iDreamPost

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 15

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 15

శ‌రీరంలో మ‌న‌కి క‌న్ను, ముక్కు, చెవి క‌నిపిస్తాయి. గుండె, కిడ్నీ, కాలేయం క‌నిపించ‌వు. అవ‌న్నీ ర‌సాయ‌నిక చ‌ర్య‌ల్ని క‌రెక్ట్‌గా జ‌రిపితేనే మ‌నం జీవిస్తాం. క‌థ‌లో కూడా కంటికి క‌నిపించే పాత్ర‌ల వెనుక , చాలా కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌ర‌గాలి. అప్పుడే అవి స‌జీవంగా తెర మీద క‌నిపిస్తాయి.

భార‌తీయుడులో క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌రాభ‌ర‌ణం శంక‌ర‌శాస్త్రి, బాహుబ‌లి క‌ట్ట‌ప్ప ఎందుకు గుర్తుంటారంటే వాళ్ల‌తో పాటు ర‌చ‌యిత లేదా ద‌ర్శ‌కుడు చాలా దూరం చాలా కాలం ప్ర‌యాణం చేసి ఉంటారు. ఆ క్యారెక్ట‌ర్ల‌పై మ‌థ‌నం జ‌రిగుంటుంది. పేప‌ర్ లేదా స్క్రీన్ మీద క‌నిపించిన దాని కంటే లోతైన విష‌యాలు వాళ్ల‌కు తెలుసు.

500 నోటుతో కూతురికి కాగితం ప‌డ‌వ చేసిన వాడు అదే కూతురు ప్రాణం కోసం రూపాయి లంచం ఇవ్వ‌డు (భార‌తీయుడు).

పెళ్లి చూపుల్లో కూతురు స‌రిగ‌మ‌లు త‌ప్పు ప‌లికితే , నిర్మొహ‌మాటంగా మంద‌లించే తండ్రి. సంగీతం కంటే ఏదీ ఎక్కువ కాదు శంక‌ర‌శాస్త్రికి.

తాను ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించే బాహుబ‌లినే చంపాల్సినంత రాజ‌భ‌క్తి. క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్ అంత బ‌లంగా ఉంది కాబ‌ట్టే , ఎందుకు చంపాడ‌నే ఆస‌క్తితో బాహుబ‌లి -2 చూశారు.

ఈ క్యారెక్ట‌ర్లు వేసింది గొప్ప న‌టులే కావ‌చ్చు. సృష్టించిన వాళ్లు కూడా గొప్ప వాళ్లే. ఒక సినిమాలో హీరో జ‌ర్నీ ముందుకు వెళ్లాలంటే అనేక క్యారెక్ట‌ర్లు వ‌చ్చి అత‌ని చుట్టూ క‌వ‌చంలా నిల‌బ‌డాలి. ఈ మ‌ధ్య మ‌న హీరోల‌కి దురాశ పెరిగి మొత్తం తామే క‌నిపించాల‌ని ఎవ‌రికీ Space లేకుండా చేసి సినిమాల్ని ముంచేస్తున్నారు.

ఒక క్యారెక్ట‌ర్ అనుకున్న‌ప్పుడు , దానికున్న ప‌రిధులు, ప‌రిమితులు, బ‌లం, బ‌ల‌హీన‌త అన్నీ ఆలోచిస్తే రూపం ఏర్ప‌డుతుంది. క్యారెక్ట‌ర్ అర్థం కాక‌పోతే డైరెక్ట‌ర్‌కే Confusion వ‌స్తుంది. ఎంత మంచి న‌టుడైనా ఏ ర‌కంగా న‌టించాలో తెలియ‌నంత అమోమ‌యానికి గురి అవుతాడు. ఈ మ‌ధ్య అల్లుడు అదుర్స్‌లో ప్ర‌కాష్‌రాజ్ ప‌రిస్థితి ఇదే. చాలా సార్లు blank కెమెరాని చూస్తుండి పోయాడు.

త‌మాషా ఏమంటే నీతి క‌థ‌లు అంత‌రించి పోయాయ‌ని , అవి చిన్న పిల్ల‌ల క‌థ‌ల‌ని అనుకుంటాం కానీ, మ‌నం చూసే 90 % సినిమాలు నీతిక‌థ‌లు, లేదా నీతి సంవాదం ( moral argument).

వెనుక‌టికి ప్ర‌ముఖ నిర్మాత చ‌క్ర‌పాణిని (విజ‌య ప్రొడ‌క్ష‌న్‌) మీ సినిమాలో “మెసేజ్ ఏంట‌ని అడిగితే మెసేజ్ ఇవ్వాలంటే టెలిగ్రామ్ చాలు. దానికి సినిమా తీయ‌డం ఎందుకు?” అన్నాడాయ‌న‌. ఆయ‌న తీసిన అన్ని సినిమాల్లో అంత‌ర్లీనంగా ఏదో ఒక మెసేజ్ ఉంది. సాహ‌సం చేస్తే సాధించ‌లేనిది లేదు (పాతాళ‌భైర‌వి, జ‌గ‌దేక‌వీరుడి క‌థ‌). అహంకారం అన‌ర్థం (గుండ‌మ్మ క‌థ‌), అప్పులు చేస్తే తిప్ప‌లు త‌ప్ప‌వు (అప్పు చేసి ప‌ప్పు కూడు).

అన్ని సినిమాల్లోనూ ర‌చ‌యిత‌లు తెలిసో తెలియ‌కో moral argument న‌డిపిస్తారు, లేదా దాంతో ముగిస్తారు. ఉప్పెన‌లో కూతురి ప్రేమ‌ని ఇష్ట‌ప‌డ‌ని తండ్రి , అత‌న్ని సంసారానికి ప‌నికి రాకుండా చేస్తాడు. మ‌గ‌త‌నం అంటే నువ్వ‌నుకునేది కాదు అని తండ్రిని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. అంతే త‌ప్ప విల‌న్ గెలిచిన‌ట్టు క‌థ చెప్పం.

సీతాకోక‌చిలుక‌లో శ‌ర‌త్‌బాబు ధ‌న‌వంతుడు. ప్రేమికుల‌ని విడ‌దీయ‌గ‌ల‌డు. అత‌నికి ఒక ఫాద‌ర్‌తో నీతి బోధ చేసి క‌థ‌ని సుఖాంతం చేశాడు. హీరో ఏ పాత్ర వేసినా moral argument న‌డుస్తూ ఉంటుంది. క్రాక్‌లో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ విల‌న్ల‌ని ఎదిరిస్తూ ఉంటాడు. సినిమాలో హీరోకి కొన్ని ప్ర‌త్యేక ప‌వ‌ర్స్ ఉంటాయి. వాస్త‌వానికి పోలీసులు ప్ర‌భుత్వంలో ఉన్న రాజ‌కీయ నాయ‌కుల‌కి అనుగుణంగా ప‌ని చేస్తారు. దీన్ని over look చేసి క్యారెక్ట‌ర్ రాసుకుంటారు. లేదంటే నాయ‌కుల్ని కూడా ఎదిరించిన‌ట్టు చూపిస్తారు. లీడ‌ర్ల‌ని ఎదిరిస్తే ఏం జ‌రుగుతుందంటే క‌మ్యూనికేష‌న్ విభాగానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తారు. ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారియ‌ర్ని తిని వెళ్లిపోవ‌డం త‌ప్ప అక్క‌డ జ‌నం మీద పెత్త‌నం ఉండ‌దు.

హీరో రాజ‌కీయ నాయ‌కుడైతే (భ‌ర‌త్ అనే నేను) ఉదాత్త ఆలోచ‌న‌ల‌తో ఉంటాడు. వ్య‌వ‌సాయం చేస్తే (మ‌హ‌ర్షి) రైతుల‌కి సంబంధించిన నీతిబోధ న‌డుస్తూ ఉంటుంది. ఇది ఒక ఫార్ములా అయిన‌ప్ప‌టికీ , బ్రేక్ చేస్తే కొత్త క‌థ పుడుతుంది. టెంప‌ర్‌లో హీరో అవినీతిప‌రుడు. కానీ ఒక సంఘ‌ట‌న‌తో మారిపోతాడు.

నూరు శాతం రియాల్టీతో ఆలోచిస్తే చాలా క‌థ‌లు ముందుకెళ్ల‌వు. రియాల్టీ లేక‌పోతే పాత సీన్ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ రాసుకుంటారు. క్రాక్ ఎలాగోలా గ‌ట్టెక్కింది కానీ ఒక్క కొత్త సీన్ అయినా ఉందా? క‌థ మ‌నం ఊహించిన‌ట్టే జ‌ర‌గ‌కూడ‌దు. తెలివికి ప‌రీక్ష పెట్టాలి. దృశ్యం-2 దీనికి ఉదాహ‌ర‌ణ‌.

సంఘ‌ట‌న‌లు హీరోకి అనుకూలంగా జ‌ర‌గ‌కూడ‌దు. క‌ష్ట‌మైన సంద‌ర్భాల్ని ప‌రిష్క‌రించాలి. అత్తారింటికి దారేదిలో హీరో ఎంట‌ర్ అవడానికి రావు ర‌మేష్‌కి ఉన్న‌ట్టుండి గుండె పోటు అవ‌స‌రమా? సొంత విమానంలో అత్త కోసం వ‌చ్చిన వాడు ఆ ఇంట్లోకి వెళ్ల‌కుండా ఉంటాడా? తెలివితో ఒక సంఘ‌ట‌న‌ని సృష్టించ‌లేడా?

కొస‌మెరుపుః

టీవీలో వ‌స్తున్న తెలుగు సినిమాని చూసి కుక్క అదే ప‌నిగా మొరుగుతుంటే , ఎందుక‌ని భ‌ర్త అడిగాడు.
” దీని ఒర్జిన‌ల్ కొరియ‌న్ సినిమాని అది OTT లో చూసింది. ఎందుకింత చెత్త‌గా తీశార‌ని మొరుగుతోంది” చెప్పింది భార్య‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి