంది. కానీ, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇలా చాలా దేశాల్లో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు దక్కుతున్న ఆదరణ దృష్ట్యా.. క్రికెట్ ఆడని దేశాల్లో కూడా క్రికెట్‌ను డెవలప్ చేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఎంతో కృష్టి చేసింది. క్రికెట్ అభివృద్ధి కోసం చాలా నాన్ క్రికెటింగ్ దేశాల్లో ఐసీసీ కృషి చేసినా.. అమెరికాలోనే ఇంత ఫాస్ట్‌గా క్రికెట్ అభివృద్ధి చెందడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
అందులో అతి ముఖ్యమైనది వలస జీవులను ఆదరించడం. అమెరికాలో అనేక దేశాలకు చెందిన వారు అక్కడికి వచ్చి స్థిరపడుతూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా ఉపఖండం నుంచి అంటే.. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ఎక్కువగా ఉంటారు. అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తుంటారు. ఇండియన్స్‌కు క్రికెట్ అంటే ఒక మతం. సో.. అమెరికాలో క్రికెట్ అభివృద్ధి వెనుక ఇండియన్స్ ప్రధాన కారణంగా ఉన్నారు. డొమెస్టిక్ లెవెల్ నుంచి క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి అమెరికన్ క్రికెట్ ఎంటర్ప్రైజెస్(ఏస్) మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని నిర్వహించాలని ప్రణాళిక వేసింది. 2018లో దీనికి బీజం పడింది. అంతకంటే ముందు ‘యూఎస్ఏ క్రికెట్ అసోసియేషన్’ పేరుతో క్రికెట్ నిర్వహణ కోసం ఒక బోర్డు ఉన్నా.. అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు.
దాని స్థానంలో ‘యూఎస్ఏ క్రికెట్’ ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ బోర్డుగా ఉంది. ఏస్ భాగస్వామ్యంలో మైనర్, మేజర్ క్రికెట్ లీగ్స్‌లో అమెరికాలో టీ20 క్రికెట్‌ను బలోపేతం చేసింది యూఎస్ఏ క్రికెట్ బోర్డు. 2023లో నిర్వహించిన ఎమ్ఎల్సీ(మేజర్ లీగ్ క్రికెట్) టీ20 టోర్నీ సక్సెస్ వారి ఐదేళ్ల కష్టానికి ఫలితం. అయితే.. అమెరికా వద్ద చాలా డబ్బు ఉంది, ఎన్ని టోర్నీలు కావాలంటే అన్ని టోర్నీలు నిర్వహించగల సామర్థ్యం ఉంది. కానీ.. ఏదైన రంగంలో ఎదగాలంటే వాళ్లు ఫస్ట్ రూట్స్‌ను పట్టుకుంటారు. ఇప్పుడు క్రికెట్ విషయంలోనూ అదే చేస్తున్నారు. తమ దేశంలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా.. అమెరికా జట్టు అంటే కేవలం అమెరికన్స్ మాత్రమే ఉండాలనే పిచ్చి ఆలోచనను వాళ్లు చేయలేదు. అలాగే క్రికెట్ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం ఉండదు. ఏ నిర్ణయమైనా.. ‘యూఎస్ఏ క్రికెట్’ చాలా స్వతంత్రగా తీసుకుంటుంది.
దేశంలోని యువత క్రికెట్ వైపు అడుగులు వేయాలంటే.. వారిలోనూ క్రికెట్ నైపుణ్యాలు పెరగాలంటే.. ఆల్రెడీ క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే ఇండియన్స్ సాయం కూడా తీసుకుంది. అమెరికాలో స్థిరపడిన ఏ దేశ మూలాలు ఉన్నా.. టాలెంట్ ఉంటే దేశవాళి టీమ్స్‌లో అలాగే జాతీయ జట్టులో చోటు కల్పించింది. ఇప్పుడు అమెరికా టీమ్‌లో వేరే దేశాల మూలాలు ఉన్న ప్లేయర్లు ఉండొచ్చు.. కానీ, భవిష్యత్తులో అమెరికన్ల హవా ఆ టీమ్‌లో కచ్చితంగా కనిపిస్తుంది. ఆటను అమెరికన్ల జీవితంలోకి జొప్పించడానికి.. సక్సెస్ఫుల్ ప్లేయర్లు.. న్యూజిలాండ్‌కు చెందిన కోరీ అండ్రసన్ లాంటి ఆటగాళ్లను జాతీయ జట్టులోకి తీసుకుంది. అమెరికా తీసుకున్న ఇలాంటి బ్రాడ్ మైండెడ్ ఆలోచనలతోనే ఇప్పుడు పాకిస్థాన్‌పై అమెరికా జట్టు టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించింది.
ఈ విజయం.. అమెరికన్లను సైతం క్రికెట్ వైపు చూసేలా చేసింది. తమ దేశం వరల్డ్ కప్ వేదికపై ఓ మాజీ ఛాంపియన్‌ను ఓడించిందా? అనే ఆశ్చర్యం, ఆనందం ఇప్పుడు అమెరికన్లలో కలిగింది. అదే రేపటి అమెరికన్ల తరం క్రికెట్లోకి అడుగులు వేసేందుకు దోహదం చేయనుంది. క్రికెట్‌నే నేర్చుకోవడానికి ఏ దేశానికి చెందిన ఆటగాడినైనా టీమ్‌లోకి తీసుకోవడం, దేశవాళి క్రికెట్ కోసం, అలాడే పాపులారిటీ కోసం మేజర్ లీగ్ క్రికెట్‌ను నిర్వహించడం, క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం లేకపోవడం.. ఇలా ఈ మూడు వ్యూహాలతో ఏ రంగంలో అయినా చాలా వరకు నంబర్ వన్‌గా ఉండే అమెరికా.. క్రికెట్‌ను డెవలప్ చేసే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు, అవలంభించన విధానాలే వారి సక్సెస్‌కు కారణం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Co-hosts USA go top of Group A after their incredible win against Pakistan in Dallas 📈
How it happened ➡️ https://t.co/j4XnovAdoZ pic.twitter.com/GJycARkTNl
— T20 World Cup (@T20WorldCup) June 7, 2024