iDreamPost

రాజధాని వికేంద్రీకరణపై కదలిక

రాజధాని వికేంద్రీకరణపై కదలిక

రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా వైసీపీ సర్కార్‌ ఏర్పాటుచేయతలపెట్టిన రాజధాని వికేంద్రీకరణ వ్యవహారంపై మళ్లీ కదలిక మొదలైంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు, ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై రోజు వారీ విచారణ చేపట్టాలని ఏపీ హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు మే 3వ తేదీ నుంచి విచారణ ప్రారంభిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి (ఎ.కె.గోస్వామి) వెల్లడించారు. సమగ్ర విచారణను రెండు నెలల సమయం పడుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ.. ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖలో కార్యనిర్వాహఖ రాజధాని, రాయలసీమలోని కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటుకు వైసీపీ సర్కార్‌ అడుగులు వేసింది. మూడు రాజధానుల ఏర్పాటుకు శాసనపరమైన ఆమోదం కూడా లభించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ స్థానిక రైతులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై గతంలో సుప్రిం కోర్టు ఆదేశాలతో ఏపీ హైకోర్టులో రోజు వారీ విచారణ జరిగింది. విచారణ జరుగుతున్న సమయంలో అప్పటి చీఫ్‌ జస్టిస్‌ జె.కె.మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ కావడంతో ఆ విచారణ మధ్యలోనే ఆగిపోయింది. ఈ పిటిషన్లపై తాజాగా విచారించిన చీఫ్‌ జస్టిస్‌ ఎ.కె.గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి ఎ.కె.గోస్వామి, జస్టిస్‌ బాగ్చీ, జస్టిస్‌ జయసూర్యలతో కూడిన ధర్మాసనం మూడు రాజధానులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరపనుంది.

Also Read : బంగ్లాదేశ్ ఏర్పడి… నేటికి 50 ఏళ్లు

2019 డిసెంబర్‌లో ఏపీ శాసన సభలో మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించారు. అప్పటి నుంచి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై వెనకడుగు వేసేది లేదని వైసీపీ ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది.

గురువారం కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభోత్సం సందర్బంగా సీఎం వైఎస్‌జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర న్యాయరాజధానిలో అందుబాటులోకి వచ్చిన విమానాశ్రయం నుంచి ఇతర రాష్ట్ర రాజధానులకు విమాన సేవలు ప్రారంభం కాబోతున్నాయంటూ సీఎం వైఎస్‌జగన్‌ మాట్లాడడంతో మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్‌ ఉద్దేశం స్పష్టమైంది.

దాదాపు 15 నెలల క్రితం పురుడుపోసుకున్న మూడు రాజధానులు అంశం.. కరోనా, కోర్టు కేసులు వంటి కారణాలతో ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా రెండు నెలల్లో అన్ని పిటిషన్లను విచారిస్తామని ఏపీ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో.. మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఓ కొలిక్కి రావడం ఖాయమైంది. సుప్రిం కోర్టు ఆదేశాలతో ఏపీ హైకోర్టు ఈ పిటిషన్లను విచారిస్తున్న నేపథ్యంలో పిటిషన్‌దారులు మళ్లీ సుప్రిం కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉండబోదు.

Also Read : బొజ్జల కుటుంబానికి రాజకీయ పూర్వవైభవం సాధ్యమేనా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి