iDreamPost

తిలక్‌ వర్మను ఇంటికి పంపేందుకు కుట్ర పన్నుతున్నారా? మరి ఇదంతా ఎందుకు?

  • Published Aug 21, 2023 | 10:11 AMUpdated Aug 21, 2023 | 10:11 AM
  • Published Aug 21, 2023 | 10:11 AMUpdated Aug 21, 2023 | 10:11 AM
తిలక్‌ వర్మను ఇంటికి పంపేందుకు కుట్ర పన్నుతున్నారా? మరి ఇదంతా ఎందుకు?

టీమిండియాలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు మన తెలుగుతేజం తిలక్‌ వర్మ. ఐపీఎల్‌ 2022, 2023 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ జట్టు తరుఫున అద్భుతంగా రాణించిన తర్వాత.. తిలక్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్‌ అభిమానుల నుంచే వచ్చింది. అలాగే భారత సెలెక్టర్లు సైతం యంగ్‌ టాలెంట్‌ హంట్‌లో తిలక్‌ బెస్ట్‌ ఛాయిస్‌గా నిలిచాడు. దాంతో.. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌కు దేశానికి ఆడటం కంటే గొప్ప విషయం ఏముంటుంది. తిలక్‌ అతి చిన్న వయసులోనే ఆ మధురానుభూతిని పొందాడు. ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ.. ఆ సిరీస్‌ మొత్తం చాలా అద్భుతంగా ఆడాడు.

హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో 4వ స్థానంలో ఆడిన తిలక్‌ వర్మ.. తొలి టీ20లో 39, రెండో టీ20లో 51, మూడో మ్యాచ్‌లో 49(నాటౌట్‌)తో తన కెరీర్‌కు సూపర్‌ స్టార్ట్‌ అందుకున్నాడు. దీంతో టీమిండియాకు నాలుగో స్థానంలో మంచి ప్లేయర్‌ దొరికాడని ఏకంగా టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం మెచ్చుకున్నాడు. పైగా త్వరలోనే ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఉండటంతో తిలక్‌ వర్మకు ఆయా టోర్నీల్లో చోటు దక్కడం ఖాయంగా కనిపించింది. అమెరికాలో వెస్టిండీస్‌తోనే జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో 7(నాటౌట్‌), 27 పరుగులు చేశాడు. తిలక్‌ వర్మ. ఈ ఐదు మ్యాచ్‌ల్లో తిలక్‌ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌​కు ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో ఆడిన ఆ ఒక్క మ్యాచ్‌ కూడా ఆల్‌మోస్ట్‌ గెలుపుముంగిట్లో ఉండటంతో సూర్య స్థానంలో తిలక్‌ వచ్చాడు.

అయితే.. వెస్టిండీస్‌ సిరీస్‌లో 4వ స్థానంలో సక్సెస్‌ అయి.. టీమిండియా మెయిన్‌ టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్న తిలక్‌ వర్మపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు క్రికెట్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ తిలక్‌ దారుణంగా విఫలం అయ్యాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌ అయిన తిలక్‌, ఆదివారం జరిగిన రెండో టీ20లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు.

దీంతో.. తిలక్‌ వర్మ ఫామ్‌పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అసలే ఆసియా కప్‌కు జట్టును ఎంపిక చేస్తున్న క్రమంలో తిలక్‌ నుంచి ఇలాంటి వైఫల్యాలు రావడం ఎవరికీ అస్సలు నచ్చడం లేదు. అయితే.. టీమిండియా మేనేజ్‌మెంట్‌ చేస్తున్న చెత్త ప్రయోగాల కారణంగా తిలక్‌ వర్మ ఫామ్‌ కోల్పోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగో స్థానంలో యువరాజ్‌ సింగ్‌ లాంటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని అన్ని ఫార్మాట్లలో భర్తీ చేసే ప్లేయర్‌గా ఎదుగుతున్న తిలక్‌ను.. ఐర్లాండ్‌ సిరీస్‌లో మూడో స్థానంలో ఆడించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టీమిండియాలో మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ రూపంలో ప్రపంచ అగ్రశ్రేణి లాంటి బ్యాటర్‌ ఉన్నాడు. టీమిండియాకు కావాల్సింది నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు.

నాలుగో స్థానంలోనే రాణిస్తున్న తిలక్‌ను మూడో స్థానంలో ఆడించి, అతని లయను ఎందుకు దెబ్బతీస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తిలక్‌ కెరీర్‌ను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలా ఉందంటూ కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, తిలక్‌ను మూడో స్థానంలో ఆడించడానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దగ్గర ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలియదు. సంజు శాంసన్‌ను వన్‌డౌన్‌లో ఆడించి, తిలక్‌ను నాలుగో స్థానంలో ఆడించే ఛాన్స్ ఉన్నా.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తిలక్‌పై ఎందుకు ప్రయోగాలు చేస్తుందో అర్థం అవ్వడంలేదని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: వామ్మో.. రింకూ సింగ్‌ క్రేజ్‌ ఈ రేంజ్‌లో ఉందా? స్టేడియం దద్దరిల్లిపోయింది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి