iDreamPost

నేరం తీరు మారుతోంది

నేరం తీరు మారుతోంది

ఒకప్పుడు జరిగే నేరాల్లో బాధితుడు, నిందితుడు ఇద్దరూ కూడా ప్రత్యక్షంగానే భాగమయ్యేవారు. నేరుగా నిందితులు దోపీడీకి పాల్పడడం.. పర్సులు కొట్టేయడం.. ఇళ్ళకు కన్నాలేయడం.. ఇలాంటి నేరాలు జరుగుతుండేవి. ఇటువంటి వాటిలో ఏదో ఒక క్లూ దొరికతే ఆ తీగతో సమర్ధులైన అధికారులు డొంకనే కదిపేసేవారు.

అయితే ఇప్పుడు నడుస్తున్న ఆధునిక ఆన్‌లైన్‌ ట్రెండ్‌లో నేరం తీరే పూర్తిగా మారిపోతోంది. బాధితుడికి సంబంధించి వెంట్రుకంత అవకాశం దొరికినా నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. మనకు తెలియకుండానే మన అక్కౌంట్‌లో నుంచి డబ్బులు దోచేస్తున్నారు. నేరస్తులు ఎక్కడో కూర్చుని ఆన్‌లైన్‌లో వేసే గాలానికి బాధితులు చిక్కుకుంటున్నారు. వేల నుంచి లక్షల వరకు పోగొట్టుకుని లబోదిబో మంటున్నారు. తెలియక బాధితులుగా మారే వారు కొందరైతే.. అత్యాశతో బాధితులవుతున్నవారు ఇంకొందరు ఉంటున్నారు. ప్రతి యేటా ఇలా ఆన్‌లైన్‌ రూపంలో జరుగుతున్న నేరాలు పెరిగిపోతుండడం ఇప్పుడు సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పోలీసు భాషలో సైబర్‌ నేరాలుగా వ్యవహరిస్తున్న ఈ కేసులు ప్రతియేటా అంతకంతకు ఎక్కువవుతూనే ఉంటున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఒక్క హైదరాబాదులో జరిగిన నేరాల నివేదికను పరిశీలిస్తే ఈ కేసులు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. హైద్రాబాదులో 2017లో 325 కేసులు నమోదయ్యాయి. 2018లో 428 సైబర్‌ మోసాలు జరిగితే, 2019లో అవి 1,383కి పెరిగాయి. ఇక 2020లో 2,456 కేసులు నమోదయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ ఒక్క మహానగరంలోనే 2017తో పోలిస్తే పది రెట్లు సైబర్‌ మోసాలు జరిగాయంటే ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో ఏ స్థాయిలో జరుగుతున్నాయో అంచనా వేయొచ్చు.

ఇటీవల గుర్తించిన పలు కేసుల విషయంలో నేరస్తులను ఇతర రాష్ట్రాల నుంచి కూడా పట్టుకు వచ్చి విచారించారు. అయితే ఇదే విషయం ప్రతి కేసులోనూ సాధ్యం అవుతుందన్న నమ్మకం పెట్టుకోవడం తగదన్నది గుర్తించుకోవాల్సిన విషయం. ఇది నేరస్తుల ఆచూకీ లభించినప్పుడు మాత్రమే చేయగలుగుతారు.

లాక్డౌన్‌ పేరు చెప్పి ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ ద్వారానే అన్ని కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. సరిగ్గా ఇదే సైబర్‌ నేరగాళ్ళకు వరమవుతోందని పలువురు అధికారులు అంటున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టబోయే కొనుగోళ్ళు/అమ్మకాలు, నగదు బదిలీ, బిల్లు చెల్లింపులు తదతర అంశాల విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

నేరం జరిగిన తరువాత బాధపడేకంటే.. నేరం జరక్కుండా ముందుగానే అప్రమత్తంగా ఉండడం మంచిదని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి