iDreamPost
android-app
ios-app

రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలన్న కుమార్తె.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?

  • Author singhj Published - 06:36 PM, Sat - 26 August 23
  • Author singhj Published - 06:36 PM, Sat - 26 August 23
రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలన్న కుమార్తె.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?

మన దేశంలో ప్రజలు సంబురంగా జరుపుకునే పండుగల్లో ఒకటి రాఖీ. ఈ పండుగ నాడు ప్రతీ ఆడపిల్ల తన సోదరుడికి రాఖీ కట్టాలని భావిస్తుంది. దీని వల్ల జీవితంలోని భయాలను పోగొట్టి, ఆపదల నుంచి రక్షిస్తారని నమ్ముతారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడాల్లేకుండా అంతటా ఈ ఫెస్టివల్​ను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఓ బాలిక కూడా గత కొన్నేళ్లుగా తన అన్నకు రాఖీ కడుతోంది. అయితే ఆమె అన్న ఇటీవల చనిపోయాడు. దీంతో ఈ ఏడాది ఎవరికి రాఖీ కట్టాలని ఆ బాలిక తన పేరెంట్స్​ను అడిగింది. చనిపోయిన అన్నను మళ్లీ తీసుకురావాలని కోరింది.

రాఖీ కట్టేందుకు అన్న కావాలంటూ మారాం చేసిన బాలికను ఆమె తల్లిదండ్రులు సర్దిచెబుతూ, సముదాయిస్తూ వచ్చారు. కానీ ఆమె పట్టుబడటంతో పేరెంట్స్ ఓ ఉపాయాన్ని ఆలోచించారు. అదే వారి పాలిట ఇప్పుడు శాపంగా మారింది. ఢిల్లీకి చెందిన సంజయ్ గుప్తా, అనితా గుప్తాకు 17 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కూతురు సంతానం. అయితే వారి కొడుకు ఇటీవల ప్రమాదవశాత్తూ చనిపోయాడు. దీంతో మరణించిన అన్నను మర్చిపోలేని చెల్లి.. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టాలని డిసైడ్ అయింది. పేరెంట్స్ సముదాయించినా ఆమె వినిపించుకోలేదు. దీంతో బాలిక మారాం తట్టుకోలేక ఒక మగ పిల్లాడ్ని కిడ్నాప్ చేయాలని పేరెంట్స్ భావించారు.

ఫుట్​పాత్ మీద నిద్రిస్తున్న ఓ పేద కుటుంబానికి చెందిన నెల వయసు గల మగ శిశువును గురువారం రాత్రి సంజయ్ గుప్తా దంపతులు కిడ్నాప్ చేశారు. అయితే తల్లిదండ్రులు లేచేసరికి బిడ్డ కనిపించకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తును ఆరంభించిన పోలీసులు.. దాదాపు 400 సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో అనుమానాస్పదంగా కనిపిస్తున్న సంజయ్ బైక్​ను గుర్తించారు. దాని ఆధారంగా అతడు ఉండే ప్రాంతాన్ని గుర్తించారు. దీంతో అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు.. సంజయ్, అనితను అరెస్ట్ చేశారు. వాళ్లను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. కూతురు రాఖీ కట్టాలనే కోరిక తీర్చేందుకే చిన్నారిని అపహరించామని ఒప్పుకున్నారు. సంజయ్​ మీద గతంలో మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.