iDreamPost

Pushpa : పాన్ ఇండియా సినిమాకు డబ్బింగ్ చిక్కు

Pushpa : పాన్ ఇండియా సినిమాకు డబ్బింగ్ చిక్కు

పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 17 విడుదల ప్లాన్ చేసుకున్న పుష్ప హిందీ వెర్షన్ కు సంబంధించిన వార్తలు అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. హక్కులు కొన్న నిర్మాత అక్కడ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధంగా లేడని దానికి బదులు తెలుగు తదితర వెర్షన్లు ఆడేశాక నేరుగా యుట్యూబ్ లో డబ్బింగ్ సినిమా పెట్టుకుంటానని ప్రతిపాదన చేసినట్టు వచ్చిన న్యూస్ కలకలం రేపింది. అదేంటి బాలీవుడ్ మార్కెట్ ను కూడా ప్లాన్ చేసుకున్న బన్నీ ఇదంతా చూసుకోలేదా అనే కోణంలో కామెంట్లు వినిపించాయి. ఇది కాస్తా న్యూస్ ఛానల్స్ లో వెబ్ సైట్లలో వైరల్ అయిపోయేసరికి ఏం జరిగిందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అదేంటో చూద్దాం.

ఫిలిం నగర్ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్స్ ప్రకారం సారాంశం ఇలా ఉంది. అల వైకుంఠపురములో విడుదలకు ముందే పుష్ప హిందీ డబ్బింగ్ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్మేశారు. అప్పటికింకా షూటింగ్ మొదలుకాలేదు. ఆ టైంలో పాన్ ఇండియా ప్లాన్ లేదు కాబట్టి అలా జరిగిపోయింది. ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక మెల్లగా పెరుగుతున్న హైప్ చూసి పలువురు బాలీవుడ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ కోసం సంప్రదించారు. తీరా చూస్తే హక్కులు ఆల్రెడీ అమ్ముడుపోయాయి. ఇక్కడ మెలిక ఏంటంటే ముందు కొన్న నిర్మాతను కాదని పుష్ప టీమ్ హిందీలో రిలీజ్ చేయలేరు. కానీ ఆయనేమో థియేటర్లో విడుదల చేయలేను అని చెబుతున్నాడట.

నార్త్ ఆడియన్స్ తెలుగు సినిమాలను యూట్యూబ్ లో ఫ్రీగా డబ్బింగ్ లో చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తారు తప్ప అదే పనిగా వాటి కోసం థియేటర్లకు రారని ఆయన అభిప్రాయమట. ఒక్క బాహుబలి తప్ప ఇంకే ఇతర సినిమా హాళ్లలో ఆడలేదని ఆధారాలతో సహా చెబుతున్నట్టు వినికిడి. సో ఇప్పుడు పుష్ప హిందీని థియేటర్లలో తీసుకురావాలి అంటే ఏదో రకంగా అతన్ని ఒప్పించడం తప్ప వేరే మార్గం లేదట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారమంతా మైత్రి ద్వారా రాలేదు కానీ అనధికారంగా బయట జరుగుతున్న ప్రచారమే.ఏదో రకంగా ఇదంతా కొలిక్కి వస్తుంది కానీ ఇప్పటికైతే హాట్ టాపిక్ గా నిలిచిన మాట వాస్తవం

Also Read : Marakkar : మరక్కార్ వస్తే డిజిటల్ రికార్డులు గల్లంతే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి