iDreamPost

కాంగ్రెస్ ను కాపాడేదెవ‌రు..?

కాంగ్రెస్ ను కాపాడేదెవ‌రు..?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంగ్రామంలో విజ‌యం కోసం పార్టీల‌న్నీ ప‌రిత‌పిస్తున్నాయి. అభ్య‌ర్థులను కూడా ప్ర‌క‌టిస్తున్నాయి. ప్ర‌ధానంగా టీఆర్ఎస్, బీజేపీ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ లో ముందుండి న‌డిపించే నాయ‌కుల కొర‌త తీవ్రంగా క‌నిపిస్తోంది. దుబ్బాక‌లో ఘోరంగా ఓట‌మి చెందిన త‌ర్వాత ఆ ప్ర‌భావం కాంగ్రెస్ మొత్తంపై ప‌డింది. శ్రేణుల్లో ఉత్సాహం త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇంత‌లోనే గ్రేట‌ర్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌వ్వ‌డంతో పార్టీ అప్ర‌మ‌త్త‌మైంది. గ్రేట‌ర్ లో ప్ర‌భావం చూపేందుకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కేడ‌ర్ లో ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ గ్రేట‌ర్ కాంగ్రెస్ లో నాయ‌క‌త్వ లోపం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

నాడు మేయ‌ర్ పీఠం కాంగ్రెస్ దే అయిన‌ప్ప‌టికీ..

జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలో మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్నది కాంగ్రెస్ పార్టీయే. ఎంఐఎం స‌హ‌కారంతో కాంగ్రెస్ గ్రేట‌ర్ లో జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో పాగా వేసింది. తొలి మేయ‌ర్ గా బండ కార్తీక రెడ్డి ప‌ద‌విని అలంక‌రించారు. ఇప్పుడామె కూడా బీజేపీలో చేరారు. గ్రేటర్‌ కాంగ్రె‌స్‌లోని హేమహేమీ నేతలంతా ఆరేళ్లుగా ఇతర పార్టీల్లోకి వలస పోతుండడంతో పలు డివిజన్లలో పార్టీ అభ్యర్థులను నిలపడం కూడా నాయకత్వానికి సవాల్‌గా మారింది. గతంలో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం నాయకులు ఎన్నో తిప్పలు పడేవారు.. పైరవీలు చేసేవారు. కానీ.. ప్రస్తుతం పిలిచి టికెట్‌ ఇచ్చినా పోటీ చేయడానికి కొంతమంది నేతలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు మినహా.. మిగతా సందర్భాల్లో పట్టించుకునేవారు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి, శేరిలింగంపల్లి నేత రవికుమార్‌ యాదవ్‌ కాషాయ కండువా కప్పుకొన్నారు. గ్రేట‌ర్ తొలి మేయ‌ర్ పీఠం ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఎన్ని డివిజ‌న్ల‌లో ప్ర‌భావం చూపుతుందోన‌న్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా ఏర్ప‌డింది. దానం నాగేంద‌ర్, ముఖేష్ గౌడ్ ఉన్న కాలంలో గ్రేట‌ర్ కాంగ్రెస్ కాస్త బ‌లంగా ఉండేది. దానం నాగేంద‌ర్ టీఆర్ఎస్ కండువా క‌ప్పుకోవ‌డం, ముఖేష్ గౌడ్ మృతి చెంద‌డంతో అంజ‌న్ కుమార్ యాద‌వ్ త‌ప్పా గ్రేట‌ర్ కాంగ్రెస్ లో చెప్పుకోతగ్గ నేత‌లు ఎవ‌రూ లేరు. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌భావం గ్రేట‌ర్ లో పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు.

అలిగిన అంజ‌న్!

కాంగ్రెస్ ను సీత క‌ష్టాలు వెంటాడుతున్నాయి. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ కూడా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు ప‌ర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయ‌న‌కు జీహెచ్ ఎంసీ కోసం వేసిన క‌మిటీల్లో స్థానం ద‌క్క‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒకప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై చూసుకున్న కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ‘గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కానీ బీ- ఫామ్‌లు ఇవ్వడం కానీ నా ద్వారా జరగాల్సి ఉండే.. కానీ అలా జరగలేదు. అందుకే అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను. ’ అని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే త‌ర్వాత ముఖ్య నాయ‌కులు మంత‌నాలు సాగించ‌డంతో ఆయ‌న కాస్త కుదుట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి