iDreamPost

ఈడీ , సీఐడీ సంయుక్త సమావేశం.. టీడీపీ నేతల్లో ఒణుకు..

ఈడీ , సీఐడీ సంయుక్త సమావేశం..   టీడీపీ నేతల్లో ఒణుకు..

రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓ వైపు సీఐడీ, మరో వైపు ఈడీ, తాజాగా సిట్‌.. ఇలా ముప్పేట దాడి జరుగుతుండడంతో టీడీపీ నేతల్లో ఒణుకు మొదైలంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో వారుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపే వ్యవహారంలో మొదట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ఆ తర్వాత తెల్లమొహం వేశారు. ఏం.. రేషన్‌కార్డుదారులు భూములు కొనకూడదా అనే డైలాగులు కొట్టడంతో టీడీపీ కేడర్‌కు, రాష్ట్ర ప్రజలకు అసలు విషయం బోధపడింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు చంద్రబాబే పరోక్షంగా ఒప్పుకోవడంతో ఇక టీడీపీ నేతలు ఈ విషయం సవాళ్లు విసరడం లేదు.

మొత్తం 4070 ఎకరాలు రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు కొనుగోలు చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధ్యక్షతన గల మంత్రివర్గ ఉస సంఘం ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 797 మంది రేషన్‌కార్డుదారులు 761.34 ఎకరాల భూమినికొనుగోలు చేయడమే పెద్ద విశేషం. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. భూములు కొన్న పలువురు తెల్లరేషన్‌కార్డుదారులను విచారించింది. పూర్తి వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అందజేసింది. కోట్ల రూపాయలు వెచ్చించి తెల్లరేషన్‌కార్డుదారులు ఎలా భూములు కొనుగోలు చేశారు..? వీరు ఎవరికైనా బినామీలా..?అనే అంశాలపై సీఐడీ, ఈడీ దృష్టి సారించాయి.

సిట్‌ దర్యాప్తు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సీఐడీ, ఈడీ సంయుక్తంగా ఇన్‌సైడర్‌ ట్రేండింగ్‌పై దర్యాప్తు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌ వ్యవహారం చేటుచేసుకున్న నేపథ్యంలో ఈడీ నేరుగా రంగంలోకి దిగనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేసింది. ఈ నెలాఖరులోగా సీఐడీ, ఈడీ అధికారులు ఉమ్మడిగా సమావేశం కానున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై పూర్తి స్థాయిలో చర్చించి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యాచరణ సిద్ధం చేసుకోనున్నారు. ఆ తర్వాత ఈడీ అధికారులు నేరుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. ఈడీ రంగంలోకి దిగితే.. అమరావతి భూ కుంభకోణం వ్యవహారం సరికొత్త మలుపు తిరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి