iDreamPost

ఏక్ మినీ కథ రివ్యూ

ఏక్ మినీ కథ రివ్యూ

లాక్ డౌన్ వేళ మళ్లీ ఓటిటి డైరెక్ట్ రిలీజులు ఊపందుకుంటున్నాయి. ఈ నెలలో ఇప్పటికే మూడు వచ్చేశాయి. గత కొద్దిరోజులుగా ప్రమోషన్ రూపంలో జనాల అటెన్షన్ బాగానే తీసుకున్న ఏక్ మినీ కథ ఇవాళ అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లలోకి వచ్చేసింది. రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లు సపోర్ట్ చేయడంతో పాటు యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందిన సినిమా ఇది. పేపర్ బాయ్ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ మెప్పించేలా సాగిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

సంతోష్(సంతోష్ శోభన్)చిన్నప్పటి నుంచే తన ప్రైవేట్ పార్ట్ చిన్నగా ఉందనే ఆత్మనూన్యతా భావంతో పెరిగి పెద్దవుతాడు. సివిల్ ఇంజినీర్ గా మారాక కూడా మార్పు రాకపోగా అది ఇంకా పెరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపరేషన్ కు సిద్ధపడినా సైజ్ విషయంలో ఫెయిలవుతూ ఉంటాడు. ఈలోగా ఊహించని విధంగా సంతోష్ జీవితంలోకి భార్యగా అడుగు పెడుతుంది అమృత(కావ్య తాపర్). ఇక అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ కొత్త మలుపులు తీసుకుంటుంది. ఇంతకీ సంతోష్ సమస్య తీరిందా, అతను కోరుకున్నది వచ్చిందా లాంటి ప్రశ్నలకు సమాధానం మీరు ప్రైమ్ ఓపెన్ చేసి చిన్నితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు

టాలెంట్, రూపం రెండూ బాగానే ఉన్న సంతోష్ శోభన్ టైం కలిసిరాక ఎక్కువ సినిమాలు చేయలేకపోవడం అతని బ్యాడ్ లక్. ఇందులో అరుదుగా అనిపించే సమస్య ఉన్న యువకుడిగా ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. ఇలాంటి రోల్స్ చేయడం వల్ల తన మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందేమో అని ఆలోచించకుండా కేవలం పెర్ఫార్మెన్స్ మీదే ఫోకస్ పెట్టినందుకు అభినందించాలి. మరీ ఈ మాత్రం దానికే వర్సటైల్ యాక్టర్ అనలేం కానీ ఇంకా విభిన్నమైన సబ్జెక్టులను ఎంచుకుంటే మాత్రం మంచి భవిష్యత్తు ఉంది.

హీరోయిన్ కావ్య తాపర్ అందంగా బాగుంది. ఇలాంటి వాళ్ళు నటన కన్నా డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రతిభ వల్ల ఈజీగా గట్టెక్కుతున్నారు. బ్రహ్మాజీ ఎప్పటిలాగే తన సీనియారిటీతో నెట్టుకొచ్చారు. హీరో ఫ్రెండ్ గా నటించిన సుదర్శన్ కి ఎక్కువ సీన్లు పడ్డాయి. అతనూ బాగా వాడుకున్నాడు. ఉన్నంతలో సప్తగిరి నవ్వులు పూయించాడు. హర్షవర్ధన్, పోసాని అలా కాసేపు కనిపించే పాత్రలు . శ్రద్దా దాస్ తో ఏదో డిఫరెంట్ గా ట్రయ్ చేశారు కానీ అంతగా పేలలేదు. అసలు ఈ క్యారెక్టర్ అవసరం లేదు కూడా. ఇరికించారు అంతే. ఇతర తారాగణం ఇంకా ఉంది కానీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం రాలేదు.

డైరెక్టర్ అండ్ టీమ్

తెలుగు సినిమా ప్రేక్షకులు నవ్యతను కోరుకుంటున్నారు. అందులో సందేహం లేదు. అలా అని ఇప్పటిదాకా రాని పాయింట్ అంటూ చాలా సున్నితమైన అంశంతో ఈ సినిమాకు కథ, మాటలు అందించిన మేర్లపాక గాంధీ ఉద్దేశం ఏమైనప్పటికీ రెండుంపావు గంటలు నడపాల్సిన డ్రామా ఇందులో లేదు. థియేటర్లో రిలీజ్ చేసే కారణంగానే దర్శకుడు కార్తిక్ రాపోలు అవసరం లేని సాగతీతకు అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. హీరో పాత్రకున్న లోపాన్ని రిజిస్టర్ చేయడం కోసం మొదటి సగంలో లో అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. హీరోయిన్ ఎంట్రీని అందుకే లేట్ చేశారు.

సినిమా జనానికి ఎంత అలవాటు లేని సున్నితమైన పాయింట్ అయినప్పటికీ ఇది మహా అయితే గంట లేదా అదనంగా ఇంకో అరగంటకు మాత్రమే సరిపోయే మెటీరియల్. లేదూ ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా దీన్ని చెప్పాలనుకున్నప్పుడు ప్రైవేట్ పార్ట్ చుట్టే అంత సేపు తిప్పకుండా ఏవైనా సబ్ ప్లాట్స్ జోడించి ఉంటే బాగుండేది. కామెడీ చాలా చోట్ల సింపుల్ గా నవ్వించింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ల్యాగ్ ఎక్కువనిపించి బాగా బోర్ కొట్టేది. అలా అని మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేద్దామనిపించే హాస్యం కూడా లేదు. ఏదో మొదటిసారికే చూడటం ఆపేద్దాం అనిపించేలా మాత్రం లేకపోవడం ఊరట

కొన్ని చోట్ల చాలా కన్వీనియంట్ గా లాజిక్స్ ని వదిలేశారు. బిగ్ కి లార్జ్ కి తేడా తెలియకుండా పదే పదే బిగ్ పదాన్ని హీరోయిన్ తో పలికించి అసలు హీరో కోరుకుంటున్నదేంటో వాటి అర్థాలు తెలుసుకోకుండా వాడేశారు. డాక్టర్ ఎన్ని ఇంచులు పెరగాలని అడిగినప్పుడు ఏదో చదువు రాని వాడిలా లక్కీ నెంబర్ల ఆధారంగా అంత చదువుకున్న సివిల్ ఇంజినీర్ నోటికొచ్చిన నెంబర్ చెప్పడం సిల్లీగా అనిపిస్తుంది. కాకపోతే ఒకదశ దాటాక మరీ ఎబ్బెట్టుగా అనిపించకుండా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఎంటర్ టైన్మెంట్ ని నడిపించడంలో కార్తిక్ రాపోలు తన టాలెంట్ చూపించాడు. ఈ విషయంలో అభినందించాలి

ఇలాంటి కథలు చదివేందుకు ఎలా అనిపించినా తెరమీదకు చూపించడం చాలా కష్టం. అందుకే అసభ్యతకు తావు లేకుండా వీలైనంత నీట్ గా చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు కార్తిక్ రాపోలు, రచయితలు మేర్లపాక గాంధీ, షేక్ దావూద్ లు ప్రశంసలకు అర్హులు. కానీ సబ్జెక్టులో ఎంత నవ్యత ఉన్నా అది సినిమా నిడివికి తగ్గ స్థాయిలో ఎంగేజింగ్ గా ఉంటేనే సక్సెస్ అవుతుంది. సన్నివేశాలను అతికించుకుంటూ పోయినంత మాత్రాన అది హిట్ అందుకుందుకు సరిపోదు. అయినా కూడా ఏక్ మినీ కథ పూర్తిగా నిరాశ పరిచే క్యాటగిరీలో పడకపోవడం ఊరట కలిగించే అంశం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం అనుమానమే

ప్రవీణ్ లక్కరాజు సంగీతం చక్కగా సాగింది. పాటలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి. బిజిఎం కూడా బాగా ఇచ్చాడు. గోకుల్ భారతి ఛాయాగ్రహణం డీసెంట్ గా ఉంది. రీజనబుల్ బడ్జెట్ ని మంచి క్వాలిటీతో తెరమీద చూపించాడు. మేర్లపాక గాంధీ మాటలు కొన్ని చోట్ల పేలాయి కొన్ని చోట్ల చప్పగా అనిపించాయి. సత్య ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం గట్టిగా ఫోకస్ పెట్టి ఉంటే లెన్త్ తగ్గి వేగం పెరిగేది. థియేటర్ కోసమే ఉంచిన లెన్త్ వల్ల సాగతీత తప్పలేదు. యువి నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది. ఎక్కువగా ఇంటీరియర్ లొకేషన్లో ఎక్కువ బడ్జెట్ అవసరం లేకపోయినా తమ మార్కుని చూపించారు

ప్లస్ గా అనిపించేవి

బోల్డ్ అండ్ యునీక్ పాయింట్
సంతోష్ శోభన్
సంగీతం
లైట్ కామెడీ

మైనస్ గా తోచేవి

నిడివి
సెకండ్ హాఫ్ ల్యాగ్
మెయిన్ పాయింట్ చుట్టే తిప్పడం
అవసరం లేని సన్నివేశాలు

కంక్లూజన్

గతంలో చెప్పుకున్నట్టు థియేటర్ సినిమాకు ఓటిటి మూవీకి మధ్య విభజన క్రమంగా పెరుగుతోంది. రెండు వేర్వేరు కోణాల్లో చూడాల్సిందే. అనుభూతిలోనూ, చూసేందుకు పడే వ్యయప్రయాసల్లోనూ చాలా వ్యత్యాసం ఉంటోంది కాబట్టి సహజంగానే కంటెంట్ కూడా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. అలా చూసుకుంటే ఏక్ మినీ కథ డీసెంట్ అటెంప్ట్ గానే చెప్పుకోవచ్చు. బయటికి చెప్పుకోలేని ఓ సమస్యను ఇంత సున్నితంగా డీల్ చేసిన విధానానికి ఇది బ్యాడ్ ఛాయస్ అనిపించుకోదు. కొత్త ఆలోచనలు చేస్తున్న యంగ్ ఫిలిం మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే. కానీ ఇంకొంచెం జాగ్రత్తలు వహిస్తే వీటి స్థాయి ఇంకా పెరుగుతుంది

ఒక్కమాటలో – ఏక్ యావరేజ్ కథ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి