iDreamPost

పట్టువదలని రైతన్న.. దిగివస్తోన్న కేంద్ర ప్రభుత్వం..

పట్టువదలని రైతన్న.. దిగివస్తోన్న కేంద్ర ప్రభుత్వం..

నూతనంగా తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు రెండు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం కొలిక్కి వస్తోంది. చట్టాలను రద్దు చేయాలని రైతులు… సవరణలు మాత్రమే చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టుబట్టాయి. రెండు నెలలు కావస్తున్నా.. రైతులు తమ పట్టు వీడకపోవడం, శాంతియుతంగా నిరసన తెలుపుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగరాకతప్పడం లేదు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రోజు రైతు సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో కేంద్రం ప్రభుత్వం మునుపటికి భిన్నంగా కీలక ప్రతిపాదనను తెచ్చింది.

సుదీర్ఘ చర్చల అనంతరం సాగు చట్టాల వల్ల లాభ నష్టాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమిస్తామని, అప్పటి వరకు చట్టాల అమలును నిరవదికంగా వాయిదా వేస్తామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు. ఈ కమిటీలో రైతులు, రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉంటారని పేర్కొన్నారు. కేంద్రం చేసిన ప్రతిపాదనపై ఏ విషయం వెల్లడించని రైతు సంఘాల నేతలు.. చర్చించుకుని నిర్ణయం తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం చర్చలు మొదలైనప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్‌పై సానుకూలంగా ఉన్నట్లుగానే కనిపించింది. అధ్యయన కమిటీ నియామకం తర్వాత ఏడాది వరకు సాగు చట్టాలను నిలిపివేస్తామని, ఆ తర్వాత రెండేళ్లు నిలిపివేస్తామని చెప్పిన కేంద్ర మంత్రులు.. చివరకు కమిటీ నివేదిక ఇచ్చే వరకు నిరవదికంగా వాయిదా వేస్తామని ప్రతిపాదించారు. దీంతో గణతంత్ర దినోత్సవం రోజు నాటికి రైతు ఉద్యమం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైతుల ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్ధతు లభించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా రైతులకు బాసటగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం మంకుపట్టుతో సమస్య పరిష్కారం కోసం పని చేయకపోవడంతో.. సాగు చట్టాల అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సమస్య పరిష్కారం కోసం ముగ్గురు నిపుణులతో కూడిన కమిటినీ ఏర్పాటు చేసింది. అయినా.. రైతులు శాంతించలేదు. సాగు చట్టాల తక్షణ రద్దు కోరుతూ నిరసనలు తెలుపుతున్నారు. ఉగ్రవాద విమర్శలు, ఎన్‌ఐఏ కేసులు, అవహేళనలు, ఎముకలు కొరికే చలి, వర్షాలు.. ఇన్ని ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కొని రైతులు చేస్తున్న పోరాటం.. ఫలించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి