iDreamPost

‘జమిలి’ వస్తే.. జీహెచ్‌ఎంసీకి మళ్లీ ఎన్నికలా..?

‘జమిలి’ వస్తే.. జీహెచ్‌ఎంసీకి మళ్లీ ఎన్నికలా..?

ఇప్పుడు దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన బాగా వస్తోంది. దేశానికి జమిలి ఎన్నికల అవసరం ఉందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. ‘‘దేశంలో ప్రతి రెండు నెలలకూ ఓ సారి ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటికి పది సార్లు ఓటర్ల జాబితా తయారుచేయడం వల్ల బోలెడు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ’’ అని అన్నారు. దీంతో జమిలి ఎన్నికల ప్రస్తావన ప్రతిచోటా వస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. 9 రోజుల క్రితమే గ్రేటర్‌ ఎన్నికలు జరిగాయి. 5 రోజుల క్రితమే ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ 2 స్థానాలు సాధించాయి. అనంతరం గెలుపొందిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రం జమిలి ఎన్నికల విషయంలో ముందుకు వెళ్తోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్‌ ఎన్నికల గుణపాఠాన్ని దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికల్లో సత్తా చాటాలి’’ అని చెప్పారు.

ఇదంతా ఒక ఎత్తయితే.. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి కూడా సంచలన కామెంట్స్‌ చేశారు. జమిలి ఎన్నికలంటే శాసన, లోక్‌సభలకే కాదని.. జీహెచ్‌ఎంసీకీ ఎన్నికలొస్తాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అదే జరిగితే ఇప్పుడు గెలిచామన్న ఆనందం కూడా కార్పొరేట్లకు ఉండబోదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచినోళ్లు పదవులు అనుభవిస్తారని అనుకోవాల్సిన పని లేదని, టీఆర్‌ఎస్‌ వాళ్ల మాటలు చూస్తుంటే స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు.

పరిణామాలు చూస్తుంటే ఏడాది నుంచి రెండేళ్ల పాటు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన రావచ్చన్నారు. తన క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమైన రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు సాధ్యమా..? కాదా..? అన్న ప్రశ్నలు అటుంచితే గ్రేటర్‌ ఎన్నికలు జరిగిన పది రోజుల లోపే జమిలి ఎన్నికలంటే జీహెచ్‌ఎంసీకి కూడా మళ్లీ ఎన్నికలొస్తాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి