iDreamPost

పీకే ప్రణాళిక ఏమిటి..? టార్గెట్ మోదీయేనా..?

పీకే ప్రణాళిక ఏమిటి..? టార్గెట్ మోదీయేనా..?

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆయన తరపున వ్యూహకర్తగా పని చేసేందుకు సిద్ధమని మూడు రోజుల క్రితం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో మమతా బెనర్జీకి, తమిళనాడులో స్టాలిన్ కు మద్దతు తెలిపిన వారందరినీ కలిసి కృతజ్ఞతలు చెబుతున్నానని.. అందులో భాగమే పవార్ తో భేటీ అని ప్రశాంత్ మీడియాకు చెప్పినా.. దాని వెనుక ఏదో ఉందన్న చర్చ మొదలైంది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కోరుకోవడం.. ఆ వెంటనే పవార్ ను కలవడానికి లింక్ ఉందని అంటున్నారు.

బెంగాల్లో బీజేపీ పెట్టిన ఇబ్బందులను తట్టుకొని మమత గెలవడంలో పీకే వ్యూహాలు బాగా ఉపకరించాయి. ఆ ఎన్నికల సందర్బంగానే బీజేపీ నేతలు, పీకే మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అప్పటి నుంచే బీజేపీని టార్గెట్ చేసిన పీకే.. సందర్భం వచ్చినప్పుడల్లా కమల దళపతులు మోదీ, అమిత్ షాలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా మిషన్ 2024 ప్రారంభించారని అంటున్నారు. ఆ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీయేను ఎదుర్కోగలిగే బలమైన ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజల ముందుకు తేవాలన్నది మిషన్ 2024 లక్ష్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైఫల్యాలతో ఇప్పటికే ప్రధాని మోడీపై ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడింది. ఎన్నికలనాటికి ఆయన ప్రభ పూర్తిగా మసకబారుతుందని ప్రశాంత్ భావిస్తున్నారు. మోదీకి ధీటైన ప్రధాని అభ్యర్థిని ప్రజలకు చూపించగలిగితే విజయం తథ్యమని భావిస్తున్న ఆయన ఎన్డీయేకు వ్యతిరేకంగా మిగిలిన జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. అందులో భాగమే రాహుల్ పై వ్యాఖ్యలు, పవార్ తో సమావేశమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సఖ్యత సాధ్యమేనా?

ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలన్న ఆలోచన బాగానే ఉన్నా… రాహుల్ ప్రధాని అభ్యర్థి అవ్వాలని కోరుకుంటున్న పీకే.. అదే సమయంలో శరద్ పవార్ తో భేటీ కావడమే పలు సందేహాలకు తావిస్తోంది. ఆయన వ్యూహం ఏమిటన్న ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే రాజకీయ కురువృద్ధుడైన శరద్ పవార్ ఒకప్పుడు ప్రధాని పదవికి పోటీ పడి భంగపడ్డారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహించే విషయంలో శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీలు పీవీ నరసింహారావుతో పోటీ పడ్డారు. చివరికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పీవీని ప్రధానిగా ఎన్నుకుంది. అలాగే 1999 ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో ఇటాలియన్ అన్న కారణంతో సోనియాగాంధీ కి వ్యతిరేకంగా పవార్, పి.ఏ.సంగ్మా, తారక్ అన్వర్ లు గళమెత్తారు. దాంతో పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అప్పుడే వారు ముగ్గురూ కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

అయితే ఆ తర్వాత పరిణామాల్లో మహారాష్ట్రలో అధికారం కోసం, కేంద్రంలో ఎన్డీయే ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, యూపీఏ కూటమితో జట్టు కట్టారు. అటువంటి పవార్ తనకు తీరని కలగా మిగిలిన ప్రధాని పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించాల్సి వస్తే.. తనకు వద్దనుకొని.. రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారా..అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అలాగే ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెసుకు మద్దతు కూడగడతారా లేక ప్రతిపక్షాలన్నింటిని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని రంగంలోకి దించడం పీకే వ్యూహమా అన్న దాంట్లో స్పష్టత కనిపించడం లేదు. మరోవైపు స్వతంత్రంగా వ్యవహరించే టీఆర్ ఎస్, వైఎస్సార్సీపీ వంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో జట్టు కట్టేందుకు ముందుకొస్తాయా.. ఆ విషయంలో ప్రశాంత్ కిశోర్ కు సహకరిస్తాయా.. అన్నది అనుమానమే. వాటిని ఒప్పించేందుకు కూడా పీకే వద్ద వేరే వ్యూహాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు గానీ.. ఇప్పటికైతే మిషన్ 2024 పేరుతో మోదీ టార్గెట్ చేస్తున్నట్లు మాత్రం స్పష్టం అవుతోంది.

Also Read : ఆంధ్రప్రదేశ్‌లో అధికారులకు అంత పవర్‌ ఇచ్చారా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి