iDreamPost

రైతు ఉద్యమం ఎఫెక్ట్ – హర్యానా అధికార కూటమిలో బీటలు?

రైతు ఉద్యమం ఎఫెక్ట్ – హర్యానా అధికార కూటమిలో బీటలు?

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కేంద్రానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రైతు ఉద్యమానికి రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండడంతో పాటు, మిత్ర పక్షాల నుంచే కేంద్రానికి వ్యతిరేకత ఎదురవుతోంది. పంజాబు, హర్యాన రాష్ట్రాల నుంచి బీజేపీకి ఎదురు పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంది. లోక్ సభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి చెందిన కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు… హర్యానా ఉప ముఖ్యమంత్రి సైతం అదే బాటలో నడుస్తునట్లు కనిపిస్తోంది.

కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల వ్యవసాయం పూర్తిగా కార్పోరేట్ల గుప్పిట్లోకి చేరుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35 సంస్థలతో ఏర్పడిన అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీని పంజాబు, హర్యానా రైతులు ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరాన్యా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ రైతు ఉద్యమం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుల వెనక విచ్ఛిన్నకర శక్తులున్నాయని ఆరోపించారు. కాగా…. బీజేపీ మిత్రపక్షమైన జన్‌నాయక్ జనతా పార్టీ అధినేత, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా రైతుల పట్ల సానుకూల వైఖరిని ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. చౌతాలా వ్యాఖ్యలు బీజేపీని కొత్త చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే పలు మార్లు రైతు సంఘాలతో చర్చించిన కేంద్రం పలు ప్రతిపాదనలను రైతుల ముందుంచింది. కానీ మద్దతు ధర విషయంలో వెనక్కి తగ్గడానికి కేంద్రం సుముఖంగా కనిపించడం లేదు. అదే సమయంలో రైతులు కూడా వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మరో ప్రతిపాధనకు అంగీకరించేది లేదంటూ తేల్చేశారు. ఈ నేపథ్యంలో దుశ్యంత్ చౌతాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల్లో చాలా సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రానికి సూచించామని, కేంద్రం కూడా అందుకు సానుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు చౌతాలా.

రైతు ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో పంజాబు, హర్యానా రైతులు అత్యధికంగా ఉన్నారు. పంజాబు రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతు ఉద్యమానికి మద్దతునిస్తోంది. కాగా.. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగాలని జేజేపీపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జేజేపీ రైతులకు వ్యతిరేకం కాదని చాటుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. అందుకే… కనీస మద్దతు ధర అందించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు జేజేపీ అధినేత చౌతాలా. ఈ తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి