iDreamPost

తెలంగాణలో కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం..!

తెలంగాణలో కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం..!

మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు పర్యాయాలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టింది. మరోసారి తామే అధికారంలోకి వస్తామని.. హ్యాట్రిక్ హిట్ కొడతామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది కాంగ్రెస్. ఇప్పటికే ఆ దిశగా వ్యూహ రచనలు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తన ఉనికి కోసం పోరాడుతున్న వృద్ధ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. ఇటీవల కర్ణాటకలో తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకుంది కాంగ్రెస్. అందుకోసం ఉచిత పథకాల హామీలను నమ్ముకుంది. ముఖ్యంగా మహిళలను ఆకర్షించే విధంగా పలు పథకాలను తీసుకు వచ్చింది.

కోటిన్నర మంది మహిళలకు నెలకు రూ. 2 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం వంటి హామీలు ఇవ్వడంతో హస్తం పార్టీకి విజయం చేకూర్చారు కర్ణాటక వాసులు. అక్కడ విజయాన్ని అందించిన హామీల పంథాను తెలంగాణలోనూ అప్లై చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ శివార్లులోని తుక్కుగూడలో విజయభేరీ పేరిట కాంగ్రెస్ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక హామీలు ప్రకటించారు. ఇక్కడ కూడా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని హామీలను గుప్పించారు సోనియా. ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం కింద పలు హామీలను గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ. 2500 కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కేవలం రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్, ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం, రైతుల, కౌలు రైతులకు రూ. 15వేల పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ. 500 బోనస్, గృహ జ్యోతి పథకం కింద రూ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేయూత పథకం ద్వారా నెలకు రూ 4 వేలు పింఛను, ఉద్యమ కారుల కుటుంబాలకు 250 చ. గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అంతేకాకుండా ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని హామీలిచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి