iDreamPost

దీదీ పిలుపు.. పలికేదెవరు?

దీదీ పిలుపు.. పలికేదెవరు?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఢీ అంటే ఢీ అంటారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీపై విమర్శల దాడి చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పంథాలో ముందుకు వెళ్తున్నారు. కానీ తన ఒక్కరి బలం సరిపోదని అనుకున్నారో, బెంగాల్ లో పట్టుకోల్పోతున్నట్లు భావించారో ఏమో.. దేశంలోని పలు పార్టీల నేతలకు లెటర్లు రాశారు. బీజేపీపై పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరి దీదీ పిలిస్తే పలికేదెవరు? మోడీ ఆధ్వర్యంలోని బీజేపీతో పోరాటానికి ఆమెతో కలిసి వచ్చేదెవరు?

ఎవరి కూటములు వాళ్లకున్నయ్

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా 14 మంది బీజేపీయేతర పార్టీల లీడర్లకు మమతా బెనర్జీ లెటర్లు రాశారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని.. ఆ పార్టీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. మమత లెటర్లు రాసిన పార్టీల్లో.. శివసేన, డీఎంకే, ఎన్సీపీలు కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నాయి. ఇక కాశ్మీర్ కు పరిమితమైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్.. ఇప్పటికే అక్కడ ఓ కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. ఇక బీజేడీ.. ఒడిశాను దాటి బయటికి రాదు. కేంద్రంలోని బీజేపీతో పోరాడదు.. అలాగని దోస్తీ చేయదు. పాము చావకుండా కట్టె విరగకుండా వ్యవహారం నడిపిస్తుంది. కేంద్రం తీరుపై కేజ్రీవాల్ మొదటి నుంచి గుర్రుగానే ఉన్నారు. తన అధికారాల విషయంలో వేలు పెడుతోందంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఏ కూటమిలోనూ లేరు.

జగన్ ఎటువైపు?

ఏపీ సీఎం వైఎస్ జగన్.. స్థానికంగా బీజేపీతో పోరాటం చేస్తున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటోళ్లకు మద్దతు ఇస్తామని ఆయన గతంలోనే ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఇప్పటికే వ్యతిరేకించారు. ఈ మధ్య జరిగిన రాష్ట్ర బంద్ కు మద్దతు ప్రకటించారు. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించారు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను మాత్రం సమర్థించారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆచితూచి అడుగోలు వేస్తున్నారు.

Also Read : అయ్యో బాబూ.. దీదీకి అక్కరకు రాకుండా పోయావే!

గతంలో కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’

గత లోక్ సభ ఎన్నికలకు ముందు ‘ఫెడరల్ ఫ్రెంట్‘ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. మమతాబెనర్జీ, స్టాలిన్, జగన్ సహా పలువురు ముఖ్యమంత్రులు, లీడర్లను కలిశారు. రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ‘సారు.. కారు.. పదహారు’ నినాదంతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 సీట్లు ఉన్న తెలంగాణలో.. కేవలం 9 సీట్లకే పరమితమైంది. అటు దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడిచింది. 2014లో కంటే ఎక్కువ సీట్లు 2019లో ఆ పార్టీకి వచ్చాయి. దీంతో ఫెడరల్ ఫ్రంట్ అటకెక్కింది. అప్పడప్పుడు ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నా.. పూర్తి స్థాయిలో ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదు.

కూటమిలోకి కాంగ్రెస్ వస్తే..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా మమతా బెనర్జీ లెటర్ రాశారు. అయితే తన ఆధ్వర్యంలోని యూపీఏని కాదని, మమత కూటమిలోకి కాంగ్రెస్ వస్తదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక వేళ వచ్చినా.. చాలా పార్టీలకు కాంగ్రెస్ తో పోటీ ఉంది. ఏపీనే ఉదాహరణగా తీసుకుంటే.. విభజన విషయంలో కాంగ్రెస్ తీరుపై ఇప్పటికీ ప్రజల్లో కోపం ఉంది. ఈ సెంటి మెంట్ ను కాదని కాంగ్రెస్ తో వైసీపీ కలుస్తుందా అంటే అది దాదాపు అసాధ్యం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి పుట్టుకొచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ.. ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్ తో పోరాడుతున్నారు కేజ్రీవాల్. కూటమిలో కాంగ్రెస్ చేరితే ఆయన దూరంగానే ఉండిపోవచ్చు.

థర్డ్ ఫ్రంట్ వస్తదా?

మమత ప్రతిపాదన ఇంకా ప్రపోజల్ దశలోనే ఉంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉంది. ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. అయితే నాన్ బీజేపీ కూటమి ఏర్పాటు కార్యరూపం దాల్చితే థర్డ్ ఫ్రంట్ ఉనికిలోకి రావచ్చు. భవిష్యత్ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకోవచ్చు. బీజేపీ ఇటీవల తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి మమత చొరవ.. పెను మార్పులకు కారణమవుతుందా? కొత్త ఫ్రంట్ ఏర్పాటు అవుతుందా? బీజేపీయేతర పార్టీలు కలిసి వస్తాయా? అనేది తెలియాలంటే.. వెయిట్ అండ్ సీ!!

Also Read : నందిగ్రామ మహాసంగ్రామం నేడే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి