iDreamPost

కొత్త సినిమాల లెంత్ కబుర్లు

కొత్త సినిమాల లెంత్ కబుర్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో స్టార్లెవరూ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా టాక్ బాగుందని వస్తే చాలు ఈజీగా పికప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన లెన్త్ కబుర్లు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. మొదటిది అల్లూరి. శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఈ కాప్ డ్రామా నిడివి 2 గంటల 50 నిముషాలు. ఒక చిన్న హీరోకి ఇంత డ్యూరేషన్ ఉండటం ఈ మధ్యకాలంలో ఎవరికీ జరగలేదు. అలా అని జనం చూడరని కాదు కానీ విజువల్ గ్రాండియర్ నెస్ లేకుండా కేవలం యాక్షన్ ప్లాట్ కి ఇంతెందుకనేది ఆసక్తికరంగా మారింది.

దీనికి అచ్చం రివర్స్ లో శ్రీసింహ దొంగలున్నారు జాగ్రత్త కేవలం 1 గంటల 40 నిమిషాల లోపే పూర్తవుతుందట. అంటే అల్లూరి ఒక షో అయ్యేలోపు ఇది రెండు ఆటలు కొట్టేస్తుందన్న మాట. సింపుల్ అండ్ రేసీగా స్క్రీన్ ప్లేని పరిగెత్తించడం వల్లే తక్కువ లాక్ చేశామని మేకర్స్ అంటున్నారు. శాకినీ డాకిని తర్వాత కేవలం వారం గడువులోనే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తమ నిర్మాణ భాగస్వామ్యంలో రిలీజ్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక నాగ శౌర్య కృష్ణ వృందా విహారి మాత్రం రెగ్యులర్ టైం ఫ్రేమ్ లో 2 గంటల 16 నిమిషాలకు మధ్యస్థంగా ఫిక్స్ చేశారు. సో మూడు దేనికేవే సంబంధం లేని జానర్లతో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఎలా మెప్పిస్తాయో చూడాలి.

పోటీ ఇక్కడికి పరిమితం కాలేదు. అవతార్ రీ రిలీజ్ లోనూ రికార్డులు సాధించేలా ఉంది. బుకింగ్స్ మంచి జోరు మీదున్నాయి. నేషనల్ సినిమా డే ఆఫర్ ని తెలుగు రాష్ట్రాలకు వర్తింపజేయకపోవడంతో 75 రూపాయలకు కొత్త మూవీస్ ని చూసే ఛాన్స్ మన ఆడియన్స్ మిస్ చేసుకుంటున్నారు. కారణాలు ఏమైనా ఇది మాత్రం తీవ్ర అసంతృప్తిని కలుగజేసిన మాట వాస్తవం. దుల్కర్ సల్మాన్ సన్నీ డియోల్ ల చుప్ కూడా అదే రోజు రానుంది. సినిమా రివ్యూ రైటర్స్ ని చంపే సైకో ఫిలిం మేకర్ కథతో దీన్ని రూపొందించారు. ఫ్రీ ప్రీమియర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. మొత్తానికి కొంచెం డ్రైగా కనిపిస్తున్న ఈ ఫ్రైడేని కంటెంట్ తో ఏవి హిట్టు కొట్టి కాసులు కురిపిస్తాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి