iDreamPost

“హిట్” మ్యాన్ రోహిత్.. హ్యాపీ బర్త్ డే…

“హిట్” మ్యాన్ రోహిత్.. హ్యాపీ బర్త్ డే…

భారత స్టార్ ఓపెనర్, ఆల్ టైమ్ వన్డే బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన రోహిత్ శర్మ ఇవాళ తన 33 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. జూన్ 2007లో ఐర్లాండ్‌పై వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్,టెస్ట్ జట్టులో స్థానం కోసం సుదీర్ఘంగా 6 ఏళ్ళ పైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఇక టీ-20 ప్రపంచ కప్-2009 మరియు 2010-11లో సఫారీల గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించలేదు.కానీ సచిన్ రిటైర్డ్ తో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పూర్తిస్థాయి ఓపెనర్‌గా మారిన తర్వాత అతని బ్యాటింగ్‌ కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నాడు.

నాటి నుండి హిట్ మ్యాన్‌గా పేరు గడించిన రోహిత్‌ వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు, టి 20లో నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు.అలాగే
టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా వరుస తొలి ఇన్నింగ్స్‌లలో జంట సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

రోహిత్ జన్మదిన సందర్భంగా అతను సాధించిన కొన్ని ఆసక్తికరమైన రికార్డులను,గణాంకాలను పరిశీలిద్దాం…..

అంతర్జాతీయ వన్డే చరిత్రలో వరుసగా ఐదు కంటే ఎక్కువ క్యాలెండర్ సంవత్సరాలలో రోహిత్ తప్ప మరే ఇతర ఆటగాడు 500 పైగా పరుగులు చేయలేదు.

వన్డే క్రికెట్‌లో 2013 మరియు 2019 మధ్య ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో రోహిత్ 50 కంటే ఎక్కువ బ్యాటింగ్ సగటు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌.

తన తొలి టెస్టులోనే ఓపెనర్‌గా రోహిత్ రెండు సెంచరీలతో మొత్తం 303 పరుగులు చేసి,రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలుసాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

 క్రికెట్ మూడు ఫార్మాట్లలో సిక్స్‌ కొట్టి సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు.(మూడు వన్డే సెంచరీలు,టెస్టులో రెండు సెంచరీలు, టీ-20లలో ఒక సెంచరీ)

 ప్రపంచకప్‌లో రోహిత్ సాధించిన ఆరు సెంచరీలలో మూడు శతకాలు లక్ష్యఛేదనలో చేసిన ఘనత కూడా అతనిదే.

శ్రీలంకపై 264 పరుగులు చేసి వన్డేలలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు.

ఒక వన్డే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు(16) కొట్టిన ఘనత కూడా రోహిత్ శర్మదే.

అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ ఓపెనర్ రోహిత్.

ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఏడు వేర్వేరు ప్రత్యర్థులపై సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.2019లో రోహిత్ మొత్తం పది సెంచరీలు చేశాడు.

2019 ప్రపంచ కప్‌లో రోహిత్ 648 పరుగులు చేశాడు, ఇది ప్రపంచకప్ లీగ్ దశలో ఒక ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం.

10 వేర్వేరు దేశాలలో 50 పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ (భారతదేశం,శ్రీలంక, బంగ్లాదేశ్,దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ మరియు యుఎస్ఎ)

ఇప్పటి వరకు హిట్ మ్యాన్ 224 వన్డేలు ఆడి 88.93 స్ట్రైక్ రేటుతో 9115 పరుగులు సాధించి పదివేల ల్యాండ్ మార్క్ ను అందుకోవడంపై దృష్టి సారించాడు.108 టీ-20లలో 32.24 సగటుతో 2773 పరుగులు చేశాడు.ఇక తన 14 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కేవలం 32 టెస్టు మ్యాచులు ఆడిన రోహిత్ 53 ఇన్నింగ్స్‌లలో ఆరు శతకాలతో మొత్తం 2141 పరుగులు సాధించాడు.

రాబోవుకాలంలో రోహి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ… హ్యాపీ బర్త్ డే రోహిత్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి