iDreamPost

భారత జట్టులో ధోనీ కెరీర్ ముగిసినట్లేనా?

భారత జట్టులో ధోనీ కెరీర్ ముగిసినట్లేనా?

ధోని క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు అద్వితీయమైన,చారిత్రక విజయాలు అందించి, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు పొందాడు. కానీ ఇప్పుడు ధోనీ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అన్న సంకేతాలు వస్తుండటంతో ధోనీ అభిమానులు నిరుత్సాహానికి లోనవుతున్నారు.

గత కొన్ని రోజులుగా ధోని రిటైర్మెంట్ పై భారత క్రికెట్ అభిమానుల్లో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ధోనీ వచ్చే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడితే బాగుంటుందని ధోని అభిమానులు ఆశిస్తుండగా బీసీసీఐ మాత్రం భారత క్రికెట్ జట్టులో ధోనీకి స్థానం ఇవ్వడం లేదు. ఒంటిచేత్తో విజయాలను అందించిన ధోనీ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

గతంలో ఒక ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ధోని త్వరలో రిటైర్ అవ్వబోతున్నాడని సంకేతాలు ఇవ్వడంతో ధోనీ అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. ఒకవేళ ఐపీఎల్ లో రాణిస్తే వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేస్తామని ఇప్పుడు అతని కెరీర్ అతని చేతుల్లోనే ఉందని రవిశాస్త్రి చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. దానికి తోడు ధోనీ త్వరలోనే రిటైర్ అవ్వబోతున్నాడని సూచనప్రాయంగా తెలిసిందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ధోనీకి దక్కని బీసీసీఐ కాంట్రాక్టు

తాజాగా 2019-20 సంవత్సరానికి గానూ 27 మంది సభ్యులతో కూడిన కాంట్రాక్టు లిస్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ధోని పేరు లేకపోవడం అయన అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగించింది. ఒకరకంగా ధోనీకి బీసీసీఐ షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. గత వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇండియా ఓడిపోయినప్పటి నుండి ధోనీ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. కాగా తాజాగా ప్రకటించిన లిస్ట్ లో ధోని పేరు లేకపోవడంతో భారత క్రికెట్ జట్టులో ధోనీ కెరీర్ చివరిదశకు చేరుకుందని బీసీసీఐ సంకేతాలు ఇచ్చినట్లయ్యింది . దాంతో ధోని త్వరలోనే అధికారికంగా తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

తాజా జాబితాలో ధోనికి చోటు లభించకపోవడం ఒక విశేషం అయితే రాహుల్ కి ఏ గ్రేడ్ దక్కడం మరో విశేషం.. బి గ్రేడ్ లో ఉన్న రాహుల్ ఏ గ్రేడ్ లో చోటు దక్కించుకున్నాడు. కాగా ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్ కు 7 కోట్లు, ఏ గ్రేడ్ కు 5 కోట్లు, బి గ్రేడ్ కు మూడు కోట్లు, సి గ్రేడ్ కు 1 కోటి రూపాయల చొప్పున బీసీసీఐ ఆటగాళ్లకు చెల్లించనుంది.

ఏ+ కాంట్రాక్టులో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా ఉండగా, ఏ గ్రేడ్ లో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, రాహుల్, ధవన్, షమి, ఇషాంత్, కుల్దీప్,రిషబ్ పంత్‌ ఉన్నారు.

ఇక బీ గ్రేడ్‌లో సాహా, ఉమేశ్, చాహల్, పాండ్యా, మయాంక్‌… సీ గ్రేడ్‌లో జాదవ్, సైనీ, చాహర్, మనీశ్ పాండే, విహారీ, శ్రేయాస్, వాషింగ్టన్ సుందర్‌ ఉన్నారు.

సి గ్రేడ్ లో కేదార్ జాదవ్, నవదీప్ సైని,దీపక్ చాహర్,మనీష్ పాండే,హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్,శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ లు చోటు దక్కించుకున్నారు.

తాజా జాబితాలో చోటు దక్కక పోవడంతో ధోనీ కెరీర్ ముగిసినట్లే అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి