iDreamPost

డీఎస్సీ- 2008 అభ్యర్థులకు తీపి కబురు

డీఎస్సీ- 2008 అభ్యర్థులకు తీపి కబురు

 డీఎస్సీ- 2008 అభ్యర్థుల 12 ఏళ్ల పోరాటం, ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. జగన్ సర్కార్ వారికి ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాచ్‌లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించి ఉద్యోగాలు రాని వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీగ్రేడ్‌ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారు రాష్ట్రంలో మొత్తం 4657 మంది అభ్యర్థులు ఉన్నారు.

డీఎస్సీ-2008లో సెండరీగ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు మొదట డీఈడీ అభ్యర్థులకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో మెరిట్‌ సాధించిన పలువురు డీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఉద్యోగాలకు వారు చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు అది ఫలించింది.

వీరందరినీ కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మినిమమ్‌ పేస్కేల్‌ రూ. 21,230 నిర్ణయిస్తూ పాఠశాల విద్య కమిషనర్‌ వి. చినవీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌సీఈటీ నిబంధనల ప్రకారం రెండేళ్లలో ప్రాథమిక విద్యపై గుర్తింపు పొందిన సంస్థలో వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. వీరి ఉద్యోగ విరమణ చేసేంత వరకు మినిమమ్‌ పేస్కేల్‌పైనే పనిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా చేరేందుకు అసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 18లోపు తమ అంగీకారాన్ని తెలియజేస్తూ డీఈవోలకు రాతపూర్వకంగా తెలియజేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి