iDreamPost

తాడేపేడో తేల్చుకునే దిశలో రైతు ఉద్యమం, మోడీ సర్కారుకిది సంకట స్థితి

తాడేపేడో తేల్చుకునే దిశలో రైతు ఉద్యమం, మోడీ సర్కారుకిది సంకట స్థితి

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం రాజకీయంగానూ ఉంటుందనే చర్చ మొదలయ్యింది. పార్లమెంట్ లో ఈ చట్టాల ఆమోదానికి ప్రభుత్వానికి అండగా నిలిచిన వివిధ పక్షాలు కూడా ఈసారి బంద్ లో పాల్గొనడం దానికి సంకేతంగా చెప్పవచ్చు. రైతుల సంక్షేమం కోసమని ప్రభుత్వం చెబుతున్న మాటలను దాదాపుగా ఎవరూ అంగీకరిస్తున్న దాఖలాలే లేవు. సోషల్ మీడియాలో తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ సెక్షన్లు స్పందిస్తున్నాయి. అంతేగాకుండగా గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని రీతిలో భారత్ బంద్ కి అనూహ్య మద్ధతు లభిస్తోంది. ఐటీ రంగం నుంచి ఆటోవాలాల వరకూ అందరూ కదులుతున్న తీరు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

వ్యవసాయ దేశంలో రైతుల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ మోడీ సర్కారు అందుకు భిన్నంగా దూకుడు ప్రదర్శించింది. డీ మోనిటైజేషన్, జీఎస్టీ, 370 ఆర్టికల్స్ తరహాలో రైతులకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో ఏకపక్షంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవసాయానికి సంబంధించి చట్టాల మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించలేదు. అంతేగాకుండా కనీసం వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘాలతోనూ మాట్లాడిన దాఖలాలే లేవు. ఒంటెద్ద పోకడతో కేంద్రం నిర్ణయం తీసుకుని అందరూ అమలు చేయాలనే లక్ష్యంతో సాగిన మూలంగా ప్రస్తుతం చిక్కుముడి పడినట్టు కనిపిస్తోంది.

వ్యవసాయ చట్టాల మార్పు మూలంగా తొలుత పంజాబ్ లోనే వ్యతిరేకత వస్తుందని ఆశించారు. ఆ తర్వాత హర్యానికి విస్తరించింది. ఇప్పుడు యూపీ, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా హస్తిన బాట పట్టారు. దాంతో చివరకు ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. ఓవైపు సోషల్ మీడియాలో బీజేపీ మద్ధతుదారులు రైతులపై మండిపడుతున్నారు. ఖలీస్తాన్, పాకిస్తాన్ అంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆందోళనకారులతో నాలుగు దఫాలుగా చర్చలు చేస్తోంది. అంటే వారి ఉద్యమాన్ని గుర్తించింది. అంతేగాకుండా సంబంధిత చట్టాలలో పలు మార్పులకు అంగీకరించింది. తద్వారా రైతుల ఉద్యమం న్యాయబద్ధమైనదేనని అంగీకరించినట్టయ్యింది.

అయితే రైతులు సంఘటితంగా సాగిస్తున్న ఉద్యమం పూర్తిగా చట్టాలు మార్చాలనే నిబంధన పెడుతున్నాయి. కనీసంగా ఎంఎస్పీ కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాయి. దాంతో ప్రభుత్వానికిది మింగుడుపడడం లేదు. చట్టాలు రద్దు చేసినా లేదా ఎంఎస్ పీ విషయంలో వెనక్కి తగ్గినా ఇక ఆ చట్టాల సారాంశం పూర్తిగా దెబ్బతిన్నట్టే అవుతుంది. పైగా కేంద్రం వెనకడుగు వేయాల్సి వస్తే అది మోడీ ఇమేజ్ కి పూర్తిగా దెబ్బతీస్తుంది. దాంతో రైతు ఉద్యమానికి తలవంచకుండా మొండిగానే వ్యవహరించే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఆందోళనలో ఉన్న రైతులు కూడా అందుకు తగ్గట్టుగానే సాగుతున్నారు. దీర్ఘకాలిక ఉద్యమానికే సంఘటితం అయినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో నలుమూలలా ఉన్న పరిస్థితి దానికి అద్దంపడుతోంది.

రాజకీయంగా మోడీకి ఇది సంకట స్థితిగానే చెప్పాలి. ఏడేళ్ల పాలనలో ఎన్నడూ చూడని సమస్య ఇది. రాజకీయంగా సెంటిమెంట్ తో కూడా అన్నదాత వ్యవహారం ఎక్కడ తమను ముంచే దిశలో సాగుతుందోననే చర్చ బీజేపీలో మొదలయ్యింది. తాజాగా భారత్ బంద్ పిలుపు దేశం నలుములలా ప్రతిధ్వనించడంతో ఉద్యమం విస్తృతమవుతుందనే అభిప్రాయం కూడా బలపడుతోంది. దాంతో ముందుకెళ్లాలా.. లేక వెనక్కి తగ్గాలా అన్నది కమలనాథులు తేల్చుకోవాల్సి వస్తోంది. ప్రధానంగా ఆర్థికంగా, రాజకీయంగా , లాబీయింగ్ పరంగా బలమైన పంజాబీ రైతులతో ముడిపడిన ఉద్యమం మూలంగా పరిస్థితి తీవ్రమయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దాంతో కేంద్రమే ఏదో ఒక పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని బీజేపీ కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. అది ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకం అవుతోంది. మోడీ మౌనంగా ఉండడం కూడా నష్టదాయకమేనని అంచనాలు వస్తున్నాయి. ఏమయినా ఇదో కీలక పరిణామంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశలో ఉందనే చెప్పవచ్చు.