iDreamPost

జగన్‌ చూశాడు.. విన్నాడు.. చేశాడు..! ఇక అంతా కృష్ణమ్మ దయ..!!

జగన్‌ చూశాడు.. విన్నాడు.. చేశాడు..! ఇక అంతా కృష్ణమ్మ దయ..!!

నీరు… కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇది ఓ సాధారణ విషయం. కానీ ఆ ప్రాంత ప్రజలకు ఒక అపురూపం. నీళ్లను చూస్తే వారి మనసు ఉప్పొగుతుంది. ఎందుకంటే అక్కడ సాగునీరే కాదు కనీసం సురక్షితమైన తాగునీటికీ కరువే. ఈ ప్రాంతం ఎక్కడో ఏడారి ప్రాంతంలో లేదు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో కరువుకు మారుపేరైన ప్రకాశం జిల్లాలోనే ఉంది.

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల ప్రజలకు ఇప్పటికీ సాగు నీరే కాదు కనీసం సురక్షిత తాగు నీరులేదంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. కరువుకు ఈ ప్రాంతం బ్రాండ్‌ అంబాసిడర్‌ అనొచ్చు. సాగు నీరు లేకపోయినా కనీసం తాగునీరు లేక కిడ్నీ, ప్లోరైడ్‌ సంబంధిత వ్యాధులకు ఆ ప్రాంత ప్రజలు ఏళ్ల తరబడి బలవుతున్నారు.

ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, ఒరిస్సా, బళ్లారి ప్రాంతాలకు వలసపోతున్నారు. భూములున్నా వాటిని తడిపే నీటి చుక్క లేక ఈ వలసలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ ప్రకాశం వరప్రదాయని అయిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయంలో పట్టాలెక్కి పరుగులపెట్టిన ఈ ప్రాజెక్టు ఆయన అకాల మరణంతోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ హాయంలోనైనా పూర్తవుతుందన్న ఆశతో ఈ ప్రాంత ప్రజలున్నారు.

ఈ ప్రాంత ప్రజల ఆశలు నెరవేరేలా సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో కనిగిరి, మార్కాపురం ప్రాంత ప్రజల కష్టాలను వైఎస్‌ జగన్‌ స్వయంగా చూశారు. వారి బాధలు విన్నారు. కనిగిరి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో కిడ్నీ బాధితుల దైన్యాన్ని వైఎస్‌ జగన్‌ తన మాటలతో కళ్లకు కట్టారు. ఫ్లోరైడ్‌ నీటి వల్ల కాళ్లు వంకరలు పోయి జీవితం దుర్భరమైన వారి జీవన చిత్రాన్ని ఆవిష్కరించారు.

అందుకే అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఈ ప్రాంత ప్రజల ప్రధాన సమస్య అయిన సురక్షిత తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపించారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లోని గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే బృహత్తర ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారు. 833 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ద్వారా ప్లోరైడ్‌ రక్కసికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టారు. ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వెలుగొండ ప్రాజెక్టులోని గొట్టిపడియ గ్యాప్‌ నుంచి కనిగిరికి నీరు సరఫరా చేయనున్నారు. గొట్టిపడియ గ్యాప్‌ వద్ద ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఫిల్టర్, ఇన్‌టేక్‌ వెల్‌ ట్యాంకులు, జీఎల్‌బీఆర్‌ పంపు, సంపులు ఏర్పాటు చేస్తారు. గొట్టిపడియ నుంచి మార్కాపురం జాతీయ రహదారి 656 వెంట పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తారు. దొనకొండ క్రాస్‌ రోడ్డు ఆనుకుని చినారికట్ట, పెదారికట్ట మీదుగా కనిగిరి నియోజకవర్గం కనిగిరి మండలం నందనమారెళ్ల వరకు మీటర్‌ వెడల్పుతో పైప్‌లైన్‌ వేస్తారు. నందనమారెళ్ల కొండపై బ్రేక్‌ ప్రజర్‌ ట్యాంక్‌ (బీపీటీ) నిర్మిస్తారు. అక్కడ నుంచి కనిగిరి నియోజకవర్గానికి సురక్షిత నీరు సరఫరా చేస్తారు.

ఈ పథకం ద్వారా కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, చంద్రశేఖరపురం(సీఎస్‌ పురం), పామూరు, పెదచెర్లోపల్లి (పీసీ పల్లి) మండలాల్లోని 444 గ్రామాలకు, మార్కాపురం నియోజకవర్గంలోని కొనకలమిట్ల మండలంలోని 66 గ్రామాలు, పొదిలి మండలంలోని ఐదు గ్రామాలకు వెరసి 515 గ్రామాలకు పూర్తి స్థాయిలో సురక్షిత తాగునీరు అందనుంది.

అయితే ఈ పథకం ఫలాలు ప్రజలకు అందాలంటే ముందు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. వెలిగొండ రెండో సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినా కృష్ణమ్మ దయ చూపందే నీరు ఈ ప్రాజెక్టుకు రాదు. కృష్ణా నది మిగులు జలాల ద్వారా ఈ ప్రాజెక్టును నింపేలా దివంగత సీఎం వైఎస్సార్‌ రూపకల్పన చేశారు. 45 టీఎంసీల సామర్థ్యం కలిగిన వెలుగొండకు శ్రీశైలం నుంచి రెండు సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలిస్తారు. ఈ సీజన్‌లో వచ్చినట్లే ఎప్పుడూ కృష్ణమ్మకు వరదలొస్తే వెలుగొండకు జలకళ వస్తుంది.

ఒక వేళ కృష్ణాలో మిగులు జలాలు లేకపోతే పోలవరం పూర్తియితే తప్పా మరో మార్గం లేదు. పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఇచ్చి, శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు సరఫరా చేయాల్సిన నీటిని వెలిగొండతోపాటు రాయలసీమలోని ఇతర ప్రాజెక్టులకు మళ్లీస్తారు. ఇదే లక్ష్యంతో 2005లో బృహత్తర పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్టాలెక్కించారు. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పదవీ కాలం ప్రారంభంలోనే ఉన్న నేపథ్యంలో రాబోవు నాలుగేళ్లలోనైనా వెలుగొండకు నీళ్లు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తాయా..? లేదా..? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి