iDreamPost

బాబు గారి విజనరీ , రియల్ టైం గవర్నెన్స్ ఎలా ఉండేయంటే ..

బాబు గారి విజనరీ , రియల్ టైం గవర్నెన్స్ ఎలా ఉండేయంటే ..

.ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో బాబు గారి చేతికి పగ్గాలు ఇస్తే అద్భుతాలు సృష్టించబడతాయి అని టీడీపీ శ్రేణులు పలు సామాజిక మాధ్యమాలలో హోరెత్తిస్తున్న సందర్భంగా బాబు గారి విజనరీ ఎలాంటిదా అని ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే ప్రచారార్భాటం , గ్రాఫిక్స్ మాయాజాలం బాగా కనిపిస్తాయి. .

ముఖ్యంగా 16 -07-2018 న టీడీపీ ప్రభుత్వం 1500 రోజులు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన పరికించి చూస్తే ,అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నట్టు చూపించడానికి ప్రపంచంలో ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలు అనదగ్గ కట్టడాలు , వంతెనలు అన్నీ అమరావతిలో కడుతున్నట్టు గ్రాఫిక్స్ లో చూపించడానికి అలవాటు పడ్డ చంద్రబాబు చివరికి ప్రకటనలలో కూడా అదే ఆర్భాటపు ప్రచార బాట పట్టారని అర్ధమవుతుంది .

తమ 1500 రోజుల సంక్షేమ సుపరిపాలనలో ఆంధ్ర ప్రదేశ్ వెలిగిపోతుందంటూ ఆంధ్రజ్యోతి పత్రికకి ఇచ్చిన ఈ యాడ్ లో ఫోటోలు సగానికి పైగా ఒక్కోటి ఒక్కోచోట నుండి తెచ్చి గుదిగుచ్చినవి , కేంద్ర నిధులతో పూర్తి చేసి తన పేరు వేసుకొన్నవి తప్ప సొంత ఘనత లేదని చెప్పొచ్చు .

ఈ ప్రకటనలో వరుసగా నిలబెట్టి బిల్ట్ చేస్తున్న కార్లను చూసి ఇదేదో బాబు గారి హయాంలో పెట్టిన కార్ల కంపెనీ అనుకొంటే పప్పులో కాలేసినట్లే .ఆ ఫోటో జనరల్ మోటార్స్ లోగోలలోనిది . చెవర్లెట్ కార్ అంటే మనోళ్ళకు బాగా తెలుస్తుంది . ఆది అమెరికాలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీని. 

అలాగే ఎగురుతున్న విమానం చూసి చంద్రబాబు కట్టిన విమానాశ్రయం నుండి ఎగురుతున్న విమానం అనుకోవాలని చంద్రబాబు ఆశ . అది A 380 డబుల్ డెక్కర్ విమానం . మనదేశంలో కేవలం ఢిల్లీ , బాంబే , హైదరాబాద్ , బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాత్రమే దిగుతుంది . మన రాష్ట్రానికి ఏ విధమైన సర్వీసులు లేవు . బోయింగ్ విమానం కన్నా పెద్దది , ఎక్కువ మంది ప్రయాణికుల్ని మోసుకెళ్లగలుగుతుంది .అది నెదర్లాండ్స్ లోని ఎయిర్ బస్ సంస్థ తయారీ .

ఆ యాడ్ లో చంద్రబాబు పక్కనున్న ఇడ్లీ పాత్రని పోలిన బిల్డింగ్ అమరావతి కోసం విదేశాల వారితో గీయించిన పలు గ్రాఫిక్ డిజైన్లలో ఓ డిజైన్ , అప్పట్లో దీని పైన మీడియా ,సోషల్ మీడియాలలో పలు విమర్శలు వచ్చాయి . ఇంకా ఇలాంటి గ్రాఫిక్ డిజైన్స్ పలు విదేశీ కంపెనీల చేత తయారు చేయించిన చంద్రబాబు అవేవీ కాదని చివరికి బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళికి డిజైన్స్ సెలెక్ట్ చేసే పని అప్పజెప్పాడు . ఐదేళ్లలో ఏ డిజైనూ ఖరారు కాకుండానే బాబు పదవి నుండి దిగిపోయారు .

ఈ ఫోటోలో ఓ జంట వెనక కనిపిస్తున్న ఎన్టీఆర్ రూరల్ స్వగృహ ఇల్ల నిర్మాణంలో చంద్రబాబు రాష్ట్ర ఖజానా నుండి పైసా ఖర్చు పెట్టలేదని మొత్తం నిర్మాణ ఖర్చు లక్షన్నరలో కేంద్రం వాటా 70 వేలు పోగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 80 వేలు చెల్లించకుండా , జాతీయ ఉపాధి హామీ పధకం కింద గృహ లబ్దిదారుడు ఇటుక బట్టీ పెట్టి స్వయంగా ఇటుకలు తయారు చేసినట్టు, అలాగే తాపీ పనివారు లేకుండా లబ్ది దారుడే స్వయంగా గోడలు కట్టి స్లాబ్ వేసుకొన్నట్టు రికార్డులు తయారు చేసి MGNRGS నిధుల్ని అక్రమంగా మళ్లించారు .

అలాగే ఫోటోలో మరోభాగమైన గ్రామీణ సీసీ రోడ్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పధకంలో భాగంగా మెటీరియల్ కోసం వేజ్ (ఉపాధి లేని కూలీలని) ని ఎక్కువగా చూపి ఆ ముడి సరుకుతో నిర్మించినవేనని ఈ పనుల పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2017 లో విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని , కేంద్ర విజిలెన్స్ విభాగం మండలాల వారీగా విచారణ జరిపి పలు కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్ధారించింది.

ఇలాంటి అవకతవకల వలన తాత్కాలికంగా లబ్ది పొందినట్టు కనపడినా ప్రతిసారి కేంద్రం ఇలా మోసపోదు , ఇలాంటి చర్యలు అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతని దెబ్బ తీయటంతో పాటు , కేంద్రం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల్ని కూడా నిలిపివేసి విచారణకు , చట్ట పరమైన చర్యలకు ఉపక్రమిస్తే జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోతుంది . అలాగే తాను చేయని పనుల్ని , రాష్ట్రంలో లేని మరెక్కడో తయారైన , విధులు నిర్వహిస్తున్న సంస్థల్ని రాష్ట్రంలో తన హయాంలో జరిగినట్టు , ఉత్పత్తి అయినట్టు గ్రాఫిక్స్ ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయటం చంద్రబాబుకి మాత్రమే సాధ్యమైన విద్య .

ఇదండీ 1500 రోజుల పాలనలో బాబు గారు చూపించిన ప్రగతిలోని విశేషాలు , ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ప్రచారార్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా పనితీరు కనపరచలేదని గ్రహించిన ప్రజలు గత ఎన్నికల్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కొందరు అనుయాయులు మాత్రం ఇప్పటికీ చంద్రబాబే నెంబర్ 1 అని , రాష్ట్రపతి , ప్రధాని , గవర్నర్లు ఆయన్ని పగ్గాలు చేపట్టామని పిలుస్తున్నారని ప్రచారం చేయడంలో మునిగిపోయారు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి