iDreamPost

ఆరు నెలల రైతు ఉద్యమం, రాబోయే ఎన్నికలపై బీజేపీలో మొదలయిన చర్చ

ఆరు నెలల రైతు ఉద్యమం, రాబోయే ఎన్నికలపై బీజేపీలో మొదలయిన చర్చ

మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ గత ఏడాది నవంబర్ 26న మొదలయిన రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చలి, వాన, ఎండ తేడా లేకుండా రైతులు పోరాడుతూనే ఉన్నారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఉధృత రూపం దాల్చిన ఈ ఉద్యమం ఆ తర్వాత కొంత శాంతించినట్టు కనిపించింది. కానీ యూపీ, హర్యానా సహా వివిధ రాష్ట్రాల్లో విస్తృతమయ్యింది. ముఖ్యంగా జాట్ల నాయకుడు రాకేష్ తికాయత్ చొరవ తో కిసాన్ పంచాయత్ ల తాకిడి కనిపించింది.

ఈ ఉద్యమం కారణంగా బీజేపీకి బలమైన వర్గంగా ఉన్న జాట్లు దూరమవుతున్నట్టు కనిపించింది. దాని ప్రభావం ఇటీవల యూపీ స్థానిక ఎన్నికల్లో కనిపించింది. వారణాశి , గొరఖ్ పూర్ వంటి పీఎం మోడీ, సీఎం యోగి నియోజకవర్గాల్లో కూడా బీజేపీ వెనుకబడింది. ఇక లక్నో సమీప ప్రాంతంలో ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమం రాబోయే మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.

ముఖ్యంగా పంజాబ్, యూపీ ఎన్నికల ముంగిట రైతులు శాంతించేలా కనిపించడం లేదు. కేంద్రం దిగిరావాల్సిందేననే పట్టుదలతో సాగుతున్నారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పటికీ కష్టాల మధ్యనే శిబిరాలు కొనసాగించిన రైతులు ఇప్పుడు ఉద్యమాన్ని ఉధృతం చేసే ఆలోచనతో ఉన్నారు. దాంతో ఈ ఉద్యమ ప్రభావం హర్యానా, యూపీలలో బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారబోతోంది. హర్యానా లో ప్రస్తుతం ఎన్నికలు లేవు కాబట్టి కొంత సమయం తీసుకున్నప్పటికీ యూపీ ఎన్నికల్లో బీజేపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓవైపు కరోనా నియంత్రణలో విఫలమయ్యారనే ప్రచారం తీవ్రంగా ఉంది. బీజేపీకి ఎదురుగాలికి ప్రధాన కారణంగా మారింది. దానికి తోడు రైతు ఉద్యమ ప్రభావం కనిపిస్తే బీజేపీకి గడ్డుకాలం దాపురిస్తుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ప్రధాని మోడీ, అనుంగుడు హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా హాజరయ్యారు. యూపీలో పరిస్థితిని చక్కదిద్దే యోచన చేశారు. ఏడేళ్ల పాలన నిండుతున్న సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశం తర్వాత జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

కానీ బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్న తరుణంలో దానిని అధిగమించి రైతులు సహా వివిధ వర్గాలను శాంతింపజేయడం యూపీలో బీజేపీకి పెద్ద పరీక్షగా మారింది. పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్, సిద్ధూ వర్గాల మధ్య కాంగ్రెస్ కుమ్ములాట తీవ్ర మవుతున్న తరుణంలో బీజేపీకి అదొక్కటే ఆశ. మిత్రపక్షం అకాలీదళ్ కూడా దూరమయిన తరుణంలో పంజాబ్ బీజేపీ పేలవంగా ఉంది. దానికి తోడు యూపీలో తమ సొంత శక్తి సామర్థ్యాలతో గట్టెక్కడం ఎలా అన్నదే ఆపార్టీ ముందున్న కర్తవ్యం. దానికి రైతాంగ ఉద్యమం పెద్ద ఆటంకంగా మారుతోంది. మే 26కి ఆరు నెలలు నిండిన సందర్భంగా తాజాగా మరోసారి బ్లాక్ డే పేరుతో ఢిల్లీని చుట్టిముట్టారు.

దాని ప్రభావం కూడా యూపీ రైతుల మీద పడుతుందనడంలో సందేహం లేదు. దాంతో వ్యవసాయ బిల్లుల విషయంలో ఇన్నాళ్లు ధీమాగా కనిపించిన బీజేపీ వర్గాల్లో ప్రస్తుతం పునరాలోచన వైపు ప్రయత్నం చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మోడీ మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు తక్కువని, యూపీ ఎన్నికల్లో ప్రతికూలతను ఎదుర్కొనేందుకే ఆయన మొగ్గు చూపుతారని భావిస్తున్నారు.. దాంతో రైతు ఉద్యమం దాని ప్రభావం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరమే.

Also Read : బంగారు భ‌వ‌నంలో బీజేపీ ఎంపీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి