iDreamPost

ఏపీలో మూడైతే.. జార్ఖండ్‌లో ఐదు రాజధానులు.. 

ఏపీలో మూడైతే.. జార్ఖండ్‌లో ఐదు రాజధానులు.. 

రాజధాని పేరిట రాష్ట్ర అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమయ్యే పరిస్థితికి ఇక చెల్లుచీటి పడనుంది. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం లేకుండా చేసేందుకు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. తద్వారా ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విధానాన్ని జార్ఖండ్‌ రాష్ట్రం కూడా పాటిస్తోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో జార్ఖండ్‌ కూడా పయనిస్తూ ఆ రాష్ట్రంలో ప్రధాన రాజధానితోపాటు కొత్తగా మూడు ఉప రాజధానులు ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఒక ఉపరాజధానిని ఏర్పాటు చేశారు.

బిహార్ నుంచి కొంత ప్రాంతాన్ని విడగొట్టి 2000 సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో కొల్హాన్, నార్త్ ఛోటా‌నాగపూర్, పలామూ, సంతాల్ పరగణ, సౌత్ ఛోటా‌నాగపూర్ అనే ఐదు డివిజన్లు ఉన్నాయి. ఛాయిబసా కేంద్రంగా ఉన్న కొల్హాన్ డివిజన్లో మూడు జిల్లాలు ఉన్నాయి. హజరిబాఘ్ కేంద్రంగా ఉన్న నార్త్ ఛోటానాగపూర్ డివిజన్లో ఏడు జిల్లాలున్నాయి. పలాము డివిజన్లో మూడు జిల్లాలున్నాయి, దీని హెడ్ క్వార్టర్స్ మేదినినగర్. సంతాల్ పరగణ డివిజన్ పరిధిలో ఆరు జిల్లాలు ఉండగా.. దీని హెడ్ క్వార్టర్స్ దుమ్కా. సౌత్ ఛోటా‌నాగపూర్ డివిజన్లో ఐదు జిల్లాలు ఉన్నాయి. ఈ డివిజన్లోనే రాజధాని రాంచి ఉంది.

రాష్ట్రంలో కొత్తగా మూడు ఉప రాజధానులను, ఏడు ప్రపంచస్థాయి నగరాలను ఏర్పాటు చేస్తామని ఇటీవలే అధికారంలోకి వచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. బాబూలాల్ మరాండీ హయాంలో దుమ్కాను ఉప రాజధానిగా ప్రకటించారు. దీంతోపాటు ఎన్నికల హామీలో భాగంగా హేమంత్ సొరేన్ ప్రభుత్వం మేదినినగర్, ఛాయిబసా, గిరిధ్‌లను కూడా ఉపరాజధానులుగా చేయబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని సమాచారం. ఉప రాజధానుల ఏర్పాటు వల్ల పలాము, కొల్హాన్, నార్త్ చోటానాగపూర్ ప్రాంతాల్లో ప్రజలకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.

జార్ఖండ్‌లో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కానీ గిరిజన జనాభా అధికం, మావోయిస్టుల ప్రాబల్యం కూడా ఉంది. దీంతో చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఉపరాజధానులను ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని హేమంత్ సొరేన్ సర్కారు భావిస్తోంది. మేనిఫేస్టోలోనూ ఈ అంశాన్ని పొందుపర్చింది. ప్రయివేట్ ఉద్యోగాల్లోనూ 75 శాతం స్థానికులకే ఇస్తామని హేమంత్ సోరెన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏపీ, జార్ఖండ్ బాటలో మరికొన్ని రాష్ట్రాలు నడుస్తాయా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి