iDreamPost

అభివృద్ధి అంటే .. చంద్రబాబు అలా, జగన్ ఇలా

అభివృద్ధి అంటే .. చంద్రబాబు అలా, జగన్ ఇలా

 అభివృద్ధి అంటే ఏమిటనే విషయంలో ఆర్థికవేత్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రంగురంగుల మేడలు, వెడల్పయిన రోడ్లు, హంగులు, ఆర్భాటాలు అసలైన అభివృద్ధి అనే నమ్మేవాళ్లున్నారు. దానికి భిన్నంగా సామాన్యుడి అవసరాలు తీర్చడం, వారికి అన్ని విధాలా అండగా ఉంటూ, స్వయం శక్తితో ఎదిగేందుకు తోడ్పడడమే అభివృద్ధి అని విశ్వసించే వాళ్లు కూడా ఉన్నారు. వర్తమాన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ రెండు రకాల ఆలోచనలకు ఇరువురు ప్రధాన నేతలు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేసి, కార్పోరేట్ బడాబాబులను ఆకర్షించడమే అసలైన అభివృద్ధి అని చంద్రబాబు భావించారు. దానిని ఆచరణలో చూపేందుకు శ్రమించారు. ఆ క్రమంలో ప్రజలకు ఆయన చూపించిన గ్రాఫిక్సులు, ఫారిన్ ట్రిప్పుల్లో చేసిన డిజైన్లు జనాలకు మరీ అతిగా కనిపించడంతో ఆయన్ని దూరం పెట్టేశారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ భిన్నమైన దారిలో ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధికి అసలు నిదర్శనంగా జనాలకు మేలు చేయడమేనని ఆయన భావిస్తున్నారు. భారీ హంగామా లేదు.. రాజధాని నిర్మాణం పేరుతో ఫారిన్ టూర్లు, భారీ ప్రచారాలు లేవు. సినిమా స్టార్లతో ఆర్బాటాలు లేవు. పూర్తిగా ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. అదే సమయంలో విద్య, వైద్య రంగాలను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల ఆలనాపాలనా మరచిని ప్రభుత్వాల మూలంగా ప్రజలకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్న సంగతిని ఆయన గుర్తించారు. తాను గమనించిన వాటిని సరిదిద్దే చర్యలకు పూనుకున్నారు. నాడు-నేడుతో మళ్లీ పూర్వ వైభవం దిశగాప్రభుత్వ రంగం పయనిస్తోంది.

అదే సమయంలో సముద్ర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పోర్టులు, జెట్టీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. బందరు పోర్టు వంటి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసే దిశలో సాగుతున్నారు. మూడు పోర్టులు, 8 జెట్టీలతో ఆంధ్రప్రదేశ్ తీరమంతా అదిరిపోయే స్థాయికి చేరుస్తున్నారు. ఇక కడప స్టీల్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీసిటీ, అనంతపురం ఆటోమోబైల్ హబ్ తో పాటుగా కడప సమీపంలో వస్తున్న ఇతర పరిశ్రమలతో రాయలసీమ పారిశ్రామిక పరుగులు పెడుతోంది. కడప స్టీల్ పరిశ్రమ కార్యరూపం దాలిస్తే కొత్త రూపు సంతరించుకుంటుంది. విశాఖ- చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ ని ప్రచారం దశ నుంచి కార్యరూపం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో కొత్త పరిశ్రమల ఏర్పడు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. కాకినాడ సెజ్, కృష్ణపట్నం తీరంలో కూడా అదే పంథాలో అభివృద్ధికి మార్గాలు అన్వేషిస్తున్నారు.

నేరుగా ప్రజలకు సంక్షేమ చర్యతో కొంత ప్రయోజనం కలుగుతోంది. ఇక నాడు-నేడు వంటి పథకాల ద్వారా ప్రైవేటు ఫీజులకు వెచ్చించే మొత్తం పేదలకు మిగులుతోంది. వాటికి తోడుగా అందరికీ ఇళ్ల పథకంలో ప్రతీ కుటుంబానికి కనీసంగా నెలకు రూ. 50వేలు మిగిల్చే దిశలో అడుగులు వేశారు. ఇలా ప్రజల అభివృద్ధి వారి కుటుంబాల పురోభివృద్ధికి తోడ్పడుతుందని జగన్ విశ్వసిస్తున్నారు సామాన్యుల్లో కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్ పుంజుకుంటుందని, అదే నిజమైన అభివృద్ధి అని విశ్వసించడమే కాకుండా ఆచరణలో చూపిస్తున్నారు. బాబుకి భిన్నమార్గాల్లో జగన్ పయనిస్తున్న తీరు ఆసక్తిగా కనిపిస్తోంది. అందరినీ ఆకర్షిస్తోంది. ప్రజలకు నేరుగా ప్రయోజనాలు దక్కుతున్న తరుణంలో జగన్ కి ఆదరణ దక్కుతోంది. కార్పోరేట్ల సీఈవో కాకుండా సాధారణ ప్రజల ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారనే సంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి