iDreamPost

టీ20 కెప్టెన్‌గా బుమ్రా భేష్‌! పాండ్యా.. చూసి నేర్చుకోవాలి అంటూ..!

  • Published Aug 21, 2023 | 11:11 AMUpdated Aug 21, 2023 | 11:11 AM
  • Published Aug 21, 2023 | 11:11 AMUpdated Aug 21, 2023 | 11:11 AM
టీ20 కెప్టెన్‌గా బుమ్రా భేష్‌! పాండ్యా.. చూసి నేర్చుకోవాలి అంటూ..!

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 3-2 తేడాతో ఓడిన టీమిండియా.. తాజాగా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. మిగిలిన ఆ ఒక్క మ్యాచ్‌ కూడా గెలిస్తే.. క్లీన్‌ స్వీప్‌ అవుతుంది. అయితే.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో వెస్టిండీస్‌పై సిరీస్‌ ఓడిన టీమిండియా.. బుమ్రా కెప్టెన్సీలో మాత్రం ఐర్లాండ్‌పై సిరీస్‌ గెలిచింది. వెస్టిండీస్‌కు, ఐర్లాండ్‌కు తేడా లేదా అని కొంతమంది అనుకోవచ్చు. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు వెస్టిండీస్‌ కనీసం క్వాలిఫై కూడా కాలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. అదే సమయంలో ఐర్లాండ్‌ టీ20 వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై అవ్వడమే కాకుండా ఆ వరల్డ్‌ కప్‌ విన్నర్‌ ఇంగ్లండ్‌ను సూపర్‌ 12లో ఓడించి సంచలనం నమోదు చేసింది.

అలాగే వెస్టిండీస్‌తో ఆడిన టీమిండియాకు, ఇప్పుడు ఐర్లాండ్‌తో ఆడుతున్న టీమిండియాకు కూడా చాలా తేడా ఉంది. పాండ్యా కెప్టెన్సీలో ఆడిందే యంగ్‌ టీమ్‌ అనుకుంటే.. ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీలో ఆడుతున్నది మరీ కుర్ర జట్టు. ఈ సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ కూడా చేశారు. అయితే.. ప్రత్యర్థి బలం, టీమ్‌లో ఉన్న ఆటగాళ్ల గురించి పక్కన పెడితే.. ఒక కెప్టెన్ ఎలా ఉండాలో బుమ్రాను చూసి హార్దిక్‌ పాండ్యా నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. టీమిండియా లాంటి అగ్రశ్రేణి జట్టును నడిపించాలంటే.. కెప్టెన్‌గా ఆటగాడు చాలా విషయాల్లో టీమ్‌ కంటే ఒక అడుగు ముందే ఉండాలి. జట్టును జట్టుగా నడిపించడం, తన స్వార్థాన్ని పక్కనపెట్టడం, ఆగ్రహావేశాలు అదుపులో పెట్టుకోవడం కెప్టెన్‌కు తెలిసుండాలి.

ఈ మూడు అంశాల్లో బుమ్రా ఎంతో పరిణితి చెందిన కెప్టెన్‌లా కనిపిస్తున్నాడు. టీమ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గ్రౌండ్‌లో అతను వ్యవహరిస్తున్న తీరు, ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్న శైలి ఎంతగానో ఆకట్టుకనేలా ఉన్నాయి. ముఖ్యంగా యువ క్రికెటర్లతో ఒక సీనియర్ కెప్టెన్‌ ఎలా ఉండాలో బుమ్రా అలా ఉంటున్నాడు. చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు జరిగినా.. చిరునవ్వుతోనే వారికి అర్థమయ్యేలా ఏం చేయాలో, ఏం చేయకూడదో చెబుతున్నాడు. ఓ యువ బౌలర్‌ భారీగా పరుగులిచ్చినా.. పర్వాలేదంటూ ధైర్యచెబుతున్నాడు. అదే పాండ్యా అయితే.. చాలా సార్లు యువ బౌలర్ల పైనే కాదు మొహమ్మద్‌ షమీ లాంటి సీనియర్‌పై కూడా నోరు పారేసుకున్నాడు.

అలాగే ఈ సిరీస్‌కు కేవలం తన బౌలింగ్‌ ప్రాక్టీస్‌ తనను ఎంపిక చేశారనే విషయం బుమ్రాకి తెలిసినా.. తన రీఎంట్రీని ఘనంగా చాటుకోవాలని, వరుసగా బౌలింగ్‌ చేస్తూ టపటపా వికెట్ల పడగొట్టి తన సత్తా చాటాలని బుమ్రా అనుకోవడం లేదు. టీమ్‌కు తన అవసరం ఉందనుకున్న సమయంలోనే బౌలింగ్‌కు వస్తున్నాడు. యువ బౌలర్లు ఇబ్బంది పడుతుంటే.. తన బౌలింగ్‌కు వచ్చి పరిస్థితి కంట్రోల్‌లో ఉన్నప్పుడు కొత్త బౌలర్లను రంగంలోకి దింపుతున్నాడు. ఐర్లాండ్‌తో రెండో టీ20ల్లో తొలి ఓవర్‌ వేసిన బుమ్రా మళ్లీ 12వ వేశాడు. పవర్‌ ప్లేలో ఇతర బౌలర్లకు బౌలింగ్‌ వేసే అవకాశం ఇచ్చి.. తనే కెప్టెన్‌ అయినా కూడా తన స్వార్థం చూసుకోలేదు. అలాగే జట్టులోని బౌలర్లతో పాటు, ఆల్‌రౌండర్లకు కూడా బౌలింగ్‌ వేసే అవకాశం కల్పిస్తున్నాడు. బౌలింగ్‌ మార్పులు అద్భుతంగా చేస్తూ.. మంచి కెప్టెన్‌గా పేరుతెచ్చుకుంటున్నాడు.

అదే పాండ్యా అయితే.. అర్షదీప్‌ సింగ్‌ లాంటి నిఖార్సయిన బౌలర్‌ను టీమ్‌లో ఉండచుకుని కూడా ఓ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన తన తొలి ఓవర్‌ వేస్తుంటాడు. అలాగే పవర్‌ ప్లేలో వీలైనన్ని ఎక్కువ ఓవర్లు వేస్తుంటాడు. అక్షర్‌ పటేల్‌ లాంటి బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు వెస్టిండీస్‌తో సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో అసలు బౌలింగే ఇవ్వలేదు. వికెట్లు తీస్తున్న చాహల్‌తో పూర్తి కోటా వేయించలేదు. ఇక భావోద్వేగాల నియంత్రణలో పాండ్యా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ప్రతిసారి అతిగా స్పందిస్తాడనే ముద్ర ఇప్పటికే అతనిపై ఉంది. కానీ, బుమ్రా అలా కాదు. యంగ్‌ టీమ్‌ను నడిపించాల్సిన కెప్టెన్‌ ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. అందుకే ఇప్పటికైనా పాండ్యా.. బుమ్రా నుంచి ఒక కెప్టెన్‌ ఎలా ఉండాలో నేర్చుకోవాలని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఇన్ని రోజులు ధోని నుంచి కెప్టెన్సీ నేర్చుకున్నానని చెప్పి ధోని ఫ్యాన్స్‌తో తిట్లు తిన్న పాండ్యా.. కనీసం బుమ్రాను చూసి బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు ఫ్యాన్స్‌. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తిలక్‌ వర్మను ఇంటికి పంపేందుకు కుట్ర పన్నుతున్నారా? మరి ఇదంతా ఎందుకు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి