iDreamPost

విద్య వ్యాపారమే – ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం మీద అందుకే ఈ గోల

విద్య వ్యాపారమే –  ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం మీద అందుకే ఈ గోల

ఇదీ రాష్ట్రంలో జరుగుతున్న విద్యావ్యాపారం. వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, గంటలకొద్దీ తరగతి గదుల్లో విద్యార్థులను బందీలను చేసి ర్యాంకుల పోరాటంలో దూసుకెళ్తున్న ప్రైవేట్ విద్యావ్యాపార సంస్థల పనితీరు ఇది.

ఆట స్థలాలు ఉండవు. ఆటలు ఉండవు. సాంస్కృతిక కార్యక్రమాలు లేవు. వినోదం లేదు. అంతా బట్టీ పట్టడమే. ప్రశ్నలు బట్టియే. జవాబులు బట్టియే. మార్కులకోసం, ర్యాంకుల కోసం నిత్యం పరుగులు. రోజుకు ఉండే 24 గంటల్లో దాదాపు 18 గంటలు పుస్తకాలతో కుస్తీయే.

అపార్టుమెంటు గదుల్లోనే పడకలు. అలాంటి గదుల్లోనే తరగతులు. ఒక్క బాత్రూమ్, ఆరుగురు విద్యార్థులు. పొద్దుటే 4 గంటలకే నిద్రలేవాలి. ఆరుగంటలకల్లా కాలకృత్యాలు తీర్చుకొని “స్టడీ అవర్” పేరుతో బట్టీపట్టే కార్యక్రమానికి హాజరు కావాలి. ఆలశ్యం అయితే బెత్తం దెబ్బలు తప్పవు.

నిద్రపోతారని టిఫిన్ కానీ, అన్నం కానీ ఎక్కువ తిననివ్వరు. బాత్రూమ్ కు వెళతారని మంచినీళ్ళు తాగనివ్వరు. ఆడపిల్లలు అయితే ఆలశ్యం చేస్తారని తలస్నానం చేయనివ్వరు. పడకగది, తరగతిగది ఓకే భవనం కావటంతో ఆడపిల్లలు మాములు బట్టలేసుకుంటే ఆలశ్యం అవుతుందని నైట్ డ్రెస్సుల్లోనే ఉంచేస్తారు.

పుస్తకాల దుకాణం వారిదే. మంచాలు, పరుపులు, దిండ్లు, దుప్పట్ల దుకాణం కూడా వారిదే. చదువుకోడానికి కుర్చీలు, వాడుకోడానికి బక్కెట్లు కూడా వారే అమ్ముతారు. బయట మార్కెట్లో కంటే ఎక్కువ ధర చెల్లించాల్సిందే. ఇక క్యాంటీన్ ఎలాగూ లోపలే ఉంటుంది. నాణ్యత గురించి కానీ, రేట్లగురించి కానీ విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ ప్రశ్నించకూడదు.

లోపల పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడుకోడానికి ఏర్పాటు చేసే టెలిఫోన్ నిమిషానికి రెండు నుండి మూడు రూపాయలవరకూ ఉంటుంది. అన్నీ యాజమాన్యం ఆధీనంలోనే ఉంటాయి.

ఫోన్ నుండి పుస్తకాల వరకూ, మంచం నుండి కంచం వరకూ అన్నీ వారి వ్యాపారమే. మార్కులు, ర్యాంకులు కూడా వ్యాపారమే.

అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అంటుంటే గగ్గోలు పెడుతున్నారు. చదువొక్కటే కాదు ఒక్క దెబ్బకు ఇన్ని వ్యాపారాలు పోతాయని భయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి