iDreamPost

యువ స్టార్ హీరో ఆత్మహత్య – షాకింగ్

యువ స్టార్ హీరో ఆత్మహత్య – షాకింగ్

2020 అన్నిరకాలుగా దారుణమైన చేదు అనుభవాలు మిగిలిస్తున్న సంవత్సరంలో మరో జీర్ణించుకోలేని సంఘటన. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని తన స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కారణాలు ఇంకా తెలియలేదు. ఎంఎస్ ధోనిలో టైటిల్ రోల్ పోషించి అందరి దృష్టిని ఆకర్షించిన సుశాంత్ ఇటీవలి కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. కొత్త జనరేషన్ లో ప్రామిసింగ్ యాక్టర్ గా ప్రేక్షకుల్లోనూ గుర్తింపు ఉంది.

‘కాయ్ పో చే’ ద్వారా డెబ్యుతోనే సక్సెస్ అందుకున్న సుశాంత్ ఆ తర్వాత శుద్ద్ దేశీ రొమాన్స్, పికె, డిటెక్టివ్ బ్యోంకేష్ బక్షీలలో నటించినప్పటికీ ఎంఎస్ ధోని తెచ్చిన పేరు చాలా గొప్పది. దాని కోసం కఠినమైన క్రికెట్ ని ప్రాక్టీస్ చేసిన సుశాంత్ బాడీ లాంగ్వేజ్ లోనూ నిజమైన క్రీడాకారుడిగా నటించడంతో అందరి ప్రశంసలు దక్కాయి. అయితే గత కొంత కాలంగా సుశాంత్ కు అంతగా విజయాలు దక్కలేదు. రాబ్తా, వెల్కం టు న్యూయార్క్, కేదార్ నాథ్, సొంచిరియాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. చిచోరే ఒకటే హిట్ అనిపించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన డ్రైవ్ మీద దారుణమైన ఫీడ్ బ్యాక్ వచ్చింది.

షూటింగ్ పూర్తయిన దిల్ బేచారా త్వరలో హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతోందని ఇప్పటికే టాక్ ఉంది. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ లో ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఇంత భవిష్యత్తు పెట్టుకుని ఇలా ప్రాణాలు తీసుకోవడం సినిమా ప్రేమికులను తీవ్రంగా కలవరపరుస్తోంది. చేసింది కొద్దీ సినిమాలే అయినా ఛారిటీ స్థాపించి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్న సుశాంత్ మృతి పట్ల బాలీవుడ్ షాక్ కు గురైంది. ట్విట్టర్ వేదికగా ఇది నమ్మలేని నిజమంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 34 ఏళ్ళ అతి చిన్న వయసులో ఇలా లోకాన్ని విడిచి వెళ్లడం చూస్తే నమ్మశక్యం కానీ పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులా లేక ఇంకేదైనా కారణమా అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి