iDreamPost

‘మత్తు’కు మించి… వివాదాలు

‘మత్తు’కు మించి… వివాదాలు

మత్తుకు బానిసగా మారడం అంటే సాధారణంగా మద్యమే అని అనుకోవడం సహజం. కానీ అంతకు మించి మత్తుకోసం కొందరు ప్రయత్నిస్తున్నట్టుగా తేలుతోంది. ఇందు కోసం గంజాయితో పాటు, అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్‌ను కూడా వినియోగిస్తున్నారని పోలీసువర్గాలు తేల్చేస్తున్నాయి. ఎంతగా కట్టడి చేస్తున్నప్పటికి ఏదో రూపంలో ఇవి దేశంలోకి చొరబడుతున్నాయి. ‘నయా’ సంపాదనా పరులను మత్తులో ముంచెత్తుతున్నాయి. ఈ మత్తుకు లొంగి ఎవడి ఇంట్లో వాడు పడి ఉంటే ఎవ్వరికీ ఇప్పటి వరకు అభ్యంతరాలు ఉండకపోయేవి. విధి నిర్వహణలో భాగంగా పోలీసు, ఎక్సైజ్, నార్కోటిక్స్‌ విభాగాలు మాత్రమే మత్తు మందులను వేటాడి పట్టుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తుండేవి. అయితే ఇలా మత్తు బానిసలు తమ ఇళ్ళను దాటి సమాజం మీద పడుతున్న నేపథ్యంలో అందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి దాపురించిందనే చెప్పాలి.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పేరొందిన పట్టణాల్లో చీకటి పడ్డాక జరిగే అనేకానేక వివాదాలకు కారణం ఇటువంటి మత్తు మందులేనంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు చెబుతున్న మాటలను బట్టి ఈ విషయం నమ్మాల్సిందే. మద్యం మత్తు కంటే అనేక రెట్లు ప్రమాదకరమైన గంజాయి, ఇతర డ్రగ్స్‌ కారణంగా ఏర్పడే మత్తు మనిషిని నేరం వైపునకు బలంగానే లాగుతుందని పలువురు మానసిక వైద్య నిపుణులు చెబుతుండడాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఏ మత్తు పదార్ధమైన మనిషిని అన్ని విధాలా దిగజారుస్తుంది. గంజాయి, డ్రగ్స్‌ వంటివి శారీరకంగాను, మానసికంగాను, సమాజ పరంగాను, కుటుంబంలోనూ మరింతగా దిగజారుస్తాయని ఒక్కసారి వీటి భారిన పడి, మళ్ళీ బైటకొచ్చిన వాళ్ళు చెబుతుంటారు. అయినప్పటికీ కొత్తగా వీటిని రుచిచూసేందుకు ప్రయత్నించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించకమానదు.

పెరిగిపోతున్న డిమాండ్‌కు అనుగుణంగా వీటిని అందించేందుకు సంబంధిత చీకటి వ్యాపారులు ఎంతకైనా తెగిస్తున్నారంటే వీటి ద్వారా వారి సంపాదన ఎంతుంటుందో అంచనా వేయొచ్చు. కళాశాల విద్యార్ధులు, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, అయిదంకెల జీతం వచ్చిపడే నయా సంపాదనా పరులే వీటి వినియోగానికి మేజర్‌ కష్టమర్లుగా ఉన్నట్టు ఇప్పటికే పట్టుబడ్డ డ్రగ్స్‌ వ్యాపారులు వివరిస్తున్నారు. వీరు కాకుండా సంఘంలో ఉంటూనే చట్టవ్యతిరేకంగా వ్యవహరించే వారుకూడా వీటిని వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

డ్రగ్స్‌ మత్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సమాజంలో అలజడులు పెరిగేందుకు కారణమవుతున్నవారి సంఖ్య కూడా పోలీసు రికార్డుల్లో రోజురోజుకూ పెరుగుతున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనది కాదులే అనుకున్న సమస్య ఇప్పుడు సమాజానికి చుట్టుకుంటోందన్న అభిప్రాయాన్ని పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల పరంగా ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పిల్లలు వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండడం ద్వారానే అభంశుభం తెలియని వాళ్ళు ఈ ఊబిలోకి పడిపోయే ప్రమాదం తప్పుతుందంటున్నారు. అలాగే సహోద్యోగులు, స్నేహితులను నమ్మి ఇటువంటి తప్పుడు అలవాట్లను చేసుకుంటే భవిష్యత్తులో ఎదురవ్వబోయే ఇబ్బందుకులకు సిద్ధం కావాల్సి ఉంటుందంటున్నారు. ఇటువంటి మత్తు ఊబిలో పడకుండా మనల్ని మనం రక్షించుకుంటూనే కుటుంబ సభ్యులు, స్నేహితుల్ని, సహోద్యోగుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ఎవరికి వారు వ్యక్తిగతంగా వహిస్తే తప్ప ఈ మహ్మారుల ప్రభావాన్ని ఎదుర్కొవడం సాధ్యం కాకపోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి