iDreamPost

దొంగలున్నారు జాగ్రత్త రిపోర్ట్

దొంగలున్నారు జాగ్రత్త రిపోర్ట్

ఈ శుక్రవారం స్టార్లు లేకపోయినా చిన్న హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు కృష్ణ వృంద విహారి, అల్లూరితో పాటు దొంగలున్నారు జాగ్రత్త నిన్న రేస్ లో ఉంది. మత్తు వదలరాతో హిట్టు కొట్టి ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయిన సింహ కోడూరి ఇందులో హీరో. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం వహించిన ఈ మూవీ టాలీవుడ్ ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రత్యేక పబ్లిసిటీ ఇచ్చారు. కనీస ఓపెనింగ్స్ కరువైన ఇలాంటి చిత్రాలకు పబ్లిక్ టాక్ చాలా కీలకం. అందులోనూ క్యాస్టింగ్ పరంగా ఎలాంటి ఆకర్షణలు లేకపోవడంతో కేవలం కంటెంట్ మీదే ఆధారపడ్డారు. మరి ఈ దొంగలు దోచుకున్నారో లేదో రిపోర్ట్ లో చూద్దాం

ఎవరూ చూడని ప్రదేశాల్లో పార్కు చేసి ఉంచిన కార్లలో దొంగతనాలు చేసి సొమ్ము చేసుకోవడం రాజు(సింహ కోడూరి)వృత్తి. ఓసారి ఇలాగే ఓ డాక్టర్ కారులో చోరీ చేయబోతూ అందులో ఇరుక్కుంటాడు. ఎంత ప్రయత్నించినా దాన్నుంచి బయటికి రాలేక సతమతమవుతాడు. కాసేపయ్యాక ఇదంతా దాని ఓనర్ చక్రవర్తి(సముతిరఖని)వేసిన ట్రాప్ అని అర్థమవుతుంది. ఇంతకీ కావాలని ప్లాన్ చేసి రాజుని ఎందుకు ఉచ్చులో బిగించారనేది తెరమీదే చూడాలి. సింహ కోడూరి తనవరకు పెర్ఫార్మన్స్ పరంగా డీసెంట్ గా అనిపించాడు. కుర్రాడికి సరైన కథలు పడితే మంచి హీరో అయ్యే ఛాన్స్ ఉంది. సముతిరఖని తన అనుభవంతో ఎప్పటిలాగే అల్లుకుపోయి క్యాస్టింగ్ పరంగా ప్లస్ అయ్యారు.

ఇది ఫోర్ ఇంటూ ఫోర్ అనే స్పానిష్ థ్రిల్లర్ రీమేక్. దర్శకుడు సతీష్ త్రిపుర దీన్ని తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీస్ కు తగ్గట్టు మార్చడంలో తడబడ్డాడు. దీంతో కేవలం గంటా ముప్పై ఆరు నిమిషాలు మాత్రమే ఉన్న నిడివి కూడా ఓపికకు పరీక్ష పెడుతుంది. చాలా సింపుల్ లాజిక్స్ ని గాలికి వదిలేయడంతో అంతో ఇంతో కలగలసిన థ్రిల్ కూడా కిల్ అయ్యింది. క్లైమాక్స్ ఏదో పర్వాలేదనిపించినా మిగిలిన సన్నివేశాలు, స్క్రీన్ ప్లే రైటింగ్ తేడా కొట్టడంతో ఎక్కడా ఆసక్తి కలగకుండా జాగ్రత్త పడ్డారు. కాలభైరవ నేపధ్య సంగీతం మూడ్ ని క్యారీ చేసేందుకు కష్టపడింది కానీ అదంతా వృథానే. ఏదో మొక్కుబడిగా థియేటర్లలో రిలీజ్ చేయడం తప్పించి ఇలాంటి ఓటిటి కంటెంట్ బిగ్ స్క్రీన్ మీద చూడలేం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి