iDreamPost

బార్ల రద్దు పై హైకోర్టు స్టే – జగన్‌ సర్కార్‌ ఏం చేయబోతోంది..?

బార్ల రద్దు పై హైకోర్టు స్టే – జగన్‌ సర్కార్‌ ఏం చేయబోతోంది..?

దశలవారీగా మద్య నిషేధం విధించాలన్న ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ లక్ష్యానికి ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో బార్ల సంఖ్యను కుదించే లక్ష్యంతో అమలులో ఉన్న బార్ల లైసెన్స్‌ను రద్దు చేసిన రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో బ్రేక్‌ పడింది. బార్ల లైసెన్సుల రద్దుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ఆదేశాలు జారీ చేశారు. బార్ల లైసెన్స్‌లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బార్ల అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.


40 శాతం బార్లు తగ్గింపు..

రాష్ట్రంలో 798 బార్లు ఉన్నాయి. వీటిలో మొదటి దఫాలో 40 శాతం బార్లను తగ్గిస్తూ నూతనంగా లైసెన్స్‌లు జారీ చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. రెండేళ్ల కాలనికి లైసెన్స్‌లు జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ కసర్తు ప్రారంభించింది. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది. జనవరి ఒకటి నుంచి నూతన లైసెన్స్‌లతో బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణలో ఉన్న బార్ల లైసెన్స్‌ల రద్దు వ్యవహారంపై నిన్న సోమవారం హైకోర్టు స్టే విధించింది.


ముడుపులు తీసుకుని ఐదేళ్లకు..

2017కు ముందు రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు మద్యం దుకాణాలు, బార్లకు లైనెస్స్‌ను జారీ చేసేవారు. 2017లో మద్యం దుకాణాలకు రెండేళ్లకు లైసెన్స్‌లు జారీ చేసిన అప్పటి చంద్రబాబు సర్కార్, బార్లకు మాత్రం 5 ఏళ్లకు లైసెన్స్‌ను జారీ చేసింది. ఏకంగా ఐదేళ్లకు లైసెన్స్‌ జారీ చేసేందుకు అప్పట్లో దాదాపు 300 కోట్ల రూపాయాలు బార్ల యజమానులు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం బార్ల లైసెన్స్‌ను మరో రేండేళ్లు ఉంది. అయితే ప్రభుత్వం మద్యపాన నిషేధ లక్ష్యంతో ఉండడంతో బార్లలో 40 శాతం రద్దు చేసింది. అంతకు ముందే దుకాణాల సంఖ్యను 20 శాతం తగ్గించి ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తోంది.


ప్రజా ఆరోగ్యమే ప్రధానం..

మద్యం విక్రయాలు ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా అన్ని ప్రభుత్వాలు భావించాయి. అయితే మద్యపానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు పేదల కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. ఈ నేపధ్యంలో తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా సూచిన సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మూడు దశల్లో మద్యం నిషేధిస్తామని, స్టార్‌ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉంచుతామని, అక్కడ కూడా ధరలు భారీగా పెంచి పేద వాళ్లకు అందుబాటులో లేకుండా చేస్తామని సీఎం జగన్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అందులో భాగంగానే మద్య నిషేధంపై తొలి అడుగులు వేస్తున్నారు. తాజాగా హైకోర్టు స్టేతో జగన్‌ సర్కార్‌ ఏమి చేయబోతోందన్నది ఆసక్తిగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి