iDreamPost

Dubbing Movies : అరవ సినిమాల క్రేజు మోజు తగ్గిపోయింది

Dubbing Movies : అరవ సినిమాల క్రేజు మోజు తగ్గిపోయింది

ఇక్కడ అజిత్ వలిమైని ఎవరూ పట్టించుకోలేదు కానీ తమిళనాడులో మాత్రం సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఏకంగా వంద కోట్ల క్లబ్బుకి దగ్గరగా వెళ్తూ స్ట్రాంగ్ కలెక్షన్లతో థియేటర్లను నింపుతోంది. అలా అని అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ అజిత్ ఇమేజ్, యావరేజ్ గా ఉన్నప్పటికీ స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన కంటెంట్ జనాన్ని హాళ్ల దాకా తీసుకొస్తోంది. కానీ తెలుగులో మాత్రం దారుణ పరాభవం తప్పలేదు. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మన ప్రేక్షకులు వలిమైని అంతగా పట్టించుకోలేదు. అజిత్ కు ఎప్పుడో తగ్గిపోయిన మార్కెట్ ఇక్కడ ప్రభావం చూపించగా సినిమాలో విషయం కూడా అంతంతే ఉండటంతో ఇలా తేడా కొట్టేసింది.

ఇదే కాదు ఆ మధ్య వచ్చిన విశాల్ సామాన్యుడు కూడా అంతే. రెండో వారంలోపే దుకాణం సర్దాల్సి వచ్చింది. ఒకప్పుడు పందెం కోడి పొగరు టైంలో పోటీ పడి మరీ డిస్ట్రిబ్యూటర్లు హక్కులు కొనే కాలం నుంచి స్వంతంగా రిలీజ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదనే దాకా వచ్చేసింది. ఈ ఇద్దరే కాదు గత కొంత కాలంగా చూసుకుంటే తమిళ డబ్బింగులు మన దగ్గర తీవ్రంగా తిరస్కరించబడుతున్నాయి. రజినీకాంత్ అన్నాతే ఏమయ్యిందో చూశాంగా. కనీసం అద్దెలు కూడా కిట్టుబాటు కాలేదు. పోనీ టీవీలో అయినా చూశారా అంటే వచ్చిన టిఆర్పి రేటింగ్ సోసోనే. దీన్ని బట్టి అరవ కంటెంట్ మీద క్రమంగా ఆసక్తి సన్నగిల్లుతున్న విషయం అర్థమవుతుంది.

ఒకప్పుడు కమల్ హాసన్, విక్రమ్, కార్తీ ఇలా అందరికీ ఇక్కడ డీసెంట్ మార్కెట్ ఉండేది. రజనికి భయపడి మనవాళ్ళు విడుదల వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గజిని, అపరిచితుడు, రోబో లాంటివి వంద రోజులు జరుపుకున్న దాఖలాలు ఎన్నో. కానీ ఇదంతా గతమైపోయింది. తమిళ నిర్మాతలకూ ఇంటరెస్ట్ తగ్గిపోయింది. కనీసం టైటిల్ ని తెలుగులో పెట్టాలన్న కనీస విజ్ఞత మరిచి అవే పేర్లను పెట్టడం అలవాటుగా చేసుకుంటున్నారు. వలిమై, తలైవి, ఈటి, మహాన్, మారన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. సరే ఈ రకంగా అయినా మనకు డబ్బింగ్ జాడ్యం వదిలి స్ట్రెయిట్ కంటెంట్ ఇష్టపడటం మంచిదే

Also Read : Ghani : జాగ్రత్తగా సెట్ చేసుకున్న వరుణ్ తేజ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి