iDreamPost

గోపిచంద్ కు రెండువైపులా చిక్కులు

గోపిచంద్ కు రెండువైపులా చిక్కులు

చాలా కాలం నుంచి గట్టి బ్లాక్ బస్టర్ కోసం ట్రై చేస్తున్న గోపి చంద్ కు లక్ కలిసి రావడం లేదు. ఎంత క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకున్నా విజయం మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. 2014లో లౌక్యం తర్వాత ఇప్పటిదాకా ఘనంగా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సీటీ మార్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ ఓ ముప్పై శాతం కాగానే లాక్ డౌన్ వచ్చి పడింది. ఇంకా కీలకమైన ఆటకు సంబంధించిన సన్నివేశాలు., ఢిల్లీ ఎపిసోడ్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు షూటింగులకు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ రావడంతో వాటికి అనుగుణంగా తీయడమే సీటీమార్ కు పెద్ద ఛాలెంజట.

కారణం ఎక్కువ జూనియర్ ఆర్టిస్టులు ఉన్న సీన్లు ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అనుమతి తీసుకుని వీటిని చేసినా కరోనా ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి రాలేదు కాబట్టి ఒకరకంగా ఇలాంటివి రిస్క్ లాగే ఉంటాయి. అందుకే ఇంకొంత కాలం బ్రేక్ వేసే దిశగా హీరో దర్శకుడు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు దర్శకుడు తేజతో గోపిచంద్ చేయబోయే సినిమాకు హీరోయిన్ చిక్కొచ్చి పడింది. అలివేలు సమేత వెంకటరమణ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందట. గోపిచంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి ఇలా వేర్వేరు ఆప్షన్లు ట్రై చేస్తున్నప్పటికీ ఏవీ కొలిక్కి రాలేదని సమాచారం. ఒకవేళ సీటీమార్ ని కొద్దిరోజులు హోల్డ్ లో పెట్టాల్సి వస్తే ఆ గ్యాప్ లో తేజ సినిమా సాధ్యమైనంత పూర్తి చేయాలనీ గోపీచంద్ ప్లానట.

అయితే లీడ్ పెయిర్ ఫిక్స్ కాకుండా డేట్స్ తీసుకోకుండా ఇదంతా జరిగే పని కాదు. దీనికి సంబంధించిన తతంగమైతే తెరవెనుక జరుగుతోందట. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి మార్కెట్ ఉన్న గోపీచంద్ కు వరుస పరాజయాలు బిజినెస్ పరంగా బాగా ప్రభావం చూపించాయి. అందుకే ఈసారి మూసలో వెళ్లకుండా సంపత్ నంది చెప్పిన స్పోర్ట్స్ డ్రామాకు, తేజ చెప్పిన రామ్ కామ్ స్టోరీకి ఓకే చెప్పాడు. తీరా చూస్తే ఇప్పుడేమో ఈ చిక్కులు వచ్చి పడ్డాయి. కరోనా దెబ్బ ఒక్క గోపిచంద్ మీదే కాదు అందరు హీరోల మీదా పడింది. ప్లానింగులన్నీ తలకిందులయ్యాయి. ఇప్పుడీ రెండు వైపులా ఏర్పడ్డ చిక్కుల నుంచి గోపి ఎలా బయపడతారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి