iDreamPost

పొలాల్లో వజ్రాల పంట, లక్షలు పోగేసుకుంటున్న రైతులు

పొలాల్లో వజ్రాల పంట, లక్షలు పోగేసుకుంటున్న రైతులు

పొలంలో పంట కోసం వెళ్ళారు వాళ్ళు. కానీ ఏకంగా వజ్రాల పంటే వారి ఇంట పండింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జరిగిన ఈ అద్భుతం రెండు కుటుంబాల దశనే మార్చేసింది. జి. ఎర్రగుడిలో ఓ రైతు కుటుంబానికి చెందిన యువతి సొంత ఆముదం పొలంలో కలుపు తీస్తోంది. ఇంతలో ఓ రాయి తళుక్కుమని మెరిసింది. ఇంట్లోవాళ్ళకు చూపిస్తే వాళ్ళు దాన్ని వజ్రం అని తేల్చారు. వజ్రం బరువు దాదాపు పది కేరెట్లు. దాన్ని అమ్మితే వచ్చిన నగదు అక్షరాలా 34 లక్షలు! అదనంగా 10 తులాల బంగారం కూడా వచ్చింది. పెరవలి, జొన్నగిరి, గుత్తికి చెందిన వ్యాపారులు సిండికేట్ అయి మరీ ఈ మొత్తం ఇచ్చి వజ్రాన్ని కొనుక్కున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇదే మండలానికి చెందిన జొన్నగిరిలో టామాటా తోటలో కాయలు కోసేందుకు వెళ్ళిన ఓ మహిళా కూలీని అనుకోని అదృష్టం వరించింది. పొలంలో రంగురాయి ఒకటి కనిపించింది. ఆ మహిళ దాన్ని ఓ వ్యాపారికి చూపించింది. అతను దాన్ని వజ్రమని తేల్చి 6 లక్షలు పెట్టి మరీ కొనుక్కున్నాడు. ఇలా ఈ సంవత్సరంలో జొన్నగిరి, జి. ఎర్రగుడి, పగిడిరాయి, గిరిగెట్ల గ్రామాల్లో ఏడు వజ్రాలు దొరికాయి.

ప్రతి ఏడూ తొలికరి సమయంలో ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతుంటాయి. వీటిని వెతకడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చేవాళ్ళ సంఖ్య ఈసారి మరీ ఎక్కువగా ఉండడంతో జొన్నగిరి రైతులు కాపలాకు మనుషుల్ని పెట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి