iDreamPost

కేసీఆర్‌కు పీకే ఆ విషయం చెప్పేశాడట..!

కేసీఆర్‌కు పీకే ఆ విషయం చెప్పేశాడట..!

తెలంగాణలో రాజకీయ పార్టీలలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. ఈవీఎం పోరుకు పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఈ దిశలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మిగతా పార్టీల కన్నా ముందు ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్‌ కొట్టాలని గులాబీ దళపతి కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఎక్కడా ఛాన్స్‌ తీసుకోవడం లేదు. విజయవంతమైన వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌(పీకే)ను కేసీఆర్‌ రంగంలోకి దించారు.

లాజిక్‌తో కొడుతున్న ఈటెల..

పీకేను టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోవడంపై ఒకప్పటి కేసీఆర్‌ సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఓడిపోతారని తెలిసే కేసీఆర్‌ పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నారంటూ చెబుతూ ఆలోచింపజేస్తున్నారు. ఎప్పుడూ ఓడిపోని టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు పీకే ఎందుకు అవసరం అయ్యాడంటూ లాజిక్‌తో కొడుతున్నాడు. అంతేకాదు.. టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని పీకే ఇప్పటికే కేసీఆర్‌కు చెప్పాడంటూ కూడా ఈటెల పేర్కొంటున్నారు. తన మాజీ బాస్‌ను అధికారంలో నుంచి దించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈటెల రాజేందర్‌ ఆ దిశగా విమర్శల విల్లంబులను ఎక్కుపెడుతున్నారు.

హాట్రిక్‌పై కేసీఆర్‌ గురి..

రెండు దఫాలు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం సర్వసాధారణమే. ఈ విషయం కేసీఆర్‌కు తెలియందేమీ కాదు. అందుకే గులాబీ దళపతి అప్రమత్తమయ్యారు. ఎప్పుడూ లేనిది వ్యూహకర్తను పెట్టుకున్నారు. ఉద్యమ సమయంలోనూ, వరుసగా రెండు సార్లు అధికారం సాధించిన సమయంలోనూ కేసీఆర్‌ వ్యూహకర్తను పెట్టుకోలేదు. అంతా తానై ఉద్యమాన్ని, పార్టీని నడిపించారు. అయితే ఈసారి పీకేను వ్యూహకర్తగా పెట్టుకోవడంతో విమర్శలకు అవకాశం ఏర్పడింది. అందుకే ఈటెల రాజేందర్‌ లాజికల్‌గా మాట్లాడి.. ప్రజలను ఆలోచింపజేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి