iDreamPost

భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్

భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్

దేశంలో అధికారికంగా మొదటి కరోనా వైరస్ కేసు నమోదు అయ్యింది. కేరళకి చెందిన ఒక వైద్య విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఈ వార్తని కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో వైద్య విద్యనభ్యసిస్తున్న అతడు ఇటీవలే తన స్వస్థలం కేరళ వచ్చినట్టు తెలుస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నఅతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఇటీవలే వుహాన్ నుండి కేరళ వచ్చిన విద్యార్థికి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అనుమానంతో అతన్ని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతని రక్త నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించగా, పరీక్షలో ఆ రక్త నమూనాలు కరోనా పాజిటీవ్ గా తేలింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని విమానాశ్రయాలలో థర్మల్ స్క్రీనింగ్ సెన్సార్లని ఏర్పాటు చేసి విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను నిశితంగా పరీక్షిస్తున్నారు.

దేశంలో కరోనా వైరా వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నట్టు భారత ప్రభుత్వం తెలిపింది. దానిలో భాగంగా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాలలో థర్మల్ స్క్రీనింగ్ సెన్సార్లతో ప్రయాణికుల వైద్య పరీక్షల కోసం రోజు మొత్తం 24 గంటల పాటు విమానాశ్రయాల్లోనే ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్స్ లనుకూడా అందుబాటులో ఉంచినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతానికి చైనా వ్యాప్తంగా 7,711 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 170 మంది మృతి చెందినట్టు, మరో 128 మంది పూర్తిగా కోలుకున్నట్టు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైనా లోని “హుబే” ప్రావిన్స్ లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఈ ఒక్క ప్రాంతం నుండే 4,586 మంది ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. చైనా పక్కనే ఉన్న దేశాల్లో కూడ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు హాంకాంగ్ లో 10 పాజిటివ్ కేసులు, మకావ్ లో 7 పాజిటివ్ కేసులు, తైవాన్ లో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదికాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఇప్పటివరకు 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి