iDreamPost

కొరడా ఝుళిపించిన GHMC అధికారులు! ఆల్ఫా హోటల్‌ సీజ్!

  • By Soma Sekhar Published - 10:21 AM, Mon - 18 September 23
కొరడా ఝుళిపించిన GHMC అధికారులు! ఆల్ఫా హోటల్‌ సీజ్!

ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో.. ప్రజలు, ఉద్యోగులు స్ట్రీట్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. దీంతో రోడ్ల వెంబడి హోటల్స్, చిరుతిండ్ల వ్యాపారాలు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. అయితే చాలా వరకు కొన్ని హోటల్స్ సరైన పరిశుభ్రతను మెయింటైన్ చేయకుండానే వినియోగదారులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లో ఫేమస్ అయిన ఆల్ఫా హోటల్ ను తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వీరు రైడ్ లో పాల్గొన్నారు. శుక్రవారం మటన్ కీమా రోటీ తిన్న లోయర్ ట్యాంక్ బండ్ కు చెందిన జమాలుద్దీన్ అస్వస్థతకు గురైయ్యాడు. ఇదే విషయాన్ని హోటల్ మేనేజర్ కు తెలియజేయగా అతడు పట్టించుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు జమాలుద్దీన్. అతడి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ పై రైడ్ చేశారు.

నాణ్యతలేని ఆహారాన్ని వినియోగదారులకు సరఫరా చేయడంతో పాటుగా.. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్ పై ఈనెల 15న కొంత మంది ఫిర్యాదు చేయడంతో పాటుగా.. ట్యాంక్ బండ్ కు చెందిన జమాలుద్దీన్ అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి.. హోటల్ ను తనిఖీ చేశారు. హోటల్ లోని కొన్ని శాంపిల్స్ సేకరించారు. అలాగే ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఇక సేకరించిన శాంపిల్స్ ను నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి అధికారులు హోటల్ ను తనిఖీ చేయగా.. అప్పుడు కూడా హోటల్ యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడంలేదని తేలింది. అదీకాక పరిశుభ్రతను పాటించడంలో నిర్లక్ష్యం వహించడంతో.. అధికారులు కొరడా ఝుళిపించారు. హోటల్ ను సీజ్ చేసింది. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి.. యాజమాన్యానికి జరిమానా విధించి, తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.