iDreamPost

ఖాళీలు రెండు, కానీ ఒకటే భర్తీ చేసే యోచనలో జగన్?

ఖాళీలు రెండు, కానీ ఒకటే భర్తీ చేసే యోచనలో జగన్?

ఏపీలో శాసనమండలి వ్యవహారాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఇటీవల జగన్ ప్రభుత్వ నిర్ణయంతో మండలి చుట్టూ మరింత చర్చ సాగుతోంది. తాజాగా ఖాళీల భర్తీ విషయంలో పెద్ద స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయినా అధినేత మనసులో ఏముందనే విషయం అంతుబట్టక సతమతం అవుతున్నారు.

ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో నాలుగు ఖాళీలున్నాయి. వాటిలో ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా కారణంగా ఏర్పడిన ఖాళీలు రెండు కాగా, మరో రెండు గవర్నర్ కోటాలో నామినేట్ చేయబడిన ఇద్దరు ఎమ్మెల్సీలు రిటైర్ కావడంతో ఏర్పడినవి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో మండలి సీటు కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో మర్రి రాజశేఖర్, పండుల రవీంద్రబాబుకి మొన్నటి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఖరారు చేశారనే కథనాలు మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే అధికారికంగా ఎటువంటి నిర్ధిష్టమైన నిర్ణయం లేకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

తాజాగా వైఎస్సార్సీపీ వర్గాల అంచనా ప్రకారం ఎమ్మెల్యే కోటాలోని రెండు సీట్ల విషయంలో జగన్ కేవలం ఒక్క సీటు మాత్రమే భర్తీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. రెండు ఖాళీలకు గానూ ఒక దానికి కేవలం 9 నెలల కాలపరిమితి మాత్రమే ఉంది. మరో సీటుకి 2 ఏళ్ల వ్యవధి ఉంది. దాంతో రెండేళ్ల కాలపరిమితితో ఉన్న సీటు భర్తీ చేసి తొమ్మిది నెలల ఖాళీ కోసం మళ్లీ ఎన్నికలు అవసరమా అని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మరికొందరు మాత్రం రెండు సీట్లను భర్తీ చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే ఒకరికి స్వల్పకాలిక అవకాశం మాత్రం ఉంటుంది. దాంతో ఆ ఒక్కరూ ఎవరన్నది ఆసక్తికరమే.

ఇక మరో రెండు ఖాళీలు గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. వాటికి ఆరేళ్ల పదవీకాలం ఉంటుంది. దాంతో వాటిలో అవకాశం కోసమే ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టికెట్ కేటాయించే అవకాశం లేని సమయంలో మండలి హామీ పొందిన నేతలంతా ఇప్పుడు క్యూలో ఉన్నారు. వారిలో సామాజిక సమీకరణాల రీత్యా ఎవరికి ఛాన్స్ ఉంటుందనేది చర్చనీయాంశం. తాజా అంచనా ప్రకారం ఎస్సీ, మైనార్టీ కోటాలో మండలి సీట్లు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీలలో మొన్న మాదిగ వర్గానికి చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కి అవకాశం రావడంతో ఈసారి మాలలకే సీటు అన్నది దాదాపు ఖాయం. ఇక ఇతర సామాజికవర్గాలను ఎలా సంతృప్తి పరుస్తారన్నది చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి