iDreamPost

అర్ధ శతాబ్దం రివ్యూ

అర్ధ శతాబ్దం రివ్యూ

ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అర్ధ శతాబ్దం. ఆహా యాప్ లో ఇవాళే విడుదల చేసారు. పేరున్న హీరో హీరోయిన్ లేకపోయినా ప్రమోషన్ లో చూపించిన కంటెంట్ తో పాటు సీనియర్ క్యాస్టింగ్ ని గట్టిగానే సెట్ చేసుకోవడంతో ఈ ఓటిటి మూవీ మీద ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. మరి ట్రైలర్ లో చూపించినంత డెప్త్, మ్యాటర్ అసలు సినిమాలో ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ఇది 2003లో జరిగిన కథగా చూపిస్తారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో ఉండే కృష్ణ(కార్తిక్ రత్నం)కు దుబాయ్ వెళ్లడం లక్ష్యం. చిన్నప్పటి నుంచి చూసి ఇష్టపడిన పుష్ప(కృష్ణప్రియ)కు తన ప్రేమను చెప్పేందుకు నానా యాతన పడుతూ ఉంటాడు. పుష్ప తండ్రి రామన్న(సాయికుమార్)కి ఆ ఊరి సర్పంచ్(మహదేవన్)కి ఉన్న గొడవల నేపథ్యంలో కొందరు చేసిన కుట్ర వల్ల ఊళ్ళో ఒకరినొకరు తెగ నరుక్కుని మారణకాండ సృష్టిస్తారు. దీని వల్ల పుష్ప, కృష్ణల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అసలు ఈ రావణకాష్టం రగిలించింది ఎవరు, చివరికి ఆ ప్రేమజంట ఏమయ్యింది లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి

నటీనటులు

కేరాఫ్ కంచెరపాలెంలో మెప్పించిన కార్తీక్ రత్నంకు మరో మంచి పాత్ర దక్కింది. అయితే నటన పరంగా మరీ ఎక్కువ వెరీయేషన్స్ చూపించే అవకాశం లేకపోవడంతో ఉన్నంతలో మెప్పించాడు. మంచి రూపం ఉన్న రత్నం సరైన సబ్జెక్టులు పడాలే ఇప్పటి జెనరేషన్ హీరోల్లో స్థానం సంపాదించుకోవచ్చు. హీరోయిన్ కృష్ణప్రియ లుక్స్ పరంగా బాగానే ఉంది. హెవీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే సీన్స్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ టాలెంట్ తో మేనేజ్ చేశారు కానీ మరీ వీక్ గా అయితే పెర్ఫామ్ చేయలేదు.

జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మాజీ నక్సలైట్ గా సాయికుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏమీ లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రకు నిండుదనం తెచ్చింది. ఇన్స్ పెక్టర్ గా చేసిన నవీన్ చంద్ర క్యారెక్టరైజేషన్ సరిగా రాసుకోలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అతని యాక్టింగ్, బాడీ ల్యాంగ్వేజ్ లో స్పష్టంగా గమనించవచ్చు. ఇటీవలే కన్నుమూసిన టిఎన్ఆర్ కొన్ని సెకన్లు మాత్రమే కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్, అజయ్, పవిత్ర లోకేష్, సుహాస్, రాజా రవీంద్ర, మహదేవన్ కొన్ని సీన్లకే పరిమితం. వీళ్లంతా ఉండటం వల్లే అదనంగా కాస్త ఓపిక చేరుతుంది.

డైరెక్టర్ అండ్ టీమ్

ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్న కుల వివక్షను పాయింట్ గా తీసుకున్న దర్శకుడు రవీంద్ర పుల్లె ఆలోచన మంచిదే. అయితే ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఎంచుకున్నప్పుడు కేవలం ఎమోషన్ ని నింపితే సరిపోదు. డ్రామాతో కూడిన సన్నివేశాలను పండించాలి. లేకపోతే తేడా కొట్టేస్తుంది. అర్ధ శతాబ్దంలో జరిగింది ఇదే. కులం కోసం కత్తులు దూయడానికి ఓ ప్రేమకథను ముడిపెట్టే కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా దానికి తగ్గ బలమైన కంటెంట్ ఇందులో లేదు. అందుకే రెండు గంటల కన్నా తక్కువగా ఉన్న నిడివిలోనూ విపరీతమైన ల్యాగ్ అనిపిస్తుంది. కారణం అంత లెన్త్ కు తగ్గ మెటీరియల్ లేకపోవడం.

టైటిల్, ట్రైలర్ ని బట్టే ఇదో ఇంటెన్స్ విలేజ్ డ్రామా అని ప్రేక్షకులకు ముందే ఒక అవగాహన ఉంది. అయితే జరిగేది వేరుగా ఉంటుంది. కృష్ణ పుష్పల లవ్ ట్రాక్ కోసమే సుమారు 50 నిమిషాలు వెచ్చించడం ఫస్ట్ హాఫ్ లో ఉన్న ప్రధానమైన మైనస్. పోనీ అంతా చేసి వాళ్లిద్దరూ ప్రేమించుకుంటారా అంటే అదీ జరగదు. ఇక్కడ అనవసరమైన సన్నివేశాలు, అవసరానికి మించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువయ్యాయి. ఇంత సుదీర్ఘమైన ట్రాక్ లోనూ కృష్ణలో నిజాయితీ ఉన్న ప్రేమను మనం ఫీలవ్వలేదంటే అది స్క్రిప్ట్ రూపకల్పనలో లోపమే. ఒకే సీన్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం కూడా దీనికి కారణం.

సెకండ్ హాఫ్ లో కృష్ణ పుష్ప ఇంటికి వెళ్లి బయటికి తీసుకొచ్చి వీధుల్లో తిప్పడం ఎందుకో అర్థం కాదు.ఆమెకేమీ తెలియనప్పుడు కోరి మరీ ప్రమాదంలోకి నెడుతున్నానన్న కామన్ సెన్స్ కృష్ణలో లేకపోవడం కథనంలో లోపమే. పదునైన సంభాషణలు ఉన్నంత మాత్రాన సరిపోదు. సీనియర్ ఆర్టిస్టులు తెచ్చుకున్నంత మాత్రాన జనాలు ఆహా అనరు. వీటిని సపోర్ట్ గా తీసుకుని తన ఉద్దేశాన్ని దర్శకుడు వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పినప్పుడే సినిమా పరమార్థం నెరవేరుతుంది. అర్ధ శతాబ్దంలో అది సగం కూడా జరగలేదు. ఇంటర్వెల్ తో సహా కొన్ని సీన్లు అసలు ఎందుకు జరుగుతాయో ఎందుకు వస్తాయో అర్థం కాదు.

ఒక సమస్యను అందులో ఘాడతను తెరమీద చూపాలంటే క్షేత్ర స్థాయిలో దాని మీద లోతైన అవగాహన, పరిశీలన అవసరం. అంకురం, సిందూరం. ఎర్ర మందారం లాంటి సినిమాలు దానికి ఉదాహరణ. అలా కాకుండా పైపై మెరుగులుతో ఏదోలా మభ్య పెట్టడానికి ఇవి కమర్షియల్ సబ్జెక్టులు కాదు. దర్శకుడు రవీంద్ర పుల్లె చేసిన పొరపాటు ఇదే. పెద్ద పెద్ద ఆర్టిస్టుల కాల్ షీట్లు ఇప్పిస్తానన్న నిర్మాత భరోసా వల్లనో లేక ఈ కథను ఇంతకన్నా బాగా ఎవరూ తీయలేరన్న ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ ఓ మంచి అవకాశం, ఆలోచన వృధా అయిన మాట వాస్తవం. ఆత్మ లేని నాటకీయత ఎవరు తీసినా పండదు. ఇందులో జరిగింది అదే

నవఫాల్ రాజా సంగీతం బాగానే ఉంది. తన వరకు ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు కానీ వీక్ కంటెంట్, పదే పదే ఇబ్బంది పెట్టె పాటలు అతని పనితనాన్ని ఎక్కువ కనపడనివ్వకుండా అడ్డుపడ్డాయి. అస్కర్-వెంకట్-వేణు ముగ్గురు కలిసి చేసిన ఛాయాగ్రహణంలో మంచి నైపుణ్యం ఉంది. సింగిల్ విలేజ్ లొకేషన్ లో వీలైనంత క్వాలిటీని ఇవ్వడానికి కష్టపడ్డారు. వీళ్ళ శ్రమను మెచ్చుకోవచ్చు. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ నిడివిని రెండు గంటల లోపే కట్ చేసినా సాగతీత తప్పలేదు. సుమిత్ ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాతలు క్యాస్టింగ్ మీద ఖర్చు పెట్టారు కానీ దానికి తగ్గ ఫలితం దక్కలేదు

కంక్లూజన్

సామాజిక సమస్యను తీసుకుని దానికి లవ్ స్టోరీ అనే కమర్షియల్ ఫ్లేవర్ జోడించి చేసిన ప్రయత్నం అర్ధ శతాబ్దం. ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతను కథగా తీసుకోవడం వరకు బాగానే ఉంది కానీ ట్రీట్మెంట్ విషయంలో దర్శకుడు పడిన తడబాటు వల్ల ఇది అర్ధ ప్రయత్నం కూడా కాలేకపోయింది. కేవలం నటీనటుల అండతో వీక్ కంటెంట్ నిలిచే రోజులు కావివి. ఓటిటి కాబట్టి దీన్ని ఓ మోస్తరుగా చూసేసి వదిలేయొచ్చు కానీ ఒకవేళ థియేటర్ అయ్యుంటే మాత్రం ఫలితం ఇంకోలా ఉండేది. డ్రెస్సుని బట్టి మనిషిని ట్రైలర్ ని బట్టి సినిమాను అంచనా వేయకూడదని మరోసారి చెప్పిన సినిమా ఇది

ఒక్కమాటలో – శబ్దం లేని శతాబ్దం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి