iDreamPost

జగమే తంత్రం రివ్యూ

జగమే తంత్రం రివ్యూ

గత ఏడాది సూర్య ఆకాశం నీ హద్దురా, నాని వి తర్వాత ఆ స్థాయిలో వస్తున్న ఓటిటి సినిమాగా ధనుష్ జగమే తంత్రం మీద గట్టి అంచనాలు నెలకొన్నాయి. రకరకాల కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 17 భాషల్లో డబ్బింగ్ చేయడంతో పాటు విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడంతో హైప్ ఎక్కడికో వెళ్ళింది. దానికి తోడు ట్రైలర్ ని కట్ చేసిన విధానం, ధనుష్ మాస్ గెటప్స్ తదితరాలు ఆసక్తిని పెంచాయి. తెలుగులోనూ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన ధనుష్ మూవీ కావడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా దీని కోసం ఎదురు చూశారు. మరి దానికి తగ్గట్టు ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

లండన్ లో శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన తమిళ శరణార్ధుల కోసం గ్యాంగ్ స్టర్ గా మారి వాళ్ళకు అండగా ఉంటాడు శివదాస్(జోసెఫ్ జోజూ జార్జ్). శివదాస్ ఎదుగుదలని ఓర్వలేని ప్రత్యర్థి పీటర్(జేమ్స్ కాస్మో)అతన్ని నిలువరించడం కోసం తమిళనాడులో ఓ చిన్న ఊరిలో దందాలు చేసుకునే సురులి(ధనుష్)ని వారానికి రెండు లక్షల పౌండ్లు ఇచ్చే ఒప్పందం మీద లండన్ తీసుకొస్తాడు. అయితే పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్న సురులి పీటర్ తో చేతులు కలిపి శివదాస్ చావుకు కారణం అవుతాడు. దీంతో అక్కడి తన స్వంత వాళ్ళకే శత్రువుగా మారే ప్రమాదం తలెత్తుంది. ఆ తర్వాత జరిగేది సినిమాలోనే చూడాలి.

నటీనటులు

ఒక జానర్ కో లేదా కమర్షియల్ ఫార్ములాకో కట్టుబడకుండా రకరకాల ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధపడే ధనుష్ ఇందులో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. క్యారెక్టర్ పరంగా కొత్తగా లేకపోయినా పాత్రను తీర్చిదిద్దిన విధానం కాస్త డిఫరెంట్ గా ఉండటంతో ధనుష్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు. ఇండియాలో ఉన్నప్పుడు ఒకలా లండన్ వెళ్ళాక మరోలా తన టైమింగ్ ని మార్చుకుని మెప్పించిన తీరు ఆకట్టుకుంటుంది. హిట్టా ఫట్టా అనేది పక్కనపెడితే మాస్ ని మిస్ కాకుండా ఆ వర్గాన్ని మెప్పించేలా దర్శకుడు ట్యూన్ చేసిన బాడీ లాంగ్వేజ్ ని అంతే పెర్ఫెక్షన్ తో ధనుష్ పండించిన తీరు సినిమాకున్న ఒకే ఒక్క హై లైట్.

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మికి ఆశ్చర్యకరంగా పెర్ఫార్మన్స్ చేసే స్కోప్ దక్కింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఎమోషన్ బాగానే పండింది కానీ వీక్ గా ఉన్న కథాకథనాల వల్ల హైలైట్ అవ్వాల్సిన రేంజ్ లో రిజిస్టర్ కాలేకపోయింది. శివదాస్ గా చేసిన జోసెఫ్ జార్జ్ ఉన్నది ఫస్ట్ హాఫ్ మాత్రమే అయినా తన ఉనికిని చాటుకున్నాడు. మెయిన్ విలన్ పీటర్ గా నటించిన జేమ్స్ కాస్మో తనకిచ్చిన పరిధి మేరకు క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. ఇతర తారాగణంలో కలయరాసన్, వడివుక్కరసి, శరత్ రవి, దీపక్ రమేష్, రామచంద్రన్, సౌందర్, ముత్తుకుమార్, మాస్టర్ అశ్వనాథ్, సంచనా, బాబా భాస్కర్, గజరాజ్ తదితరులు ఓకే అనిపించారు

డైరెక్టర్ అండ్ టీమ్

ఎప్పుడో దశాబ్దాల క్రితం విడుదలై వరల్డ్ సినిమాలో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిన గాడ్ ఫాదర్ తాలూకు ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయినప్పటికీ ఒక పరిధి మించి గ్యాంగ్ స్టర్ కథలను గొప్పగా చెప్పలేని బలహీనత వల్ల ఇప్పటితరం దర్శకులు ఆ సబ్జెక్టునే రకరకాలుగా చెప్పే ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉన్నారు. కమల్ హాసన్ నాయకుడు తర్వాత సౌత్ లో అంత ప్రభావం చూపించిన గ్యాంగ్ స్టర్ డ్రామా వేరొకటి లేకపోయింది. అందుకే వీటికే కామెడీ జోడించడమనే ప్రమాదకరమైన ఫీట్ ని జోడించి తడబడుతున్న వాళ్ళ లిస్టులో కార్తీక్ సుబ్బరాజ్ కూడా చేరిపోయాడు.

నిజానికి జగమే తంత్రం మంచి లైన్. చాలా సున్నితమైన శ్రీలంక శరణార్ధుల సమస్యను తీసుకుని సురులి అనే చిన్న రౌడీకి ముడిపెట్టడం అనే ఆలోచన మెచ్చుకోదగిందే. అయితే క్యారెక్టరైజేషన్ మీద సరిగ్గా వర్క్ అవుట్ చేయకపోవడంతో ప్రారంభ సన్నివేశాల్లోనే సురులికిచ్చిన బిల్డప్ తేలిపోయింది. ఏదో జులాయి పనులు చేసే పోకిరి తరహాలో పాత్రను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులకు అతనితో సీరియస్ గా కనెక్ట్ చేయడంలో అడ్డు పడింది. అసలు ఏముందని సురులిని అంత పెద్ద లండన్ డాన్ పిలిపించాడు అనే దాని మీద సవాలక్ష సందేహాలు తలెత్తుతాయి. దర్శకుడు సుబ్బరాజ్ ఇక్కడి నుంచే స్క్రీన్ ప్లే విషయంలో గాడి తప్పాడు.

పోనీ లండన్ కు వచ్చాకైనా సురులి వేసే ప్లాన్లు ఎత్తుగడలు ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా ఉంటాయా అంటే అదీ లేదు. చాలా సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, లొకేషన్స్ మీద పెట్టిన శ్రద్ధలో సగం కథనం మీద పెట్టి ఉంటే జగమే తంత్రం ఖచ్చితంగా ఇంకో లెవెల్ లో ఉండేది. పేటలోనూ కార్తీక్ సుబ్బరాజ్ ఇలాంటి తప్పులు చేసినప్పటికీ శిఖరమంత రజనీకాంత్ ఇమేజ్ ముందు అవన్నీ కవరైపోయాయి. కానీ ధనుష్ మాస్ దేవుడు కాదు. ఒక వర్సటైల్ యాక్టర్. అతన్ని వాడుకోవడం ఎలాగో వడ చెన్నై, అసురన్ లో ఋజువయ్యింది. దురదృష్టవశాత్తు ఈ జగమే తంత్రంలో ఇది రివర్స్ కొట్టింది.

చెబుతున్న కథలో స్టైల్ ఉంటే సరిపోదు. ఆడియన్స్ కి నచ్చేలా బలమైన ఎమోషన్, బిగి సడలకుండా సినిమాను పరిగెత్తించే సన్నివేశాలు కావాలి. కానీ కార్తీక్ సుబ్బరాజ్ వీటినే మిస్ అయ్యాడు. సురులి-శివదాస్-పీటర్ ఈ ట్రయాంగిల్ వార్ ని రాసుకున్న తీరులో ఉన్న బలహీనతల వల్ల వద్దన్నా చేయి ఫార్వార్డ్ బటన్ వైపు వెళ్ళిపోతుంది. అందులోనూ దాదాపు కథ మొత్తం లండన్ లోనే సాగడం పూర్తిగా నేటివిటీని దెబ్బ కొట్టింది. ఉన్న బాలన్స్ లోనూ తమిళ వాసన ఎక్కువైపోవడంతో తెలుగు ప్రేక్షకులు దీన్ని ఆస్వాదించడం కష్టమే. ధనుష్ ని విపరీతంగాగా అభిమానిస్తే తప్ప చివరి దాకా భరించడం చాలా కష్టం.

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు పర్వాలేదు అనిపించేలా సాగింది. పాటలు చూస్తూ వినడం కూడా కష్టమే. ఏదో రకిట రకిట కాస్త ఎక్కింది కాబట్టి దాన్ని భరించవచ్చు. శ్రేయాస్ కృష్ణ కెమెరా పనితనం మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ని టెక్నికల్ టీమ్ కష్టాన్ని తెరమీద బాగా చూపించాడు. వివేక్ హర్షన్ ఎడిటింగ్ ఎందుకు మొహమాటపడిందో అర్థం కాదు. రెండు గంటల నలభై నిమిషాల నిడివి విసుగుకు కారణం అయ్యింది. నిర్మాణ విలువలు మాత్రం భారీగా ఉన్నాయి. ఏ మాత్రం వెనుకాడకుండా ఖర్చు పెట్టడం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది

కంక్లూజన్

ఇంత కాలం పదే పదే వాయిదా పడుతూ వచ్చిన జగమే తంత్రం ఓటిటిలో రావడం నిజంగా మంచి పనే. దీని ఫలితాన్ని నిర్మాత ముందుగానే ఊహించి నెట్ ఫ్లిక్స్ కు అమ్మేసి సేఫ్ అయ్యాడో ఏమో కానీ మొత్తానికి థియేటర్ కు వెళ్లుంటే మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. గ్యాంగ్ స్టర్ డ్రామా అంటే కేవలం స్టైల్ ఉంటే సరిపోదని స్క్రీన్ ప్లే కూడా చాలా కీలకమని ఒక పాఠంలా నేర్చుకునేందుకు జగమే తంత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే కూర్చుని చూసే ఆప్షన్ తో పాటు ఫార్వార్డ్ బటన్ వెసులుబాటు ఉండటంతో ఫ్రీ టైంని పెట్టుబడిగా పెట్టాలనుకుంటే జగమే తంత్రంని ట్రై చేయొచ్చు.

ఒక్క మాటలో – పనిచేయని యంత్రం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి