iDreamPost

ర్యాగింగ్ బూతానికి నిండు ప్రాణం బలి.. కలలు సాకారం కాకుండానే..!

ర్యాగింగ్ బూతానికి నిండు ప్రాణం బలి.. కలలు సాకారం కాకుండానే..!

ఒకప్పుడు ర్యాగింగ్ అనేది విద్యాలయాల్లో ఒక భాగంగా ఉండేది. కానీ, ప్రభుత్వాలు- కళాశాలలు కఠిన చర్యలు తీసుకోవడం, చట్టాలు తీసుకురావడంతో కాస్త అలాంటి వేధింపులు తగ్గాయి. కానీ, ఎక్కడో ఒకచోట ర్యాగింగ్ బూతం కోరలు చాస్తూనే ఉంది. నిండు ప్రాణాలను బలిగొంటూనే ఉంది. సీనియర్ల పేరుతో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేధింపులకు గురి చేయడం, వారిని మానసికంగా వేధించడం చేస్తుంటారు. అలాంటి వేధింపులు తట్టుకోలేక మరో విద్యార్థి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఆ కేసులో వెలుగు చూసిన నిజాలు అందరి కళ్లు చమర్చేలా చేస్తున్నాయి.

కోల్ కతా జాదవ్ పూర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ బూతానికి డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. స్వప్నదీప్(18) యూనివర్సిటీలో బీఏ మొదటి సంవత్సరంలో చేరాడు. అతను బుధవారం అర్ధరాత్రి వసతిగృహం భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భారీ శబ్ధం వచ్చిందని విద్యార్థులు అంతా బయటకు వచ్చి చూడగా.. స్వప్నదీప్ నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కొనప్రాణంతో ఉన్న స్వప్నదీప్ ను కేపీసీ మెడికల్ కాలేజ్ కి తరలించగా.. గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. అతని మరణానికి ర్యాగింగ్ కారణం అని పోలీసులు తేల్చారు.

అతడిని గే అని ఎగతాళి చేయడం, వల్లే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను భవనం పైనుంచి దూకే సమయంలో “నేను గే కాదు.. నే గే కాదు..” అంటూ కేకలు వేసినట్లు ప్రత్యక్షంగా చూసినవాళ్లు చెబుతున్నారు. పోలీసులు కూడా బుధవారం రాత్రి స్వప్నదీప్ ని ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ తేల్చారు. అతడిని ఎంత ఘోరంగా వేధించారో మరికొంత మంది ర్యాగింగ్ బాధిత విద్యార్థులు పోలీసులకు వెల్లడించారు. స్వప్నదీప్ ను గే అంటూ ప్రచారం చేశారని.. తోటి విద్యార్థుల ముందు కూడా అవమానించారంటూ తెలిపారు. అలాగే బుధవారం రాత్రి సీనియర్లు స్వప్నదీప్ దుస్తులు విప్పించి మరో విద్యార్థి గదిలోకి వెళ్లాలని బలవతం చేశారంటూ చెప్పారు.

చాలా యూనివర్సిటీ హాస్టల్స్ లో కోర్సులు పూర్తి అయిపోయినా కూడా వెళ్లకుండా అక్కడే ఉండేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లకి ఉద్యోగం వచ్చినా యూనివర్సిటీ హాస్టల్స్ లో ఉంటూ జూనియర్లను వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. ఈ ఘటనలో కూడా అలాంటి ఒక విద్యార్థి వల్లే ఈ ఘోరం జరిగింది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన సౌరభ చౌదరి అనే వ్యక్తి కూడ ఇలాంటి వాడే. సౌరభ్ బయట ఉద్యోగం చేస్తూ కూడా క్యాంపస్ లోనే ఉంటున్నాడు. పైగా ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై ప్రతాపం చూపిస్తుంటాడని చెబుతున్నారు. సౌరభ్ చౌదరి చేసిన ర్యాగింగ్ వల్లే స్వప్నదీప్ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తనపై వచ్చిన ఆరోపణలను సౌరభ్ చౌదరి అంగీకరించాడు. అతనిపై ఐపీసీ సెక్షన్ 302/34 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అతనికి కోర్టు రిమాండ్ విధించింది.

స్వప్నదీప్ ఆత్మహత్య జాదవ్ పూర్ యూనివర్సిటీలో కలకలం రేపింది. విద్యార్థి సంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ ధర్నాలు, నిరసనలకు దిగాయి. ఘటనకు కారణైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సీనియర్స్ ఘాతుకాలను బయటపెడుతూ మరికొంత మంది ముందుకు వస్తున్నారు. ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా జాదవ్ పూర్ వర్సిటీని మార్చాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ నిరసనలకు ప్రొఫెసర్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. క్యాంపస్ ని సందర్శించిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఫోన్లో ధైర్యం చెప్పారు. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడిన మమతా బెనర్జీ తప్పకుండా న్యాయం చేస్తామంటూ హామీ తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి