iDreamPost

Draupadi Murmu స్కూల్ టీచర్ నుంచి రాష్ట్రపతి దాకా – ద్రౌపది ముర్ము స్ఫూర్తిదాయక ప్రస్థానం

Draupadi Murmu స్కూల్ టీచర్ నుంచి రాష్ట్రపతి దాకా – ద్రౌపది ముర్ము స్ఫూర్తిదాయక ప్రస్థానం

జూలై 21న మన దేశ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ద్రౌపది ముర్ము తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళ ముర్ము. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ము విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 63 శాతం ఓట్ల మార్జిన్ తో గెలుపొందారు. 64 ఏళ్ళ ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జన్మించిన సంతల్ తెగలోనే ఆమె కూడా పుట్టారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు, తాతయ్య సర్పంచులుగా పని చేశారు.
టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ద్రౌపది ముర్ము ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ఒడిషా సాగునీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. రాయ్ రంగ్ పూర్ నగర పంచాయత్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా ఎన్నికవడం ఆమె సుదీర్ఘ రాజకీయ జీవితానికి తొలి మెట్టు. 2000 సంవ్సతరంలో అదే పంచయత్ కి ఛైర్ పర్సన్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎస్టీ మోర్చాకి ఉపాధ్యాక్షురాలిగా కూడా పని చేశారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు. 2000 – 2004 మధ్య నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రిగా రవాణా, వాణిజ్యం, మత్స్య శాఖ, పశు సంరక్షణ లాంటి శాఖలు నిర్వర్తించారు. 2015లో ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం కీలకమైన మలుపు తిరిగింది. ఈ ఏడే దేశంలోనే తొలి గిరిజన మహిళా గవర్నర్ గా ఆమె ఎంపికయ్యారు. జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి ఆరేళ్ళు పని చేశారు. ఆ సమయంలో రెండు గిరిజన హక్కుల చట్టాలకు సవరణ చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను ముర్ము వెనక్కి పంపి ప్రజాభీష్ఠాన్ని గౌరవించారు.

రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరుకున్న ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. భర్త శ్యామ్ చరణ్ ముర్ము ఒక బ్యాంకర్. వీళ్ళకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకులిద్దరూ చిన్న వయసులోనే చనిపోవడం ముర్ము ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయం. మొదటి కొడుకు 2009లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రెండో కొడుకు మరో మూడేళ్ళకు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ తర్వాత రెండేళ్ళకే భర్త కూడా చనిపోయారు. ఇలా ఏడేళ్ళ కాలంలోనే ముర్ము భర్త, ఇద్దరు కొడుకులతో పాటు అమ్మ, సోదరుణ్ణి కూడా పోగొట్టుకున్నారు. అయినా దు:ఖాన్ని దిగమింగుకుని ఆధ్యాత్మికత వైపు ఆమె దృష్టి మళ్ళించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము పేరు వినిపించడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనే బీజేపీ ముర్మును తమ అభ్యర్థిగా ప్రకటించవచ్చన్న వార్తలు వచ్చాయి. కానీ చివరికి రామ్ నాథ్ కోవింద్ వైపే రూలింగ్ పార్టీ మొగ్గు చూపింది. ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా కోవింద్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ నెల 25న ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి