iDreamPost

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు : ఎవరు..? ఎక్కడ గెలిచారు..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు : ఎవరు..? ఎక్కడ గెలిచారు..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. పంజాబ్‌ మినహా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలను కైవసం చేసుకుంది. కమలం ధాటికి ప్రత్యర్థి పార్టీలు బేజారయ్యాయి. పంజాబ్‌లో ఆప్‌ దెబ్బకు కాంగ్రెస్, శిరోమణి అకాళిదల్‌ పార్టీలు మట్టికరిచాయి. అధికారంలో ఉన్న పంజాబ్‌ను చేజార్చుకున్న కాంగ్రెస్, ఆశలు పెట్టుకున్న ఉత్తరాఖండ్, గోవాల్లోనూ చతికిలపడింది. బీజేపీ జోరుకు కాంగ్రెస్‌ బేజారైంది. పంజాబ్‌ ఆప్‌ వశమైంది.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 స్థానాలకు గాను బీజేపీ 273 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల కన్నా సీట్లు తగ్గినా.. స్పష్టమైన మెజారీటితో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం, అధికారంపై ఆశలు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల పరుగులో వెనుకబడింది. ఆ పార్టీ 125 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికలకన్నా ఎక్కువ సీట్లను గెలుచుకోవడమే సమాజ్‌వాదీ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ఇక బీఎస్పీ, కాంగ్రెస్‌పార్టీలు పూర్తిగా చతికిలపడ్డాయి. బీఎస్పీ కేవలం ఒక స్థానానికి పరిమితం కాగా, కాంగ్రెస్‌పార్టీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు మరో రెండు చోట్ల గెలుపొందాయి.

ఉత్తరాఖండ్‌లోనూ కషాయం హవా నడిచింది. అక్కడ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 70 స్థానాలు గల ఉత్తరాఖండ్‌లో బీజేపీ 47 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ 19 సీట్లకు పరిమితం అయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగగా.. ఆ తర్వాత కాంగ్రెస్‌ వెనుకంజ వేసింది. ఇతర పార్టీలు నాలుగు సీట్లు గెలుచుకున్నాయి.

మణిపూర్‌లోనూ మళ్లీ బీజేపీ మెరిసింది. అక్కడ 60 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 30 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ఐదు, ఎన్‌పీపీ ఏడు, జేడీయూ ఆరు, ఇతర పార్టీలు, స్వతంత్రులు మరో 10 సీట్లలో గెలుపొందారు. మేజిక్‌ ఫిగర్‌ 31 కాగా, బీజేపీ సొంతంగానే 30 సీట్లు గెలుచుకోవడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం లేదు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా గోవాలో ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక్కడ 40 సీట్లు ఉండగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్‌ తప్పదని అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే అంచనాలకు మించి బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మళ్లీ అధికారం చేపట్టేలా బీజేపీ సొంతంగా 20 సీట్లను గెలుచుకుంది. మేజిక్‌ ఫిగర్‌కు ఒక్క సీటు దూరంలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ 12 సీట్లతో సరిపెట్టుకుంది. టీఎంసీ కూటమి రెండు చోట్ల, ఆప్‌ రెండు సీట్లను గెలుచుకున్నాయి. స్వతంత్రులు నాలుగు చోట్ల గెలుపొందారు. కాంగ్రెస్, ఆప్, టీఎంసీలు బీజేపీకి ప్రత్యర్థి పార్టీలే కావడంతో.. ఆయా పార్టీలు బీజేపీతో జత కట్టే అవకాశం లేదు. ప్రభుత్వ ఏర్పాటులో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. స్వతంత్రులను కలుపుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమే కానుంది.

‘ఆప్‌’కా పంజాబ్‌..

పంజాబ్‌ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కైవసం చేసుకుంది. ఊహించని స్థాయిలో సీట్లను గెలుచుకుని తొలిసారి ఢిల్లీ బయట సత్తా చాటింది. ఆప్‌ హవాలో కాంగ్రెస్, శిరోమణి అకాళిదల్, బీజేపీ, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌లు కొట్టుకుపోయాయి. అధికారంపై నమ్మకంతో మొత్తం 117 సీట్లలో పోటీచేసిన ఆప్‌.. 92 సీట్లను గెలుచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కేవలం 18 సీట్లకు పరిమితమైంది. సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ సహా హేమాహేమీలు ఆప్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. శిరోమణి అకాళిదల్‌ నాలుగు సీట్లు, బీజేపీ కూటమి రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థి మరొకచోట విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి