iDreamPost
android-app
ios-app

పాండ్యా నువ్వింక మారవా? అప్పుడు తిలక్‌.. ఇప్పుడు రాహుల్‌!

  • Published Oct 09, 2023 | 11:32 AM Updated Updated Oct 09, 2023 | 4:58 PM
  • Published Oct 09, 2023 | 11:32 AMUpdated Oct 09, 2023 | 4:58 PM
పాండ్యా నువ్వింక మారవా? అప్పుడు తిలక్‌.. ఇప్పుడు రాహుల్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ విక్టరీతో శుభారంభం చేసింది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో ఆదివారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో తలపడిన భారత జట్టు.. 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోయిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. టాస్‌ ఓడిపోవడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరాశపడినా.. మ్యాచ్‌ సాగుతున్న కొద్ది మ్యాచ్‌ ఓడిపోవడమే మంచిదైందని అనుకుని ఉంటాడు. ఎందుకంటే మ్యాచ్‌ అలా సాగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించింది. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మాత్రం స్పిన్‌ బౌలింగ్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 200 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 2 పరుగులకే మూడు వికెట్ల క్రికెట్‌ అభిమానులను టెన్షన్‌లో పెట్టింది టీమిండియా.

ఇందులో రోహిత్‌ శర్మ వికెట్‌ విషయంలో బౌలర్‌కు క్రెడిడ్‌ ఇవ్వచ్చు కానీ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం చెత్త షాట్లు ఆడి వికెట్‌ సమర్పించుకున్నారు. కోహ్లీ-రాహుల్‌ కాస్త స్లోగా ఆడినా.. ఆస్ట్రేలియా ఎటాకింగ్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ బంధనాలను సడలించుకుంటూ.. టీమిండియాను విజయం వైపు నడిపించారు. కానీ, ఇద్దరిలో ఒక్కరు కూడా సెంచరీ చేయకపోవడం క్రికెట్‌ అభిమానులను నిరాశకు గురిచేసింది. విరాట్‌ కోహ్లీ సెంచరీ మిస్‌ అవ్వడంపై ఎవర్ని తప్పుబట్టేందుకు లేదు కానీ, కేఎల్‌ రాహుల్‌ సెంచరీ మిస్‌ అవ్వడంపై ఒక క్రికెటర్‌ను మాత్రం కచ్చితంగా తప్పుబట్టాల్సి వస్తుంది. అతనెవరో కాదు.. ఇటీవల కాలంలోనే ఓ సారి ఇలాంటి తప్పిదమే చేసి తీవ్ర విమర్శల పాలైన ‘యాటిట్యూడ్‌ స్టార్‌’ హార్దిక్‌ పాండ్యా.

2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను తమ అనుభవాన్ని చెమట రూపంలో పిచ్‌పై చిందిస్తూ.. కోహ్లీ-రాహుల్‌ ఎంతో అద్భుతంగా టీమిండియా విజయం వైపు నడిపించారు. వారు చేస్తున్న ఒక్కో పరుగు క్రికెట్‌ అభిమానులకు ఊపిరి అందించింది. వాళ్లు అనుకుంటే.. ఎదురుగా ఏ బౌలర్‌ ఉన్నా లెక్కచేయకుండా పెద్ద పెద్ద షాట్లు ఆడగలరు. కానీ, మ్యాచ్‌ పరిస్థితులకు రెస్పెక్ట్‌ ఇస్తూ.. నిదానంగా ఆడుతూ.. ఆస్ట్రేలియా కోరల్లో చిక్కుకున్న మ్యాచ్‌ను లాక్కొచ్చారు. ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్‌లను మరింత గొప్పగా చేస్తూ.. చిరకాలం గుర్తుండిపోయేలా చేయాలంటే.. సెంచరీ అనే ఒక మార్క్‌ కీలకంగా మారుతుంది. రాహుల్‌ 70ల్లో ఉండగా కోహ్లీ అప్పటికే 80కి చేరుకుని.. సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు.

ఒక సీనియర్‌ ప్రోగా కోహ్లీని రెస్పెక్ట్‌ చేస్తూ.. కోహ్లీ సెంచరీ చేయాలని రాహుల్‌ భారీ షాట్లు ఆడే ఛాన్స్‌ ఉన్నా కూడా.. సింగిల్స్ తీస్తూ కోహ్లీకి ఎక్కువగా స్ట్రైక్‌ ఇచ్చాడు. ఎందుకంటే కోహ్లీ సెంచరీ చేయాలని. తనకు సెంచరీ చేసే ఛాన్స్‌ ఉన్నా కూడా కోహ్లీకి ప్రిఫరెన్స్‌ ఇచ్చాడు రాహుల్‌. కానీ, 85 రన్స్‌ వద్ద కోహ్లీ ఒక బ్యాడ్‌ షాట్‌ ఆడి అవుట్‌ కావడంతో.. ఇక రాహుల్‌ సెంచరీకి లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో తన సెంచరీపై రాహుల్‌ ఫోకస్‌ పెట్టాడు. కోహ్లీ అవుట్‌ అయ్యే సమయానికి ఇండియా విజయానికి 33 రన్స్‌ కావాలి. కానీ, రాహుల్‌ సెంచరీకి కేవలం 25 పరుగులకే అవసరం. ఈ టైమ్‌లో వచ్చే బ్యాటర్‌ ఎవరైనా.. సింగిల్స్‌ తీస్తూ ఎక్కువగా రాహుల్‌కు స్ట్రైక్‌ ఇవ్వడానికి ట్రై చేస్తారు.

ఎందుకంటే ఎలాగో మ్యాచ్‌ గెలిచే పొజిషన్‌లో ఉన్నాం. 33 పరుగులు చేయడానికి 78 బంతులు ఉన్నాయి. మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకు వెళ్లే ఛాన్సే లేదు. పైగా చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే బ్యాటర్‌ ఎవరైనా.. రాహుల్‌ పడిన కష్టానికి ఉడత సాయంలా సింగిల్స్‌ తీస్తాడు. ఎందుకంటే.. 2 రన్స్‌కు 3 వికెట్లు పడి దశ నుంచి, నిప్పులు చెరుగుతున్న ఆసీస్‌ బౌలర్లను చెమటలు కక్కుకుంటూ అంత సేపు బ్యాటింగ్‌ చేసి.. టీమిండియా చేతుల్లో విజయం తీసుకొచ్చి పెట్టినందుకు సెంచరీ చేసి అవకాశం రాహుల్‌ లాంటి ప్లేయర్లకు ఇవ్వడం ఒక రకంగా వారి కష్టాన్ని గౌరవించడం అవుతుంది. కానీ, ఇవన్నీ తలకెక్కని హార్దిక్‌ పాండ్యా.. పెద్ద పోటుగాడిలా టీమిండియా విజయానికి 24 పరుగులు అవసరమైన దశలో అనవసరపు సిక్స్‌ కొట్టాడు.

నిజానికి ఆ సిక్స్‌ అవసరం లేదు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో టీమ్‌ ఉంటే పాండ్యా చేసిందన్ని తప్పుబట్టేందుకు ఉండకపోయేది. కానీ, అప్పటికే 10.2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయినా కూడా పాండ్యా పెద్ద హిట్టర్‌ అయినట్లు సిక్స్‌ కొట్టేశాడు. ఆ సిక్స్‌తో రాహుల్‌ సెంచరీ అవకాశాలు సన్నగిల్లాయి. టీమిండియా విజయానికి కేవలం 18 పరుగులే అవసరం కాగా.. రాహుల్‌ సెంచరీకి 21 రన్స్‌ కావాలి. ఇక లాభం లేదని ఆ తర్వాత రాహుల్‌ సిక్స్‌, ఫోర్‌తో తన స్కోర్‌ పెంచుకున్నాడు. చివరల్లో టీమిండియా విజయానికి 5 పరుగులు అవసరమైన దశలో రాహుల్‌ ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టి సెంచరీ పూర్తి చేసుకుందాం అనుకున్నాడు. కానీ, రాహుల్‌ కొట్టిన షాట్‌ దురదృష్టవశాత్తు బాగా కనెక్ట్‌ అయి సిక్స్‌గా వెళ్లింది. దాంతో మ్యాచ్‌ ముగిసింది. రాహుల్‌ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా ఆ సిక్స్‌ కొట్టకుండా సింగిల్‌ తీసి రాహుల్‌కు స్ట్రైక్‌ ఇచ్చి ఉంటే అతను సెంచరీ పూర్తి చేసుకుని.. ఈ గొప్ప ఇన్నింగ్స్‌కు ఓ మంచి ముగింపు ఇచ్చేవాడు. అయితే.. సెంచరీ చేస్తేనే గొప్ప అని కాదు కానీ, ఓ గొప్ప ఇన్నింగ్స్‌ ఆటగాడికి మరింత ఆత్మవిశ్వాసం, సంతోషం సెంచరీతో కలుగుతుంది. గొప్ప ఇన్నింగ్స్‌కు అద్భుతమైన ముగింపు లభిస్తుంది. పైగా వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ ఆరంభం మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. ఆటగాడి మైండ్‌సెట్‌ కానీ, కాన్ఫిడెన్స్‌ కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని హార్దిక్‌ పాండ్యా సర్వనాశనం చేశాడు.

పాండ్యా.. ఇప్పుడనే కాదు, ఇటీవల కాలంలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ మూడో మ్యాచ్‌లో తిలక్‌ వర్మ 49 పరుగుల వద్ద ఉన్న సమయంలో.. జట్టు విజయానికి 2 పరుగులు కావాలి. అప్పుడు స్ట్రైక్‌లో ఉన్న పాండ్యా సింగిల్‌ తీసి తిలక్‌కు స్ట్రైక్‌ ఇచ్చి, అతను హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం ఇస్తాడని అంతా భావించారు. కానీ, 2 రన్స్‌ కొట్టాల్సిన టైమ్‌లోనూ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ ముగించేశాడు. పాపం 49 రన్స్‌తో నాటౌట్‌గా మిగిలిన తిలక్‌ వర్మ అలాగే తెల్లముఖం వేస్తూ గ్రౌండ్‌లో నిల్చుండిపోయాడు. ఇలా హర్దిక్‌ పాండ్యా ఓవర్‌ యాక్షన్‌కు అప్పుడు తిలక్‌ వర్మ, ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ దెబ్బతిన్నారు. దీంతో హార్దిక్ పాండ్యాపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికైనా హార్దిక్‌ పాండ్యా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. మరి రాహుల్‌ సెంచరీ చేయకుండా హార్దిక్‌ పాండ్యా‌ అడ్డుపడిన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వాళ్లిద్దరి వల్లే ఈ విజయం.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపై రోహిత్ ప్రశంసలు!