iDreamPost

పెద్ద నోట్ల రద్దుకు ఐదేళ్లు..! లక్ష్యం నెరవేరిందంటున్న ప్రధాని మోదీ..!

పెద్ద నోట్ల రద్దుకు ఐదేళ్లు..! లక్ష్యం నెరవేరిందంటున్న ప్రధాని మోదీ..!

అప్పటికి రాత్రి 8 గంటలు అయింది. దేశంలో పల్లెలు నిద్రపోయాయి. పట్టణం, నగరం మాత్రమే ఇంకా మేల్కొని ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుస్తు సమాచారం లేకుండా జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అన్ని టీవీ ఛానెళ్లు లైవ్‌ చూపిస్తున్నాయి. ఈ రోజు అర్థ రాత్రి నుంచి వెయి, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

నల్లధనం, అవినీతి, నకిలీ నోట్లు అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక స్థితి కొత్త శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. 15.30 లక్షల కోట్ల పెద్ద నోట్లలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రాబోవని, ఆ నల్లధనం అంతా నదిలో పాయాల్సిందేనన్నారు. సోమవారం నుంచి పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు ఉపసంహరణపై ఆంక్షలు వర్తిస్తాయని వెల్లడించారు. ఇది జరిగి సరిగ్గా ఐదేళ్లు అవుతోంది. మరి పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా..? ఐదేళ్ల తర్వాత పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏమనుకుంటున్నాయనేది ఇప్పుడు ప్రస్తావనార్హం.

పెద్ద నోట్ల రద్దు వల్ల నాడు ప్రధాని చెప్పిన నల్లధనం అంతం కాలేదు. మూడు లక్షల కోట్లు తిరిగి రావని ప్రధాని చెబితే.. 99.999 శాతం పెద్ద నోట్లు మొత్తం బ్యాంకులకు వచ్చాయి. మిగతా 0.001 శాతం దేవుడి హుండీలలో ఉన్న పెద్ద నోట్లే. అంటే మొత్తం 100 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చాయి. దేశంలో ఉన్న మూడు లక్షల కోట్ల నల్లధనం పూర్తిగా తెల్లధనం అయిపోయింది. పెద్దనోట్ల రద్దు నల్లధనం అరికట్టడం కోసమే కాదు.. అంటూ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు డిజిటల్‌ పే మెంట్లు, ఉగ్రవాదం నిర్మూలన అంటూ అనేక లక్ష్యాలు జోడించి చెప్పారు.

నాడు ప్రధాని మోదీ లక్ష్యం ఏమైనా.. ఈ నిర్ణయం వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ వద్ద ఉన్న అరకొర నగదును బ్యాంకుల్లో మార్చుకునేందకు రోజుల తరబడి క్యూలలో నిలుచుకున్నారు. ఈ క్రమంలో పలువురు వృద్ధులు సొమ్మసిల్లి చనిపోయారు కూడా. నెలల పాటు సాగిన ఈ మార్పిడి ప్రక్రియలో దేశం మొత్తం మీద సామాన్యులే బ్యాంకుల వద్ద నిలబడ్డారు కానీ కనీసం ఓ కౌన్సిలర్, కార్పొరేటర్‌ కూడా బ్యాంకుల వద్దకు వెళ్లలేదంటే ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నారు. కానీ వారి వద్ద ఉన్న నగదు అంతా మార్చుకున్నారు. నల్లధనం తెల్లధనం అయింది. ఇదెలా సాధ్యమైందనేది బ్యాంకు మేనేజర్లకు మాత్రమే తెలిసిన విషయం.

పెద్ద నోట్ల రద్దు చేసిన రోజు కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ నాటి తన నిర్ణయంపై స్పందించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని అరికట్టామని వ్యాఖ్యానించారు. దీంతో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరగడంతోపాటు పన్నుల చెల్లింపులు కూడా పెరిగాయని చెప్పుకొచ్చారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసంమైదని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన కొంత మంది పెట్టుబడిదారులకు మేలు చేసేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారుగానీ ప్రజల కోసం కాదన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్‌.. బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థ కన్నా వెనుకబడిందన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి