iDreamPost

బీజేపీకి అగ్ని పరీక్ష.. సుజనా, కామినేనిలపై చర్యలు తీసుకుంటుందా..?

బీజేపీకి అగ్ని పరీక్ష.. సుజనా, కామినేనిలపై చర్యలు తీసుకుంటుందా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు నిమ్మగడ్డతో రహస్యంగా భేటీ అవడం సరికొత్త రాజకీయానికి తెరలేచింది. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు నిమ్మగడ్డతో దాదాపు గంటన్నరపాటు సమావేశమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఈసీ పదవి వివాదం ప్రస్తుతం సుప్రిం కోర్టులో ఉన్న నేపథ్యంలో మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో బీజేపీ నేతలు భేటీ అవడాన్ని అన్ని వర్గాలు తప్పుబడుతున్నాయి.

వివాదాస్పద అధికారి అయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో బీజేపీ నేతలు ఎందుకు భేటీ కావాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. బీజేపీ అధిష్టానం సూచన మేరకే సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో భేటీ అయ్యారా..? లేక తమకు తాముగానే వెళ్లి సమావేశమయ్యారా..? అనే మౌలిక ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు భేటీ అయితే వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవు. కానీ బీజేపీ అధిష్టానం ఆదేశాలు లేకుండా, వారికి తెలియకుండా వీరు నిమ్మగడ్డతో రహస్యంగా భేటీ అయి ఉంటే మాత్రం వారిపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారనే మాట వినపడుతోంది.

ఇటీవల పార్టీ విధానాలకు భిన్నంగా, తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడారనే కారణంతో ముగ్గురు ఏపీ బీజేపీ నేతలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఒకే రోజు ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా.. మరొకరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. నేతలు కట్టు దాటితే వేటు తప్పదనే సంకేతాలు బీజేపీ అధిష్టానం ఇచ్చింది. సాక్షి టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కొంత మంది బీజేపీ నేతలకే అనుమతి ఉండగా.. అనుమతి లేకపోయినా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారని పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయగా, ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌ అయిన అచ్చెం నాయుడుకు మద్ధతుగా మాట్లాడిన విషయంపై కిలారు దిలీప్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారనే కారణంతో మాజీ ఎమ్మెల్యే అయిన చిన్నం రామకోటయ్యపై మీడియా చర్చల్లో పాల్గొనడంపై ఆంక్షలు విధించింది.

ఇలాంటి చిన్న విషయాలనే సీరియస్‌గా తీసుకున్న బీజేపీ నేతలకు స్పష్టమైన సంకేతాలు పంపింది. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అంశం ఓ వైపు సుప్రింకోర్టులో కొనసాగుతుండగా.. బీజేపీ నేతలైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు ఆయనతో రహస్యంగా భేటీ అవడం ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య జరుగుతున్న వివాదంలో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు తలదూర్చడం ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.

ఈ మొత్తం వ్యవహారంలో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు టీడీపీ వ్యూహంలో భాగస్వాములయ్యారనే స్పష్టమవుతోంది. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు బినామీగా ప్రచారంలో ఉన్న సుజనా చౌదరి టీడీపీని వదిలి బీజేపీలో చేరినా.. నేటికి ఆయన చంద్రబాబు కనుసన్నల్లోనే, టీడీపీ ప్రయోజనాలు కాపాడేందుకు, ఆ పార్టీ తరఫున రాజకీయాలు చేస్తున్నారని పార్క్‌ హయత్‌ రహస్య భేటీ స్పష్టం చేస్తోంది. సుజనాతోపాటు కామినేని కూడా అదే బాటలో పయనిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వీరిపై చర్యలు తీసుకుంటుందా..? లేదా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి