iDreamPost

గంటా ఆశలు నెరవేరేనా..?

గంటా ఆశలు నెరవేరేనా..?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ చర్చనీయాంశమే. రాజకీయంగా ఆయన నిర్ణయాలు ఆసక్తికరమే. ఉపాధి కోసం విశాఖ వెళ్లి, ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగం నుంచి ఓ కాంట్రాక్ట్ సంస్థకు అధినేతగా మారిన ఆయన ప్రస్థానంలో రాజకీయ జీవితం విశేషంగానే చెప్పాలి. టీడీపీ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్, మళ్లీ టీడీపీ ఇలా పలు పార్టీలలో సాగారు. అనకాపల్లి ఎంపీ నుంచి ఎమ్మెల్యే, చోడవరం నుంచి భీమిలి మీదుగా మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఇలా గంటా వ్యవహారం స్థిరత్వం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ అవసరాల కోసం ఆయన ఎవరితోనయినా స్నేహం చేయగలరనే విషయం రూఢీ అవుతోంది. ఆ క్రమంలోనే త్వరలో వైఎస్సార్సీపీలో చేరిపోతారని ఆయన అనుచరులంతా బలంగా వాదిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే పలు ముహూర్తాలు కూడా పెట్టేశారు.

తాజాగా గంటా తనయుడు రవితేజ వైఎస్సార్పీపీలో చేరతారని, గంటా కూడా వాసుపల్లి గణేష్ బాటలో జగన్ కి జై కొడతారని మీడియా ఊదరగొట్టింది. కానీ ఈసారి ముహూర్తం కూడా ముగిసిపోయింది. కానీ ఎటువంటి మార్పులు లేవు. దానికి అనేక కారణాలున్నట్టుగా చెబుతోంది. ముఖ్యంగా అధికారపక్షంలో చేరాలని గంటా తీవ్రంగా తహతహలాడుతున్నట్టు అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట కూడా జగన్ మీద విమర్శలకు ఆయన పూనుకోవడం లేదు. అంతేగాకుండా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తద్వారా తాను వైఎస్సార్సీపీకి చేరువయ్యేయత్నంలో ఉన్నాననే సంకేతాలు పంపిస్తున్నారు.
అయినప్పటికీ గంటా గురించి బాగా తెలిసిన వైఎస్సార్సీపీ అధిష్టానం ససేమీరా అంటున్నట్టు సమాచారం.

గతంలో గంటా శ్రీనివాసరావు సాగించిన వ్యవహారాలు గమనంలో ఉంచుకున్న పాలక పార్టీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇంకా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్సీపీ వైపు వస్తారనే ప్రచారం నేపథ్యంలో చివరిలో గంటా గురించి ఆలోచించే అవకాశం ఉందని చెబుతున్నారు. గంటా ఎంతగా ఆశపడినప్పటికీ ఆయన విషయంలో ఆతృత పనికిరాదని వైఎస్సార్సీపీ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. మరో మాజీ మంత్రి నారాయణకు వియ్యంకుడయిన గంటా పార్టీలో చేరితే టీడీపీకి తీరని నష్టం జరుగుతుంది గానీ గంటా రాకతో వైఎస్సర్సీపీలో పరిణామలు ఎటు మళ్లుతాయోననే సందేహాలున్నాయి. అంతేగాకుండా కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరాలని బలంగా ప్రయత్నాలు చేసి చివరి నిమషంలో మనసు మార్చుకున్న వ్యక్తిని విశ్వసించే విషయంలోనూ పరిశీలన చేస్తున్నారు. ఇవన్నీ కొలిక్కిరావడానికి గంటాకి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు. ఈలోగా మీడియాకు ఎన్ని లీకులిచ్చి ప్రచారం చేయించుకున్నా పెద్దగా ఫలితాలు రాకపోవచ్చనే భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి