iDreamPost

కేసీఆరే వారి ఆశ‌.. ఆకాంక్ష‌!

కేసీఆరే వారి ఆశ‌.. ఆకాంక్ష‌!

ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం పర్వం తుది అంకానికి చేరుకుంటోంది. రేపు సాయంత్రం 5 గంట‌ల‌తో ప్ర‌చారం ముగియ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ సాగిన ప్ర‌చార జోరు టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య నువ్వా.. నేనా అన్న రీతిలో సాగింది. వార్ వ‌న్ సైడే అని ఊహించిన టీఆర్ఎస్ కు బీజేపీ ప్ర‌చారంలో గ‌ట్టి పోటీయే ఇచ్చింది. ఆ పార్టీ నుంచి మ‌హామ‌హులంతా రంగంలోకి దిగి ప్ర‌చార ప‌ర్వాన్ని ర‌క్తి క‌ట్టించారు. బీజేపీ మార్క్ ప్ర‌సంగాలు, రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. వాటి విద్వేష ప్ర‌సంగాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్ కూడా దీటుగానే జ‌వాబు ఇస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. డివిజ‌న్ల‌లో కూడా టీఆర్ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల ప్ర‌చారం జోరుగానే సాగుతోంది. ఒక‌రికి మించి మ‌రొక‌రు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దిగుతున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు ఎల్బీ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌కు సీఎం కేసీఆర్ హాజ‌రుకానున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం ఓ లెక్క‌.. కేసీఆర్ స‌భ మ‌రో లెక్క అన్న‌ట్లుగా టీఆర్ఎస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఏకైక స‌భ ఇదే…

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ నుంచి జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నుంచి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి ఇత‌ర మంత్రులు, యూపీ సీఎం యోగి స‌హా ఎంద‌రో రంగంలోకి దిగారు. న‌గ‌రం న‌లుమూల‌లా ప్ర‌చారం చేస్తూ ఓ ర‌కంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు వ‌ణుకు పుట్టించారు. దీంతో ఇప్పుడు వారంతా కేసీఆర్ స‌భ‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. కేసీఆర్ చెప్ప‌బోయే స‌మాధాన‌లు, గ్రేట‌ర్ వాసుల‌కు ఇవ్వ‌బోయే వ‌రాలు త‌మ గెలుపున‌కు క‌లిసి వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటున్న ఏకైక సభ కూడా ఇదే. ప్రచార గడువు ముగియడానికి సరిగ్గా 24 గంటల ముందు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌ సభను విజయవంతం చేయడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు తీసుకెళ్లాలని కూడా టీఆర్‌ఎస్‌ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఎల్బీ స్టేడియం సాధారణ జన సామర్థ్యం 50వేలు, కిక్కిరిసిపోతే 75వేలు ఉంటుందని అంచనా వేశారు. అయితే స్టేడియం నిండడంతోపాటు బయట కూడా జనం పోటెత్తాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఈ సభకు 2-2.5 లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించింది.

నివ‌ర్.. కొవిడ్ క‌ల‌వ‌రం..

సభ ఏర్పాట్లలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ ప్రచార సభను జన సమీకరణ లోపం వల్ల టీఆర్‌ఎస్‌ నాయకత్వం చివరి నిమిషంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆయన హాజరయ్యే ప్రచార సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్యులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విస్తరించే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నేటి సభకు జనం తరలి వస్తారా..? అన్న అనుమానాలూ టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు వర్షం.. శీతల వాతావరణంతో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్న దృష్ట్యా.. ప్రజలు ఆసక్తి చూపుతారా..? లేదా..? అన్న ఆందోళన వారి లో కనిపిస్తోంది. టీఆర్ఎస్ వ‌ర్గాలు మాత్రం అన్ని అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. స్టేడియంలో అన్ని చోట్లా శానిటైజర్లు అందుబాటులో ఉంచిన‌ట్లు ప్ర‌క‌టించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి